నాలుగో విడత కోసం యూపీ సర్వం సిద్ధం: కీలక స్థానాల్లో రేపే బిగ్‌ఫైట్: ఒవైసీ పార్టీపై ఫోకస్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వాతావరణం మరింత వేడెక్కుతోంది. దశలవారీగా పోలింగ్ ముగుస్తోన్నకొద్దీ- తరువాతి విడతలపై అన్ని రాజకీయ పార్టీలు కూడా దృష్టి సారించాయి. ఇప్పటిదాకా ముగిసిన విడతల్లో తమకు ఎన్ని అసెంబ్లీ స్థానాలు లభిస్తాయోనంటూ బేరీజు వేసుకుంటోన్నాయి. మిగిలిన దశల్లో నిర్వహించే పోలింగ్‌పైనా అదే ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రాధాన్యత ఇస్తోన్నాయి. దీనికి అనుగుణంగా తమ ఎన్నికల ప్రచార పర్వాన్ని రూపొందించుకుంటోన్నాయి.
ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటిదాకా మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నెల 10, 14, 20వ తేదీల్లో మొత్తం 172 స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇంకా నాలుగు విడతల పోలింగ్ మిగిలివుంది. 231 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో దాదాపు అన్ని పార్టీలు కూడా తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ఎన్నికలను ఎదుర్కొనబోయే నియోజకవర్గాల్లో జెండా పాతడానికి సర్వశక్తులనూ ఒడ్డుతున్నాయి.

నాలుగో విడత పోలింగ్ బుధవారం ఉదయం ఆరంభం కానుంది. 59 నియోజకవర్గాలకు పోలింగ్ సాయంత్రం వరకూ కొనసాగుతుంది. మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఫిలిభిత్, లఖీంపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నవ్, లక్నో, రాయ్‌బరేలీ, బండా, ఫతేపూర్ జిల్లాల్లో పోలింగ్ ఉంటుంది. ఈ 59 నియోజకవర్గాలపై పట్టు సాధించడానికి భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాయి.
లఖీంపూర్ ఖేరీ జిల్లాలోని నియోజకవర్గాలపై ప్రస్తుతం అందరి దృష్టీ నిలిచి ఉంది. వ్యవసాయ చట్టాలకు నిరసనగా నిరసన ప్రదర్శన చేస్తోన్న రైతులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు తన జీపుతో దూసుకెళ్లిన ఉదంతంతో- ఈ జిల్లా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అజయ్ కుమార్ మిశ్రా సొంత లోక్‌సభ నియోజకవర్గం కూడా ఇదే. ఈ సంఘటనకు సంబంధించిన వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకునేలా బీజేపీయేతర పక్షాలు తమ ఎన్నికల ప్రచారాన్ని సాగించాయి.
లఖింపూర్ ఖేరీ అసెంబ్లీ స్థానంలో సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా రవిశంకర్ త్రివేది పోటీలో ఉన్నారు. బహుజన్ సమాజ్‌వాది పార్టీ మోహన్ బాజ్‌పేయిని బరిలో దింపింది. ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థిగా ఖుషీ కిన్నర్, అఖిల భారత మజ్లిస్-ఇ-ముస్లిమీన్ నుంచి మహ్మద్ ఉస్మాన్ సిద్ధిఖీ పోటీ చేశారు. ముస్లిం ఓటర్ల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపుటముల్లో మజ్లిస్ అభ్యర్థి సిద్ధిఖీ కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. పోలింగ్ ట్రెండ్ ఎలా ఉంటుందనేది ఉత్కంఠతగా మారింది.












Click it and Unblock the Notifications