వెంట్రుకవాసిలో తప్పించుకున్న ఎయిర్ ఇండియా విమానం
Air India flight: దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసిన విషాదకర ఘటన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం. ఈ దుర్ఘటనలో 270 మంది ప్రయాణికులు, మెడికల్ కాలేజీ స్టూడెంట్లు దుర్మరణం పాలయ్యారు. ప్రయాణికుల్లో ఒక్కడు మినహా మిగిలిన వారెవరూ ప్రాణాలతో మిగల్లేదు. ఈ దుర్ఘటనపై దర్యాప్తు ముమ్మరం అయింది. విమాన ప్రమాద పరిశోధన బ్యూరో (AAIB) దర్యాప్తు కొనసాగిస్తోంది.
దీని తర్వాత పలు ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలు వెలుగులోకి వచ్చాయి. తరచూ ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు, భయభ్రాంతులకు గురి చేస్తూ వచ్చాయి. సాంకేతిక లోపాల వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం, టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికి ఫ్లై-బ్యాక్ కావడం వంటి సందర్భాలు ఉన్నాయి.

ఈ పరిణామాల మధ్య ఎయిర్ ఇండియా విమానానికి మరో భారీ ముప్పు తప్పింది. వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి బయటపడింది. ముంబై ఎయిర్ పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన వెంటనే స్కిడ్ అయింది. రన్ వే మీది నుంచి జారి పక్కకు వెళ్లిపోయింది.
కేరళలోని కోచి నుంచి ముంబై వచ్చిన ఎయిర్ ఇండియా 171 విమానం అది. ఈ ఉదయం 7:50 నిమిషాలకు కోచి నుంచి బయలుదేరిన నంబర్ AI 2744 ఫ్లైట్.. 10:10 నిమిషాలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2కు చేరుకోవాల్సి ఉంది.
ముంబైలో కురుస్తోన్న అతి భారీ వర్షాల వల్ల రన్ వేపై అక్కడక్కడ వర్షపు నీరు నిలిచింది. అదే సమయంలో ఈ విమానం ల్యాండింగ్ అయింది. వర్షపు నీటి ప్రభావం వల్ల రన్ వే మీది నుంచి జారిపోయింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు కుదుపులకు గురయ్యారు. ఆందోళన చెందారు.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. గాయాలు కాలేదు. విమానం సురక్షితంగా గేటు వద్దకు చేరుకుంది. ప్రయాణీకులు, సిబ్బంది అందరూ దిగిపోయారు. తనిఖీల కోసం విమానాన్ని అక్కడే నిలిపివేశారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది.
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన మూడు సెకన్ల తర్వాత, ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనను విస్మరించకముందే ముంబై ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియాకే చెందిన మరో ఫ్లైట్ తృటిలో తప్పిన ప్రమాదం నుంచి తప్పించుకోవడం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications