తొడక్కుని విసిరేసే చెప్పును కాను: నటుడు అంబరీశ్
బెంగుళూరు: తానేమి తగిలించుకుని విసిరి పారేసే చెప్పు లాంటి వాడిని కాదని ప్రముఖ కన్నడ నటుడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబరీశ్ అన్నారు. మంగళవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ తనకంటూ ఓ పాపులారటీ తనకు ఉందని వ్యాఖ్యానించారు.
63 ఏళ్ల అంబరీశ్‌తో సహా 14 మంది మంత్రులను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తొలగించి కొత్తగా 13 మందిని ఆదివారం తమ మంత్రివర్గంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అంబరీశ్ నిప్పులు చెరిగారు.
తనను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రి ముందుగా ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. మరోవైపు తనను మంత్రి పదవి నుంచి తప్పించడాన్ని నిరసిస్తూ అంబరీశ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ శివశంకర్ రెడ్డికి పంపించారు.

అయితే అంబరీష్ వ్యక్తిగతంగా కాకుండా తన సహాయకుడితో రాజీనామా లేఖ పంపడంతో పాటు అంబరీశ్ రాజీనామా లేఖ సరైన ఫార్మాట్‌లో లేదని ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించలేదు. సోమవారం అంబరీష్ మద్దతుదారులు మాండ్యా జిల్లాలోని బెంగళూరు-మైసూరు హైవేను దిగ్బంధం చేశారు.
దీంతో పాటు కన్నడ సినీ పరిశ్రమ మొత్తం నటుడు అంబరీశ్‌కు మద్దతుగా నిలవడం విశేషం. మూడేళ్లుగా గృహనిర్మాణ శాఖ నిర్వహిస్తున్నా అందులో ఎటువంటి అభివృద్ధిని చూపించలేకపోయారనే ఆయన్ని తొలగించారనే వార్తలు వినిపించాయి. ఇటీవల జరిగిన అసోం, కేరళ రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో ఆయన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు చేపట్టిన సంగతి తెలిసిందే.
కాగా 2013 మే 13న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తాజా పునర్వ్యవస్థీకరణతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్యాబినెట్ సభ్యుల సంఖ్య 33మందికి చేరింది. మంత్రి పదవులు కోల్పోయిన వారిలో సినీ నటుడు అంబరీశ్‌తో పాటు పీటీ పరమేశ్వర్‌నాయక్, ఖ్వామారుల్‌ఇస్లాం, షామనూర్‌శివశంకరప్ప, వీ శ్రీనివాస ప్రసాద్, వినయ్‌కుమార్ సొరాకె, సతీశ్‌జర్కిహోలి, బాబూరావు చించాంసూర్, శివరాజ్‌సంగప్ప తంగడగి, ఎస్‌ఆర్ పాటిల్, మనోహర్ తహసీల్దార్, కే అభయచంద్రజైన్, దినేశ్‌గుండూరావు, కిమ్మనె రత్నాకర్ ఉన్నారు.












Click it and Unblock the Notifications