గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో కొత్త విధానం- ఇకపై: వారణాసి తరువాత..!!
విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో సరికొత్త విధానం అమలులోకి రానుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ విధానాన్ని దశలవారీగా ప్రవేశపెడుతోంది.
న్యూఢిల్లీ: విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో సరికొత్త విధానం అమలులోకి రానుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ విధానాన్ని దశలవారీగా ప్రవేశపెడుతోంది. ఇదివరకు ఉత్తర ప్రదేశ్ లోని వారణాశి ఎయిర్ పోర్టులో ఈ విధానం పూర్తిస్థాయిలో అమలవుతోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇది పాక్షికంగా అందుబాటులోకి వచ్చింది.
అదే- డిజి యాత్ర. వారణాసి విమానాశ్రయంలో డిజి యాత్రను విజయవంతంగా అమలు చేసిన తరువాత మరో మూడు ఎయిర్ పోర్టులను ఏఏఐ ఎంపిక చేసింది. గన్నవరంతో పాటు కోల్ కత, పూణె ఈ జాబితాలో ఉన్నాయి. త్వరలోనే ఈ మూడు చోట్ల డిజి యాత్రను ప్రవేశపెట్టనున్నట్లు ఎఎఐ ఛైర్మన్ సంజీవ్ కుమార్ తెలిపారు.

దేశ రాజధానిలోని ఎఎఐ-ఏటీసీ సర్వీసెస్ బిల్డింగ్ లో 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రసంగించారు. డిజి యాత్ర గురించి వివరించారు. ఈ విధానం కోసం తాము మూడు నాలుగు సంవత్సరాలుగా కష్టపడుతూ వచ్చామని, వారణిశిలో దీన్ని విజయవంతంగా అమలు చేయగలిగామని అన్నారు.
ప్రైవేట్ ఆపరేటర్ల సహాయంతో ఓ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రత్యేకంగా ఈ వ్యవస్థను రూపొందించామని వివరించారు. ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చినప్పుడల్లా రెండు నుంచి మూడు సార్లు భద్రత తనిఖీలను ఎదుర్కోవాల్సి వస్తోందని, చెక్-ఇన్, బోర్డింగ్ గేట్ వద్ద తనిఖీలు ఉంటాయని గుర్తు చేశారు. ప్రయాణికులు తమ గుర్తింపు కార్డులు, బోర్డింగ్ పాసులను చూపించాల్సి ఉంటుందని అన్నారు.
డిజి యాత్ర విధానంలో అలాంటివేవీ అవసరం ఉండదని అన్నారు. పేపర్ లెస్ ప్రయాణాన్ని కల్పించడంలో భాగంగా డిజి యాత్రకు శ్రీకారం చుట్టామని సంజీవ్ కుమార్ చెప్పారు. వారణాసి విమానాశ్రయంలో 25 నుంచి 30 శాతం మంది ప్రయాణికులు ఈ సేవను వినియోగించుకుంటోన్నారని పేర్కొన్నారు. డిజి యాత్ర యాప్‌లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications