• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అనంత పద్మనాభస్వామి ఆలయం: సుప్రీంకోర్టు తాజా తీర్పుతో మళ్లీ చర్చల్లో అత్యంత ధనిక ఆలయం

By BBC News తెలుగు
|
కేరళ పద్మనాభస్వామి ఆలయం

ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాలలో ఒకటైన కేరళ శ్రీపద్మనాభస్వామి గుడికి సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది.

ఆలయ ట్రస్ట్ 25 ఏళ్ల (1989-90 నుంచి 2013-14 వరకూ) ఖాతాలపై ప్రత్యేక ఆడిటింగ్ నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

గత కొన్నేళ్లుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటున్న ఆలయ నిర్వాహకులు, దాని ఆడిటర్లకు సుప్రీం తాజా తీర్పు ఒక కొత్త సవాలుగా నిలిచింది.

కోర్టు నియమించిన అమికస్ క్యూరీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. కొన్నేళ్ల క్రితం దేశ అప్పటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ ఆలయ అకౌంట్లపై ఒక పరిమిత ఆడిటింగ్ నిర్వహించారు.

ఆ తర్వాత కేరళ ప్రభుత్వం హడావుడిగా ఆలయానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది.

అప్పటి ఆడిటింగ్ తర్వాత వచ్చిన రిపోర్టులో ఆలయంలోని అన్ని గదులు, లేదా ఖజానాలలోని ఆభరణాల విలువ దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయలు ఉండచ్చని అంచనా వేశారు.

అది వినగానే ఆ డబ్బుతో భారతదేశ ఆర్థిక లోటును గణనీయంగా తగ్గించవచ్చని చాలా మంది అన్నారు.

అయితే ఆలయంలోని అనేక పురాతన వస్తువుల విలువ ఎంతనేది ఇప్పటికీ అంచనా వేయలేకపోయారు.

శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం

ఖర్చుల కోసం కోర్టుకెక్కిన పాలనా కమిటీ

ఆలయంలోని ఈ సంపద విలువ ప్రస్తుతం మరింత పెరిగి ఉంటుందని భావిస్తున్నారు.

కానీ, ఇంత సంపద ఉన్న పద్మనాభస్వామి గుడి పాలనా కమిటీ ఆలయ నెలవారీ ఖర్చుల కోసం నిధులు కావాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

తాము ఎప్పుడూ లేనంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని, రోజువారీ ఖర్చులు కూడా భరించలేకపోతున్నామని కేరళలో సీనియర్ జిల్లా జడ్జి అధ్యక్షతన పనిచేసే ఆలయ పాలనా కమిటీ సుప్రీంకోర్టుకు తెలిపింది.

కరోనాతో గత ఏడాదికి పైగా మూతపడి ఉండడంతో శ్రీపద్మనాభస్వామి ఆలయ నెలవారీ ఆదాయం రూ.50-60 లక్షలకు పడిపోయింది. కానీ, ఆలయ సిబ్బంది వేతనాలు, నిత్య పూజా కైంకర్యాల కోసం ప్రతి నెలా 1.25 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దాంతో ఆలయం పొదుపు మొత్తం వేగంగా తగ్గిపోతోంది. ఈ ఖర్చుల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ల మొత్తాన్ని కూడా వినియోగించాల్సి వస్తోంది.

ఇలాంటి సమయంలో పాలనా కమిటీ మొదట ఆలయ ట్రస్ట్ తలుపు తట్టింది. కానీ అక్కడ వారికి నిరాశే ఎదురైంది. ట్రస్ట్ నుంచి వారికి ఎలాంటి సాయం లభించలేదు.

"పాలనా కమిటీ, ఆలయ ట్రస్ట్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది" అని ఈ ఆలయంపై 'వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్-ది శ్రీ పద్మనాభస్వామి టెంపుల్' అనే పుస్తకం రాసిన చరిత్రకారులు ఎంజీ శశిభూషణ్ బీబీసీకి చెప్పారు.

పద్మనాభస్వామి ఆలయం కథ

శ్రీమహావిష్ణువు విగ్రహంతో 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం భారత్‌లోని 108 విష్ణు ఆలయాల్లో ఒకటి. కేరళ రాజధాని తిరువనంతపురానికి ఆ పేరు అనంత పద్మనాభస్వామి పేరుమీదే వచ్చింది.

"ఈ ఆలయం అద్భుతమైనది. ఎందుకంటే ట్రావెన్‌కోర్ మహారాజు(చితిరా తిరునల్ బలరామ వర్మ) తన మొత్తం రాజ్యాన్ని భగవంతుడికి సమర్పించారు. దేవుడికి చట్టపరమైన అధికారం ఉన్నట్టు భావిస్తారు. మహారాజు తన భక్తితో ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. సాంకేతికంగా ఆలయం ద్వారా వచ్చే ఆదాయం పొందుతున్న ఇది ట్రస్ట్ కాదు" అని ఆలయానికి చెందిన కార్యకర్త రాహుల్ ఈశ్వర్ బీబీసీ తో అన్నారు.

సంస్థానాల విలీన సమయంలో భారత ప్రభుత్వం ఇక్కడ ఒక మినహాయింపు ఇచ్చింది. ఈ ఆలయం నిర్వహణ బాధ్యతను ట్రావెన్‌కోర్ అప్పటి మహారాజుకు ఇవ్వడానికి అనుమతించింది. అయితే, మిగతా ఆలయాలన్నింటినీ 'దేవాస్వం బోర్డ్' పరిధిలోకి చేర్చారు.

కానీ, 1930 నుంచి 1941 వరకూ పాలించిన బలరామ వర్మ 1991 జులైలో మరణించగానే అసలు సమస్య ఎదురైంది. ఆయన సోదరుడు ఉత్తరాదం తిరునల్ మార్తాండ వర్మ ఆలయ నిర్వహణ పగ్గాలు చేపట్టారు. ఆలయం, దాని సంపద మొత్తం తన కుటుంబానిదేనని చెప్పారు.

భక్తులు దీనిపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఆలయం ఆభరణాలు రాజవంశం చేతుల్లోకి వెళ్తాయేమోనని వారంతా ఆందోళనకు గురయ్యారు. దాంతో మార్తాండ వర్మ హైకోర్టుకు వెళ్లారు.

అనంత పద్మనాభ స్వామి ఆలయం

కేరళ హైకోర్ట్ తీర్పు

ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత మార్తాండ వర్మ ఇక ఏమాత్రం పాలకుడుగా ఉండలేరని కేరళ హైకోర్టు 2011 జనవరిలో చెప్పింది. ఆలయం, దాని సంపద, దాని నిర్వహణ చూసుకోడానికి వెంటనే ఒక కమిటీ లేదా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాని ఏర్పాటుకు మూడు నెలల గడువు విధించింది.

అంతేకాదు.. జస్టిస్ సీఎన్ రామచంద్రన్ నాయర్, జస్టిస్ కె.సురేంద్ర మోహన్ బెంచ్ ఆలయంలోని అన్ని గదులు, లేదా ఖజానాలు తెరిచి, లోపల ఉన్న ఆభరణాలు, వస్తువులన్నింటినీ భద్రంగా ఉంచడానికి ఒక గౌడౌన్ నిర్మించాలని కేరళ ప్రభుత్వానికి సూచించింది.

హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆలయ ఆభరణాలు, వస్తువులు అన్నింటినీ ప్రజలు చూడడానికి వీలుగా ప్రదర్శించడానికి ఒక మ్యూజియం కూడా నిర్మించాలి.

అయితే, మార్తాండ వర్మ దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరారు.

