ఎయిర్ ఇండియా షాకింగ్ నిర్ణయం.. కారణం అదే !
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21 నుంచి జూలై 15 వరకు మూడు ప్రధాన అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులు పూర్తిగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అలాగే మరో 16 రూట్లలో ఫ్రీక్వెన్సీ తగ్గిస్తున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. ప్రయాణికుల భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
కాగా ఈ నెల 12న అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన ఆ ఘటనను దృష్టిలో ఉంచుకొని.. బోయింగ్ 777, బోయింగ్ 787 విమానాలపై అదనపు భద్రతా తనిఖీలు చేపడుతున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. ఈ తనిఖీల నేపథ్యంలో తమ వైడ్‌బాడీ విమానాల వాడకాన్ని తాత్కాలికంగా తగ్గించాలని సంస్థ నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో సుమారు 15 శాతం సేవలను తాత్కాలికంగా తగ్గిస్తోంది.

తాత్కాలికంగా నిలిపివేసిన సర్వీసులు..
ఢిల్లీ - నైరోబి (వారానికి 4 సర్వీసులు)
అమృత్‌సర్ - లండన్ గాట్‌విక్ (వారానికి 3 సర్వీసులు)
గోవా (మోపా) - లండన్ గాట్‌విక్ (వారానికి 3 సర్వీసులు)
ఈ మార్గాల్లో అన్ని విమానాలు జూన్ 21 నుంచి జూలై 15 వరకు నిలిపివేశారు.
ఫ్రీక్వెన్సీ తగ్గించిన మార్గాలు..
అంతే కాకుండా ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా మరియు తూర్పు ఆసియా దేశాలకు కనెక్ట్ అయ్యే 16 అంతర్జాతీయ మార్గాల్లో విమానాల సంఖ్యను ఎయిర్ ఇండియా తగ్గించింది.
ఉత్తర అమెరికా:
ఢిల్లీ - టొరంటో
ఢిల్లీ - వాంకోవర్
ఢిల్లీ - శాన్ ఫ్రాన్సిస్కో
ఢిల్లీ - చికాగో
ఢిల్లీ - వాషింగ్టన్
యూరప్:
ఢిల్లీ - లండన్ హీత్రో
బెంగళూరు - లండన్ హీత్రో
అమృత్‌సర్ - బర్మింగ్‌హామ్
ఢిల్లీ - బర్మింగ్‌హామ్
ఢిల్లీ - పారిస్
ఢిల్లీ - మిలన్
ఢిల్లీ - కోపెన్‌హాగన్
ఢిల్లీ - వియన్నా
ఢిల్లీ - ఆమ్‌స్టర్‌డామ్
ఆస్ట్రేలియా & తూర్పు ఆసియా:
ఢిల్లీ - మెల్‌బోర్న్
ఢిల్లీ - సిడ్నీ
ఢిల్లీ - టోక్యో (హనేడా)
ఢిల్లీ - సియోల్ (ఇంచియాన్)
ఈ మార్పులపై ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ స్పందిస్తూ.. ఇరాన్, ఇతర మధ్యప్రాచ్య దేశాల్లో గగనతల మార్గాల మూసివేత, కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రాత్రి వేళ ఆంక్షలు, ఇంకా అనూహ్య సాంకేతిక సమస్యలు - ఇవన్నీ ఈ తాత్కాలిక మార్పుల వెనుక ఉన్న కారణాలు," అని వెల్లడించారు. అదనపు భద్రతా తనిఖీలు జరిపే సమయం వల్ల కూడా విమానాల లభ్యతపై ప్రభావం చూపిందని తెలిపారు.
ఈ తాత్కాలిక మార్పుల వల్ల ప్రభావితమైన ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా పలు సౌకర్యాలను అందిస్తోంది. సంస్థ ద్వారా ప్రత్యామ్నాయ విమానాల్లో సీట్లు, ఉచితంగా రీ షెడ్యూల్ చేసే అవకాశం లేదా పూర్తి డబ్బు తిరిగి ఇచ్చే వెసులుబాటు కల్పిస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందులకు సంస్థ క్షమాపణలు తెలిపింది. జూలై 15 తర్వాత పరిస్థితులను పునఃసమీక్షించి, పూర్తిస్థాయిలో సేవల పునరుద్ధరణపై దృష్టి పెట్టనున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది.












Click it and Unblock the Notifications