వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్: నకిలీ జీవోలతో ఉత్తరాంధ్ర నిరుద్యోగులకు మోసం, బీజేపీ నేత ప్రమేయం ఉందంటూ ఆరోపణలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నిరుద్యోగి (ప్రతీకాత్మక చిత్రం)

"నిరుడు పంట నష్టపోవడంతో అప్పులపాలయ్యాం. ఇప్పుడు మళ్లీ రూ. 2 లక్షలు కట్టాలంటే అప్పు ఇచ్చేవారు కూడా లేరని చెప్పాం. డిగ్రీ చదివి ఖాళీగా ఉంటున్నాను. ఏదోలా చూడండి అని పట్టుబట్టడంతో రూ. 2 వడ్డీకి తెచ్చాం. జాబులో చేరొచ్చని ఓ కాగితం ఇచ్చారు. అదే ఉద్యోగం అనుకుని మా చుట్టాలందరికీ చెప్పేసుకున్నాం. తీరా ఇప్పుడు ఉద్యోగం లేదు..ఇచ్చిన డబ్బులు లేవు. ఎవరినైనా అడిగితే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని చెబుతున్నారు తప్ప.. అసలు ఇంతగా మోసం చేసిన వాళ్ల మీద చర్యలే లేవు. మేముం కట్టిన డబ్బులు వెనక్కి వస్తాయో లేదో.. ఈ లోగా పెరిగిపోతున్న వడ్డీలు కట్టడం ఎలాగో తెలియడం లేదు. ఆ డబ్బులు గానీ, ఉద్యోగం గానీ రాకపోతే మా పుస్తెలు అమ్ముకుని తీర్చాల్సిందే" అంటూ కన్నీరు పెట్టుకుంటోంది విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం జమిందారీ గంగవరం గ్రామానికి చెందిన ఆర్.ముత్యాలమ్మ.

వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న ముత్యాలమ్మ కొడుకు అనకాపల్లిలో బీకాం చదివి ఖాళీగా ఉన్నారు. స్మార్ట్ విలేజ్ ప్రాజెక్టులో ఉద్యోగాలున్నాయని మిత్రులు చెప్పడంతో నర్సీపట్నంలో ఉన్న స్మార్ట్ యోజన స్వచ్ఛంద సంస్థను సంప్రదించారు.

వారు తమది కేంద్ర ప్రభుత్వ సంస్థ అని చెప్పడంతో నిజమేనని భావించి, మండల ఎగ్జిక్యూటివ్ పోస్టు కోసం రూ 2.5 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత సంస్థ ప్రతినిధి నుంచి నియామక ఉత్తర్వులు కూడా అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం వచ్చిందని సంతోషించేలోగా అది నకిలీ ఆర్డర్ అని తెలిసింది.

తనతోపాటు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో వందల మంది ఇలాగే మోసపోయినట్టు గుర్తించారు.

తన బిడ్డకు అన్యాయం జరిగిందని, తాము అప్పుల్లో కూరుకుపోయామని ముత్యాలమ్మ ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

నకిలీ ప్రొసీడింగ్స్

సంస్థ ఎలా వచ్చింది

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం పర్యవేక్షణ కోసం అనేక చోట్ల ఇంప్లిమెంటింగ్ ఏజన్సీలుగా ఎన్జీవోలకు బాధ్యత అప్పగించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ లో భాగంగా ఈ ఏర్పాటు చేశారు.

దేశవ్యాప్తంగా 2016లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మిషన్ ప్రారంభించారు. దానికి గానూ రూ. 5,142 కోట్లు వెచ్చించాలని, దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం చొప్పున నిధులు కేటాయించాలని నిర్ణయించారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ 300 క్లస్టర్స్‌గా విభజించి ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు.

కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద వచ్చే నిధులు కూడా తీసుకుని గ్రామాల్లో అభివృద్ధి చేయాలనేది లక్ష్యం.

గ్రామాల్లో మౌలికవసతుల కల్పన లక్ష్యంగా ఇది సాగుతోంది. ఏపీలో తొలివిడతలో భాగంగా 5 క్లస్టర్స్‌లో ప్రారంభించారు.

పారిశుద్ధ్య పరిస్థితులు, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి వాటిని పరిశీలిస్తారు. ముఖ్యంగా పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణ తీరుపై వారు సర్వేలు నిర్వహిస్తారు.

వాటిని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అందిస్తారు. వాటి ఆధారంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలు చేస్తున్న తీరుపై ప్రభుత్వం అంచనాకు వస్తుంది.

ఇండిపూడి సుధాకర్ సంతకాలతో నియామక ఉత్తర్వులు

అపాయింట్మెంట్ ఆర్డర్ల సంగతేంటి

స్మార్ట్ యోజన స్వచ్ఛంద సంస్థ నర్సీపట్నం కేంద్రంగా పనిచేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటుగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ఈ సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది.

ఇటీవల ఈ సంస్థలో నియామకాల ప్రక్రియ సాగింది. దానిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుగా చెప్పుకుంటూ కొందరు మధ్యవర్తులు సొమ్ము చేసుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం 1436 మంది సిబ్బంది ఉండగా, ఇటీవల జరిగిన నియామకాల్లో అవకాశం పొందిన వారు 400 మంది వరకూ ఉన్నారని నిర్వాహకులు బీబీసీకి తెలిపారు.

అందులో మండల ఎగ్జిక్యూటివ్, క్లస్టర్ అసిస్టెంట్ అనే రెండు కేటగిరీల కోసం నియామకాలు జరిగాయి.

ఊరిలోనే ఉద్యోగం.. పైగా రూ. 19వేల జీతం అన్నారు..

ఎస్పీఎంఆర్ఎం పేరుతో సాగుతున్న ఈ ప్రాజెక్టులో నియామకాల ప్రక్రియను సొమ్ము చేసుకునేందుకు కొందరు దళారులు 5 జిల్లాల్లో వందల మందికి గాలం వేశారు.

క్లస్టర్ అసిస్టెంట్ ఉద్యోగాల పేరుతో ఎక్కువ మందిని మోసం చేసినట్టు బాధితులు చెబుతున్నారు. ఊరిలోనే ఉద్యోగం.. నెలకు రూ. 19వేల జీతం వస్తుందని చెప్పడంతో ఆశపడ్డామని బాధితుడు పి.రమేష్ బీబీసీతో అన్నారు.

మాకు తెలిసిన వ్యక్తి ద్వారా నర్సీపట్నంలో సంతోష్ కుమార్ అనే ఆయన దగ్గరకి వెళ్లాం. ఆయన అసలు పేరు ఇండిపూడి సుధాకర్ అని తర్వాత తెలిసింది. స్మార్ట్ విలేజ్ ప్రోగ్రామ్‌లో ఇది భాగమని చెప్పారు. ఊరిలో ఉండి పనిచేసుకోవచ్చన్నారు. దానికి కొంత ఖర్చు అవుతుందని చెప్పారు.

డబ్బులు రెండు విడతలుగా రూ. 3 లక్షల వరకూ ఇచ్చాం. ఆయనకు బీజేపీకి చెందిన పెద్దపెద్ద నేతలంతా పరిచయమని చెప్పారు. తను కూడా పార్టీ నాయకుడినే అన్నారు. అంతా నిజమేనని నమ్మి డబ్బులు ఇవ్వడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు అంటూ రమేశ్ వాపోయారు.

రిక్రూట్ మెండ్ ఆర్డర్ కోసం జీవోలు కూడా నకిలీవే..

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. కానీ ఈసారి ఏకంగా రిక్రూట్ మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. అందులో రీజనల్ మేనేజర్, స్మార్ట్ విలేజ్ పేరుతో ఇండిపూడి సుధాకర్ సంతకాలు ఉన్నాయి.

ఆయనతో పాటుగా సీఈవో పేరుతో మరో సంతకం కూడా ఉంది. ఆయన ఎవరు, ఏ శాఖ అధికారి అనేది స్పష్టత లేదు. దానికిగాను రూర్బన్ మిషన్ జోనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి.ప్రవీణ్ పేరిట ప్రొసీడింగ్స్ జారీ చేసినట్టు ఆర్డర్‌లో పేర్కొన్నారు.

2018 అక్టోబర్ 25న జారీ చేసిన జీవో ఎంఎస్ నెం. 1.. 2019 నవంబర్ 26న జీవో నెం. 2240, జీవో ఎంఎస్ నెం.328 ప్రకారం నియామకాలు చేసినట్టు ఈ ఆర్డర్ లో ప్రస్తావించారు. కానీ వాస్తవానికి ఆ జీవోలు ఆయా తేదీలలో లేవు.

ప్రభుత్వ రికార్డులను పరిశీలిస్తే 2018 అక్టోబర్ 25న మొత్తం 93 జీవోలు విడుదల కాగా అందులో ఇక్కడ ప్రస్తావించిన జీవో లేనే లేదు. ఆ సంవత్సరం విడుదలయిన జీవో ఎంఎస్ నెం. 1 ని పరిశీలిస్తే ఒకటి వ్యవసాయ శాఖ, మరోటి మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, మరోటి ఉన్నత విద్యాశాఖ తరుపున విడుదల కాగా స్మార్ట్ విలేజ్‌కు సంబంధం లేదు.

2019 నంబర్ 26న పేర్కొన్న జీవోల సంగతి కూడా అంతే. అంటే లేని జీవోలను ప్రస్తావిస్తూ నియామక ఉత్తర్వులు ఇచ్చారు.

పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ అధికారులు జారీ చేసిన ప్రకటన

పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు

నర్సీపట్నం కేంద్రంగా ఈ స్మార్ట్ విలేజ్ నియామకాల పేరుతో సాగుతున్న దందాపై పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ అధికారులు స్పందించారు.

స్మార్ట్ విలేజ్ స్కీమ్‌లో ఎలాంటి నియామకాలు జరగడం లేదని, ఎవరైనా ఆ పేరుతో మోసం చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని ప్రకటన విడుదల చేశారు.

ఎవరైనా నకిలీ నియామక పత్రాలు ఇచ్చి మోసం చేస్తే తెలియజేయాలన్నారు.

ఇప్పటికే ఐదు జిల్లాల పరిధిలోని సుమారు 2వేల మంది బాధితులున్నారని నర్సీపట్నానికి చెందిన ట్యాక్స్ పేయర్స్ అసొసియేషన్ ప్రతినిధి కె.త్రిమూర్తులు అంటున్నారు. బాధితులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని అంటున్నారు.

''బాధితులు అనేక ప్రాంతాల్లో ఉన్నారు. చాలామందికి నియామక పత్రాలు ఇచ్చి శిక్షణ ఇచ్చి పేరుతో కొంతకాలం గడిపారు. తీరా ఇప్పుడు విషయం బయటపడింది. అనేకమంది బాధితుల తరుపున పోలీసులను ఆశ్రయించాం. కానీ పోలీసులు మాత్రం తగిన ఆధారాలు లేవంటూ కేసు నమోదుకి జాప్యం చేస్తున్నారు. ఇప్పుడు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పోలీసులు తీసుకోకపోవడంతో అంతా ఆందోళనగా ఉన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమగ్ర విచారణ చేసి, బాధితులందరికీ వారి డబ్బులు తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాం’’ అన్నారు త్రిమూర్తులు.

'మా పార్టీ నాయకుడే.. కానీ, కేంద్రానికి, బీజేపీకి సంబంధం లేదు

స్మార్ట్ యోజన స్వచ్ఛంద సంస్థ పేరుతో ఉద్యోగాలిస్తామని కొందరు మోసగించిన విషయం తమ దృష్టికి వచ్చిందని బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న సుధాకర్ తమ పార్టీ నాయకుడే అయినా ఈ వ్యవహారంలో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.

''కేంద్రానికి, బీజేపీకి దీంతో సంబంధం లేదు. అదొక ఎన్జీవో పేరుతో జరిగింది. దాని మీద దర్యాప్తు జరగాలి. బాధితులందరికీ న్యాయం జరగాలి’’ అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫిర్యాదు రాలేదంటున్న పోలీసులు.. తన సంతకం ఫోర్జరీ చేశారంటున్న సుధాకర్

"మీడియాలో వస్తోంది. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ బాధితులు ఫిర్యాదు చేయడానికి రాలేదు. బాధితులు వస్తే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని చెప్పాం. వాళ్లెవరూ రాకపోవడంతో విచారణ జరపలేదు" అంటూ నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ బీబీసీతో తెలిపారు.

పోలీసులు ఫిర్యాదులు లేవని చెబుతుండగా సంస్థ రీజనల్ మేనేజర్‌గా చెబుతున్న ఇండిపూడి సుధాకర్ భిన్నంగా స్పందించారు. గత ఆరు నెలలుగా రిక్రూట్‌మెంట్ పేరుతో లక్షల రూపాయాలు వసూలు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. నెల రోజులుగా పలువురు బాధితులను కలిశామన్నారు. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు.

''2018 నుంచి సంస్థ నిర్వహిస్తున్నాం. ముంబయి, దిల్లీ సంస్థల నుంచి సీఎస్ఆర్ నిధులు వస్తున్నాయి. ఎలాంటి రిమార్క్స్ లేకుండా చేస్తున్నాం. అన్ని పార్టీల నేతలకు అవకాశం ఇచ్చాం. అలా ఉద్యోగాల పేరుతో కొందరు వసూళ్లు చేశారు. దానిపై దర్యాప్తు చేస్తున్నాం. రాజకీయాలకు ప్రమేయం లేదు. ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటాం’’ అని బీబీసీతో అన్నారు.

నియామక పత్రాలపై రీజనల్ మేనేజర్ హోదాలో సుధాకర్ సంతకం ఉందని ప్రశ్నించగా అది కూడా నకిలీ అని ఆయన చెబుతున్నారు.

'మీ సంతకం ఫోర్జరీ చేసి డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు’ అనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Andhra Pradesh: BJP leader accused of cheating unemployed in northern andhra
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X