దాంతో, ఆయన కుటుంబానికి నిర్వాహక(సేవాయత్) హక్కులు ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్పింది. సేవాయత్ అధికారాలను పాలనా కమిటీకి అప్పగించాలని ఆదేశించింది. ప్రముఖ లాయర్ గోపాల్ సుబ్రమణ్యంను అమికస్ క్యూరీగా నియమించిన సుప్రీంకోర్టు ఆలయ వ్యయం అంచనా వేయడానికి వినోద్ రాయ్ అధ్యక్షతన ఒక ఆడిట్ కమిటీని ఏర్పాటు చేసింది.

అప్పుడే, పద్మనాభస్వామి 18 అడుగుల విగ్రహానికి అలంకరించడానికి తయారు చేసిన కిరీటం, కడియాలు, ఉంగరాలు, రత్నాభరణాలు, ప్రత్యేక కంఠాభరణాల విలువ దాదాపు లక్ష కోట్ల విలువ ఉంటాయని అంచనా వేశారు.

"ఆలయ సంరక్షకులు, సిబ్బందికి కూడా ఈ ఆభరణాల విలువ ఎంత ఉంటుందనేది తెలీదు" అని శశిభూషణ్ తన పుస్తకంలో రాశారు.

అయితే ఆలయంలో సంబదపై ఆడిట్ చేసిన కమిటీ నేలమాళిగలోని B గదిని తెరవలేకపోయింది. ఎందుకంటే, దానిని తెరిస్తే దైవాగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉందని వారికి రాజవంశం చెప్పింది.

సుప్రీంకోర్టు

పాలనా కమిటీ వర్సెస్ ట్రస్ట్

ఆలయ ట్రస్ట్‌ను 1965లో బలరామ వర్మ ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లోని భవనాలకు మరమ్మతులు చేయడంతోపాటూ పూజలు, హోమాలు లాంటి ఆచారాలు నిర్వహించడం దీని ఉద్దేశం.

అమికస్ క్యూరీ తన రిపోర్టులో ఆలయ ఆదాయాన్ని ట్రస్ట్ సరిగా వినియోగించలేదని చెప్పింది. అందుకే ఖాతాలు ఆడిటింగ్ చేయడం తప్పనిసరి అని పేర్కొంది.

ఈ ట్రస్టును ఆలయ రోజువారీ వ్యవహారాల నిర్వహణ కోసం డబ్బులు అందించడానికి ఏర్పాటు చేయలేదని జస్టిస్ యూయూ లలిత్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల ధర్మాసనం కూడా చెప్పింది.

"ఈ ట్రస్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా చాలామంది నుంచి నుంచి విరాళాలు అందుతాయి" అని వినోద్ రాయ్ అధ్యక్షతన ఏర్పడిన ఆడిట్ కమిటీ సభ్యులు ఒకరు పేరు వెల్లడించవద్దనే షరతుతో బీబీసీకి చెప్పారు.

"ఇది ఒక పబ్లిక్ ట్రస్ట్. కానీ, ఇది ఒక ప్రైవేటు ట్రస్టులా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది" అని ఇదే కమిటీలోని మరో సభ్యులు, మాజీ ఐఏఎస్ అధికారి ప్రేమచంద్రన్ కురూప్ బీబీసీతో అన్నారు.

చరిత్రకారులు శశిభూషణ్ కూడా ప్రేమచంద్రన్ కురూప్ మాటతో ఏకీభవించారు.

"హైకోర్టు ఆదేశాలు ఇచ్చేవరకూ ఎలాంటి పెద్ద సమస్యా రాలేదు. కానీ, ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లడం, కోర్టు సేవైట్ హక్కుల కింద పాక్షిక యాజమాన్యం ఇవ్వడంతో సమస్య మొదలైంది. రాజ పరివారం స్పష్టంగా ఆలయంపై పూర్తి నియంత్రణ కోరుకుంటోంది" అని శశిభూషణ్ చెప్పారు.

పాలనా కమిటీ, మాజీ రాజ పరివార సభ్యుల మధ్య తలెత్తిన ఈ ఉద్రిక్తతలు జిల్లా జడ్జి నియామకం వల్ల ఏర్పడి ఉండచ్చని ఆయన అన్నారు.

అయితే, "లేదు లేదు ట్రస్ట్‌ను వ్యక్తిగత ఉద్దేశాల కోసం ఉపయోగించకూడదు. దీనిని పూజా కైంకర్యాల కోసమే ఉపయోగించాలి" అని ఈ కేసులో ట్రస్ట్ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ అరవింద్ దాతార్ బీబీసీకి చెప్పారు.

"నిజానికి వినోద్ రాయ్ కమిటీ కొన్ని ఆభరణాలు మాయమయ్యాయని, కొన్ని ఆభరణాల్లో బంగారం తగ్గిందని సూచించింది. అదంతా అబద్ధమని నిరూపితమైంది. కోర్ట్ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఖాతాల్లో అవకతవకలు జరిగుంటే మమ్మల్ని ఎప్పుడో తొలగించి ఉండేవాళ్లు" అని ఆయన అన్నారు.

ట్రస్ట్ ఆడిట్ కోసం ఎందుకు సిద్ధంగా లేదో కూడా దాతార్ చెప్పారు.

"ఎమికస్ క్యూరీ ఇంతకు ముందు 1989-90 నుంచి 2013-14 మధ్య ఖాతాలు ఆడిట్ చేయించాలని చెప్పింది. అది జరిగిందని మేం సుప్రీంకోర్టుకు చెప్పాలని ప్రయత్నించాం. కానీ మేం కోర్టు తీర్పును అంగీకరించాం. దురదృష్టవశాత్తూ మీడియా ఈ విషయాన్ని పెద్దది చేసింది" అన్నారు.

పాలనా కమిటీకి నిధుల కొరత తీవ్రంగా ఉందనే అంశం గురించి మాట్లాడిన చరిత్రకారులు టీపీ శంకరన్ కుట్టి "ఆలయ ట్రస్ట్ దగ్గర బంగారం ఉంది, డబ్బు లేదు" అన్నారు.

ఆలయ ఖాతాలపై పరిమిత ఆడిటింగ్ చేసిన అప్పటి కాగ్ వినోద్ రాయ్

భయాందోళనలు

కానీ చాలా మంది మనసులో ఒక భయం ఉంది. వారిలో ఆలయ కార్యకర్త రాహుల్ ఈశ్వర్ లాంటి వాళ్లు ధైర్యంగా ముందుకొచ్చి దానిని చెప్పగలుగుతున్నారు.

"అవును ఆలయం, ట్రస్ట్ రెండింటి నిర్వహణలో కొన్ని అంశాలు స్పష్టంగా లేవు. మాజీ రాజ పరివారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజ పరివారాన్ని చెడ్డదిగా చూపించే ప్రయత్నం జరగకూడదు" అంటారు ఈశ్వర్.

ఆయన మాజీ మహారాజులను ఉదాహరణగా చెప్పారు. వారందరూ ఆలయం నుంచి బంగారం తీసుకున్నా, దానిని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసేవారని చెప్పారు.

"భక్తుల్లో ఒక భయం ఉంది. ప్రభుత్వం ఆలయాన్ని ఆక్రమించుకుంటే, అవన్నీ తీసేసుకుంటుందని, మాకు, లేదా మా ఆలయానికి అవి ఎప్పటికీ తిరిగి రావని అనిపిస్తోంది" అన్నారు.

అయితే, ఈశ్వర్ ఈ సమస్యకు పరిష్కారం కూడా చెబుతున్నారు.

"అధనపు నిధులు, మాజీ మహారాజుల ఆస్తులతో మనం ఆస్పత్రులు, స్కూళ్లు ఎందుకు నిర్మించకూడదు. ఆ సంస్థలకు పద్మనాభస్వామి పేర్లు ఎందుకు పెట్టకూడదు" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Anantha Padmanabhaswamy Temple: The richest temple in discussions again with the latest verdict of the Supreme Court
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X