ఈడీ విచారణకు ఐశ్వర్యరాయ్: పార్లమెంటులో సహానం కోల్పోయిన జయాబచ్చన్, బీజేపీపై ఫైర్
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ పార్లమెంటు సమావేశాల్లో సహనం కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. ఓవైవు ఢిల్లీలో తన కోడలు (ఐశ్వర్యరాయ్ బచ్చన్)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారిస్తుండగానే రాజ్యసభలో బీజేపీపై విరుచుకుపడ్డారు జయాబచ్చన్. బీజేపీకి త్వరలోనే చెడ్డరోజులు రాబోతున్నాయని శాపనార్థాలు పెట్టారు.
తన కుటుంబంపై బీజేపీ ఎంపీలు అనుచిత వ్యాఖ్యలు చేశారని జయాబచ్చన్ మండిపడ్డారు. విపక్షాలు మాట్లాడకుండా కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను బీజేపీ ఎంపీలు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదంటూ మండిపడ్డారు. రాజ్యసభలో ఐశ్వర్యారాయ్ పేరును బీజేపీ ఎంపీలు ప్రస్తావించడంపై ఆవేశంతో ఊగిపోయారు జయాబచ్చన్. కాగా, పనామా పేపర్స్‌లో ఐశ్వర్యారాయ్ పేరు బయటకు రావడంతో ఆమెను ఈడీ విచారిస్తోంది.

ఈడీ ఎదుట హాజరయిన ఐశ్వర్యారాయ్
పనామా పేపర్స్ కేసులో తాజాగా బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్‌కి నోటీసులు జారీ చేయడంతో.. ఆమె ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఐశ్వర్యారాయ్ విచారణకు రావాలని గతంలోనే సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. అయితే అప్పుడు ఐశ్వర్యారాయ్ వాయిదా కోరింది. కొన్ని రోజులు సమయం కావాలని కోరడంతో ఇప్పటి వరకు వాయిదా పడింది. తాజాగా ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు ఐశ్వర్యారాయ్.
పనామా పేపర్ల లీకేజీపై ఈడీ దర్యాప్తుకు ఐశ్వర్యారాయ్ హాజరు కావడంతో ఈ కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. విదేశాల్లో నల్లధనం దాచుకున్న విషయంపై ఐశ్వర్యారాయ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. తన ఖాతాల నుంచి విదేశాలకు డబ్బు మళ్లింపుపై ఈడీ అధికారులకు ఐశ్వర్యరాయ్ వివరణ ఇచ్చారు. ఫేమా చట్టం ఉల్లంఘించడంపై ఈడీ అధికారులు ప్రశ్నించారు. మొదట ఈడీ విచారణకు సోమవారం హాజరు కాలేనని చెప్పిన ఐశ్వర్యారాయ్.. ఆకస్మాత్తుగా ఢిల్లీలోని జామ్‌నగర్‌లో ఉన్న ఈడీ కార్యాలయం ముందు ప్రత్యక్షమయ్యారు.
పనామా దేశానికి చెందిన మొసాక్ ఫోన్సెకా అనే కార్పొరేట్, న్యాయ సేవల సంస్థ.. దేశదేశాల్లో నెలకొల్పిన వేలాది డొల్ల కంపెనీల బాగోతాన్ని 2016లో బయటపెట్టింది. ఈ వ్యవహారం పలువురు ప్రముఖులపై కేసుల నమోదుకు దారితీసింది. ఐశ్వర్యరాయ్ తర్వాత మరికొందరిని కూడా ఈడీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications