ఇంట్లోకి దూసుకెళ్లిన అంబులెన్స్: ఇద్దరి దుర్మరణం
పాట్నా: రోగులను వేగంగా ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలను కాపాడే ఆంబులెన్స్ ఇద్దరి పాలిట మృత్యువు అయ్యింది. వాయువేగంతో ఒక ఇంటిలోకి ఆంబులెన్స్ దూసుకు వెళ్లడంతో ఇద్దరు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు.
బీహార్ లోని మంగర్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గురువారం ఆంబులెన్స్ మంగర్ గ్రామం వైపు వేగంగా వెళ్లింది. ఆ సమయంలో రోడ్డు మీద నుండి అదుపుతప్పిన ఆంబులెన్స్ ఇష్టం వచ్చినట్లు వెళ్లింది.

రోడ్డు పక్కన ఉన్న ఇంటి గోడలు బద్దలు కొట్టుకుని లోపలికి ఆంబులెన్స్ దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో గోడలు కూలిపోయి ఝునియా దేవి (22)తో పాటు ఐదు సంవత్సరాల మంజీ అనే పాప సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. 7 మందికి తీవ్రగాయాలు కావడంతో సదర్ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా ఎస్పీ బరున్ కుమార్ సిన్హా చెప్పారు. అయితే ఆంబులెన్స్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపాడా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని బరున్ కుమార్ సిన్హా తెలిపారు. ఆంబులైన్స్ డ్రైవర్ సంఘటనా స్థలం నుండి పరారైనాడు.












Click it and Unblock the Notifications