విమానంలో కలకలంపై విచారణ: మోడీ స్టాండ్‌బై కాదని..
న్యూఢిల్లీ/విజయనగరం: భద్రతా విన్యాసాల్లో భాగంగా చేపట్టిన మాక్ డ్రిల్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా, భద్రతా బలగాలను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 747 విమానం... శనివారం తెల్లవారుజామున జెడ్డాకు చేరిన సమయంలో బిజినెస్ శ్రేణిలో సిబ్బంది ఆ వస్తువును గుర్తించారు.
తొలుత దీనిని గ్రెనేడ్‌గా అనుమానించారు. ఆ విమానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించిన సమయంలో ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ విమానమని వార్తలు రావడంతో కలకలం రేగింది. దీంతో ఎయిర్ ఇండియా, భద్రతా సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జెడ్డాలో ఆ విమానం దిగిన సమయంలో దానిని గుర్తించిన సిబ్బంది.. స్థానిక భద్రతా సంస్థలకు సమాచారమిచ్చారు.
ఆ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన సిబ్బంది.. అది ప్లాస్టిక్ చుట్టగా వారు నిర్ధారించినట్లుగా ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాక ఆ విమానం ప్రధాని ఆమెరికా పర్యటనలో ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ విమానం కాదని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. కాగా, ఇందుకు సంబంధించి ఉద్యోగులను సస్పెన్షన్ చేశారు.

కాగా, ఎయిర్ ఇండియా బోయింగ్ 747 విమానంలో నిర్వీర్యం చేసిన స్టన్ గ్రెనేడ్ (డమీ గ్రెనేడ్) ఎలా వచ్చిందనే విషయమై దర్యాప్తు జరుపుతున్నామని పౌరవిమానయాన శాఖా మంత్రి అశోక గజపతిరాజు చెప్పారు. శనివారం విజయనగరంలోని అశోక్‌బంగ్లాలో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ విమానంలో గ్రెనేడ్‌ను చివరి నిమిషం వరకు గుర్తించకపోవడం పట్ల ఆయన ఎయిర్‌పోర్టు సిబ్బంది, క్లీనింగ్ సిబ్బంది పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎయిర్‌పోర్టులో మూడు దశలలో విమానాల తనిఖీ ఉంటుందన్నారు. ఈ మూడు దశలలో కూడా గ్రెనేడ్‌ను కనుగొనలేకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రెనేడ్ విమానంలోకి ఎలా వచ్చిందనే విషయమై పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది హైజాక్ సంఘటనలను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయమై మాక్ డ్రిల్ నిర్వహిస్తుంటారన్నారు.
బహుశా ఆ విధంగా మాక్ డ్రిల్ నిమిత్తం తెచ్చిన గ్రెనేడ్ అయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మాక్ డ్రిల్ తరువాత జరిగే రిట్రీట్ పెరేడ్‌లో ఎన్ని ఆయుధాలు తెచ్చారు.. అన్నీ ఉన్నాయా.. లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తారని, ఆ పెరేడ్‌లోనైనా ఈ గ్రెనేడ్ విషయం బయటపడకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఏది ఏమైనా విమానాలలో భద్రతను పెంచడంతోపాటు సిబ్బంది పని తీరును మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications