ఎస్పీలో చిచ్చు, తండ్రీ తనయుల సవాల్: ములాయం వర్సెస్ అఖిలేష్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో తన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌కు దగ్గరి వారైన ఇద్దరు మంత్రులను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి అఖిలేష్ ఇటీవల తప్పించారు.
ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ములాయం యూపీ సమాజ్‌వాదీ అధ్యక్ష పదవి నుంచి సొంత కొడుకును తప్పించారు. ఆ స్థానంలో సోదరుడు శివపాల్ యాదవ్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించారు.
మంగళవారం నాడు అఖిలేష్ తప్పించిన మంత్రులు గాయత్రి ప్రజాపతి, రాజ్ కిశోర్ సింగ్‌లు ములాయంకు సన్నిహితులుగా ముద్రపడ్డ నేతలు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా సహించేది లేదన్న సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్న సమయంలో.. ఆయన పైనే తండ్రి వేటు వేయడం గమనార్హం. తండ్రి కొడుకుల మధ్య రగడ సాగుతోంది.
రెండు నెలల క్రితం ములాయం ఒత్తిడి కారణంగానే దీపక్ సింఘాల్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమించగా, ఆనను కూడా అఖిలేష్ తొలగించారు. ఇదే సమయంలో గత నాలుగేళ్లుగా తన వర్గానికి సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని అలిగి ఉన్న సోదరుడు శివపాల్ యాదవ్‌ను బుజ్జగించడం కూడా ముఖ్యమన్న ఉద్దేశంతోనే ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రభుత్వంలోనే: అఖిలేష్
పార్టీలో, కుటుంబంలో తలెత్తుతున్న విభేదాలపై రాష్ట్ర సీఎం అఖిలేశ్ యాదవ్ స్పందించారు. సమస్యలన్నీ ప్రభుత్వంలోనేనని, తమ కుటుంబంలో కాదన్నారు. కుటుంబం విషయంలో ప్రతి ఒక్కరం ములాయం (నేతాజీ) మాటను వింటామని, కొన్ని విషయాల్లో నేతాజీతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మరికొన్నింటిలో సొంత నిర్ణయాలు తీసుకుంటానని అని శివపాల్‌నుద్దేశించి అఖిలేశ్ అన్నారు.
ములాయం చెప్పినట్లు చేస్తా: శివపాల్
కీలక మంత్రిత్వ శాఖల నుంచి బాబాయి శివపాల్ యాదవ్‌ను సీఎం అఖిలేశ్ తప్పించడంతో.. కేబినెట్ పదవికి రాజీనామా చేసే యోచనలో శివపాల్ ఉన్నారు. అయితే ములాయంతో చర్చించాకే రాజీనామాపై తన నిర్ణయం చెబుతానని శివపాల్ అన్నారు. మంత్రుల శాఖలను తొలగించే, మార్చే అధికారం సీఎం అఖిలేశ్‌కు ఉందని, అయితే నేతాజీపై తనకు పూర్తి నమ్మకముందని, ఆయన ఏదీ చెబితే అదే చేస్తానన్నారు. ములాయంకు వ్యతిరేకంగా వెళ్లే సాహసం పార్టీలో ఎవరికీ లేదని అఖిలేశ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications