హైడ్రామా నడుమ ఐదోసారి ప్రధానిగా షేర్ బహదూర్ దేవ్‌బా ప్రమాణం - నేపాల్‌లో కాంగ్రెస్ సర్కారు నిలబడేనా
హిమాలయ దేశం, ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశమైన నేపాల్ లో సుదీర్ఘంగా సాగుతోన్న రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. మావోయిస్టు(కమ్యూనిస్టు) పార్టీలో అంతర్గత విభేదాలు, సుప్రీంకోర్టు ఉత్తర్వులతో కేపీ శర్మ ఓలి సర్కారు కుప్పకూలగా, ఇన్నాళ్లూ ప్రతిపక్ష పాత్ర పోషించిన నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్‌బా (74) ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. అయితే,
రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(5) మేరకు నేపాల్ రాష్ట్రపతి విద్యాదేవి భండారీ.. దేశ ప్రధానిగా షేర్ బహదూర్ దేవ్‌బాను నియమిస్తూ సోమవారమే ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఖాట్మండులోని రాష్ట్రపతి భవన్ లో దేవ్‌బా ప్రమాణానికి ఏర్పాట్లు చేశారు. కానీ, రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల్లో రాజ్యాంగ ఉపవాక్యాలను చేర్చకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో..

అప్పటికప్పుడే రాష్ట్రపతి విద్యాదేవి సవరించిన ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాతగానీ, గంటల ఆలస్యంగా షేర్ బహదూర్ దేవ్‌బా నేపాల్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. నేపాల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైన షేర్ బహదూర్ దేవ్‌బా దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఇది ఐదోసారి. గతంలో 2017 జూన్ నుంచి 2018 ఫిబ్రవరి వరకు, 2004 జూన్ - 2005 ఫిబ్రవరి, 2001 జులై - 2002 అక్టోబర్, 1995 సెప్టెంబర్ - 1997 మార్చి వరకు ఆయన ప్రధానిగా విధులు నిర్వర్థించారు. కాగా,
నేపాల్ ప్రధానిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేసిన దేవ్‌బా 30 రోజుల్లోగా పార్లమెంటులో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి సిఫార్సు మేరకు ప్రతినిధుల సభను అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీంకోర్టు..జులై 18న ప్రతినిధుల సభ సమావేశాన్ని జరపాలని ఆదేశించింది. మావోయిస్టు పార్టీలో ప్రచండ, కేపీ శర్మ ఓలి వర్గాల మధ్య తీవ్ర విభేదాల వల్ల అధికార పగ్గాలు ఇప్పుడు కాంగ్రెస్ చేతికి వచ్చాయి. అయితే దేవ్‌బా సర్కారు నిలబడేది లేనిది మరో 30 రోజుల్లో తేలనుంది.












Click it and Unblock the Notifications