శశికళ ఎవరు ? ఆ సత్తా ఉందా: అన్నాడీఎంకే లీడర్ ఝలక్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తున్న నెచ్చెలి శశికళకు సొంత పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు షాక్ ఇచ్చారు. అసలు శశికళ ఎవరు ? ఆమె ఎవరో నాకు తెలీదే అంటూ అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి నంజిల్ సంపత్ మంగళవారం మీడియాకు చెప్పడంతో శశికళ వర్గీయులు ఉలిక్కిపడ్డారు.
గతంలో ఎండీఎంకే నేత వైగోతో పాటు రాజకీయాల్లో ఉన్న నంజిల్ సంపత్ మంచిమాటకారి. ఆయన తమిళ బాషలో అనర్ఘలంగా మాట్లాడగలరు. వైగోతో విభేదాలు వచ్చిన సమయంలో నంజిల్ సంపత్ ఆయనకు దూరం అయ్యారు.
తరువాత జయలలిత అన్నాడీఎంకే పార్టీలోకి నంజిల్ సంపత్ ను ఆహ్వానించారు. జయలలిత సీఎం అయిన తరువాత అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. తమిళనాడు రాష్ట్రం మొత్తం తిరిగి పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపడానికి నంజిల్ సంపత్ కు జయలలిత స్వయంగా 2012లో కొత్త ఇన్నోవా కారు తీసిచ్చారు.

జయలలిత దగ్గర నంజిల్ సంపత్ కు మంచి గుర్తింపు ఉంది. జయలలిత మరణించిన తరువాత నంజిల్ సంపత్ పార్టీ నేతలకు దూరం అవుతూ వచ్చారు. ఇంతలో ఏమి జరిగిందో ఏమో జయలలిత ఇచ్చిన ఇన్నోవా కారును మంగళవారం అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గరకు తీసుకు వెళ్లారు.
అక్కడ ఉన్న పార్టీ నాయకులకు ఇన్నోవా కారు అప్పగించిన నంజిల్ సంపత్ వారికి నమస్కారం పెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను రాష్ట్రం మొత్తం తిరగడానికి జయలలిత ఇన్నోవా కారు ఇచ్చారని గుర్తు చేశారు.
గత 8 నెలల నుంచి తాను ఇంటిలోనే ఉన్నానని, ఆ కారు ఉపయోగించలేదని చెప్పారు. పార్టీ ప్రచారం కోసం తనకు జయలలిత కారు ఇచ్చారని, సొంత అవసరాల కోసం తాను కారు ఉపయోగించలేదని చెప్పారు.
అన్నాడీఎంకే పార్టీని ముందుకు నడిపించే సత్తా శశికళకు ఉందా అని మీడియా ప్రశ్నించగా అసలు శశికళ ఎవరు ? అని నంజిల్ సంపత్ ఎదురు ప్రశ్నించారు. తరువాత శశికళ అన్నాడీఎంకే పార్టీని ముందుకు నడిపించే సత్తా ఉందో ? లేదో ? అనేది ప్రజలకే తెలుస్తుందని అన్నారు.
తాను ప్రస్తుతానికి అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నానని, తాను పార్టీలోనే ఉంటానని చెప్పారు. పార్టీ ప్రచారం కోసం తనను పిలిస్తే తప్పకుండా వెలుతానని నంజిల్ సంపత్ అన్నారు. మొత్తం మీద శశికళకు, ఆమె వర్గీయులకు ఝలక్ ఇచ్చిన అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి నంజిల్ సంపత్ అక్కడి నుంచి తన సొంత కారులో వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications