ఒకప్పుడు అక్కడ బూత్ మేనేజర్! ఇప్పుడు బీజేపీ అధినేతగా ఓటేసిన అమిత్ షా
Recommended Video

గాంధీనగర్: రాజకీయంగా గుజరాత్ అంటే మొదట గుర్తుకు వచ్చేది ఆ రాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షానే గుర్తొస్తాడు. వీరిద్దరూ కూడా బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి ఉన్నత స్థానాలను అధిరోహించడం అందరికీ తెలిసిన విషయమే.
తాజాగా, జరిగిన పరిణామం ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. గుజరాత్ రాష్ట్రంలో గురువారం(డిసెంబర్ 14న) రెండో దశ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీవీఐపీ స్థాయిలో వచ్చిన అమిత్ షా అహ్మదాబాద్‌లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిల్చుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అమిత్ షాతోపాటు ఆయన సతీమణి సోనల్, కుమారుడు జయ్ షాలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఇక్కడ విశేషమేమంటే.. అమిత్ షా తొలినాళ్ల(1980లలో)లో ఈ ప్రాంతంలో ఎన్నికల సమయంలో బీజేపీ తరపున పోలింగ్ బూత్ మేనేజర్‌గా వ్యవహరించడం గమనార్హం.

ఆ సమయంలో.. పోలింగ్ ఏజెంట్లను సమన్వయం చేస్తూ.. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యర్థి పార్టీలు ఏవైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అడ్డుకోవడం లాంటివి చేసేవారు. ఆ తర్వాత నారాయణపురా(నారణ్‌పురా) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా ప్రాతినిథ్యం వహించారు.
అనంతరం ఆయన గుజరాత్ మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులైన విషయం తెలిసిందే. ఆ తర్వాత గత ఆగస్టులో రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాగా, ఇప్పుడు జగదీశ్ దేశాయి అనే వ్యక్తి ఈ ప్రాంతాన్ని చూసుకుంటున్నారు. అమిత్ షాతోపాటు 25ఏళ్లుగా ఈ ప్రాంతంలో బీజేపీ కోసం పనిచేశామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications