అమిత్ షా నెం.2: నితీష్, మమతబెనర్జీ రాష్ట్రాలపై కన్ను
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా దేశంలోనే అత్యంత ప్రభావశీల రాజకీయవేత్తల్లో రెండో వ్యక్తిగా నిలిచారు. నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి 73 సీట్లు దక్కేలా అమిత్ షా వ్యూహం రచించారు. తాజాగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపారు.
ప్రభావిత జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ తొలి స్థానంలో ఉన్నారు. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం అమిత్ షా బీజేపీలో కూడా తన ప్రధాన్యాన్ని రెండో స్థానానికి పెంచుకున్నారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు.. అమిత్ షా వ్యూహం, మోడీ పాలన వల్ల సాధ్యమైందని చెబుతున్నారు.
ఇక మిగతా రాష్ట్రాలపై అమిత్ షా కన్ను

ఆదివారం ఫలితాలు వచ్చిన తర్వాత అమిత్ షా మాట్లాడుతూ.. జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయని, తమ దృష్టి వాటిపై ఉంటుందని తెలిపారు.
బీహార్, పశ్చిమ బెంగాల్...
నిన్నటి సార్వత్రిక ఎన్నికలు, తాజాగా రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో దూకుడుగా ఉన్న బీజేపీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బీహార్ తదితర రాష్ట్రాల పైన దృష్టి సారించనుంది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో బలం పెంచుకునే దిశలో అమిత్ షా పావులు కదిపేందుకు సిద్ధమయ్యారంటున్నారు. బీహార్‌లో మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను, బెంగాల్లో మమతను దెబ్బతీసేందుకు షా సన్నద్ధమవుతున్నారట.
సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీని ప్రధానిగా ప్రకటించడంతో జెడీయు బీజేపీకి గుడ్ బై చెప్పింది. ఎన్నికల్లో బీజేపీ హవా కనిపించడంతో ఇరవయ్యేళ్ల శతృత్వానికి నితీష్, లాలు ప్రసాద్ యాదవ్‌లు ఫుల్ స్టాప్ పెట్టి మోడీ పైన సమరభేరీ మోగించారు. మరోవైపు, బెంగాల్లో కమలదళం క్రమంగా పుంజుకుంటోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార పార్టీకి ధీటుగా ఎదిగేలా షా వ్యూహరచన చేస్తున్నారంటున్నారు.
వీరికి ఫేస్‌బుక్ లైక్స్ ఎక్కువ!
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన దేవేంద్ర ఫడ్నవీస్ ఫేస్‌బుక్ పేజీకి 8, 92,000 లైక్స్, పంకజ్ ముండే పేజీకి 3 లక్షలకు పైగా లైక్స్, మరో నేత వినోద్ తవడే పేజీలో 8,48,000 లైక్స్ ఉన్నాయి. బీజేపీ అధికార ప్రతినిధి కెప్టెన్ అభిమన్యు సింధుకు 2,07,776 లైక్స్ ఉన్నాయి. సామాజిక అనుసంధాన నెట్ వర్క్‌లో ప్రచారం కూడా వీరికి కలిసి వచ్చిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications