ప్రాణభయంతో ఎయిరిండియా ప్రయాణికులు- ఏం జరుగుతోంది?
Air India: ఎయిరిండియాకు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది. అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ ఉన్నారు. ఈ విమానం జేబీ మెడికల్ కాలేజీ మీద పడటం వల్ల పలువురు వైద్య విద్యార్థులూ తీవ్ర గాయాలపాలయ్యారు.
తాజాగా- శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్‌కతా మీదుగా ముంబై చేరకోవాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఓ ఇంజిన్ లో లోపం ఏర్పడినట్లు పైలెట్లు సకాలంలో గుర్తించగలిగారు. దీనితో విమానాన్ని కోల్ కత ఎయిర్ పోర్ట్ లో నిలిపివేశారు. ప్రయాణివకులందరినీ కిందికి దించివేశారు.

శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన ఈ విమానం ఎయిరిండియా ఏఐ 180 బోయింగ్ 777-200 ఎల్ ఆర్ విమానం ఈ అర్ధరాత్రి దాటిన తరువాత 12:45 నిమిషాలకు కోల్ కతలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. కోల్ కత మీదుగా ముంబైకి బయలుదేరాల్సిన విమానం ఇది.
ఇక్కడ ల్యాండ్ అయిన తరువాత విమానం ఎడమవైపు ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా టేకాఫ్ ఆలస్యం అయింది. అయిదున్నర గంటల పాటు ప్రయాణికులు విమానంలోనే గడిపారు. అప్పటికీ ఈ లోపాన్ని సరిచేయలేకపోవడంతో తెల్లవారు జామున 5:20 నిమిషాలకు ప్రయాణికులందరినీ కిందికి దించేయాల్సి వచ్చింది.
విమాన భద్రత దృష్ట్యా ప్రయాణికులను కిందికి దించాల్సి వచ్చిందని పైలెట్లు వెల్లడించారు. అనంతరం విమానాన్ని టార్మాక్ ట్రాక్ పైకి తరలించారు. సిబ్బంది విమానాన్ని తనిఖీ చేయడం కనిపించింది. అర్ధరాత్రి దాటిన తరువాత 12:45 నిమిషాలకు కోల్ కతకు చేరుకున్న విమానం తెల్లవారు జామున 6 గంటల వరకూ కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు.
మొన్నటికి మొన్న జైపూర్ నుండి దుబాయ్ ఎయిరిండియా ఐఎక్స్ 196 విమానంలో ప్రయాణికులు సుమారు ఐదు గంటల పాటు నరకం అనుభవించిన విషయం తెలిసిందే. విమానంలో ఎయిర్ కండిషనింగ్ పనిచేయకపోవడం వారికి చుక్కలు చూపించింది. సిబ్బంది నుంచి సరైన స్పందన సైతం లేకపోవడంతో ప్రయాణికులను మరింత ఆగ్రహోదగ్రులను చేసింది.
విమానంలో ఏసీ ఉన్నట్టుండి స్తంభించిపోయింది. ఉక్క.పొతతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. ఏసీ ఎందుకు ఆగిపోయింది? మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయంపై సిబ్బంది నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడం వారిని మరంత నిరాశకు గురి చేసింది.












Click it and Unblock the Notifications