వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్: గుర్రాలపై బడికి వెళ్తున్న పిల్లలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గుర్రాలపై చిన్నారులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి పథకం బడి ముఖం ఎరుగని కొందరు ఆదివాసీ విద్యార్థులను పాఠశాలలకు పంపిస్తోంది. అయితే వీరు పాఠశాలను చేరుకునేందుకు రోజూ ఐదు కిలోమీటర్లు గుర్రాలపై ప్రయాణం చేస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా నేరేడుబంద ఆదివాసీ గ్రామం నుంచి అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని జెడ్. జోగుంపేట ప్రాథమిక పాఠశాలకు గుర్రాలపై విద్యార్థులు వస్తుంటారు. బడికి వచ్చేందుకు రెండు జిల్లాల మధ్య వీరు రోజూ సాహసయాత్ర చేస్తున్నారు.

జిల్లాలోని జి. మాడుగల మండలంలో నేరేడుబంద ఆదివాసీ గ్రామం ఉంది. ఈ గ్రామంలో 70 మంది గిరిజనులు నివాసం ఉంటున్నారు. వీరిలో 20 మంది బడి వయసున్న బాలబాలికలు ఉన్నారు.

గత ఏడాది వరకు వీరిలో ఒక్కరూ బడి ముఖం చూసి ఎరుగరు. దీంతో ఐదో తరగతి వయసున్న పిల్లలకు కూడా అ, ఆ లంటే తెలియని పరిస్థితి.

నేరేడుబందలో పాఠశాల లేకపోవడంతో పిల్లలు చదువుకోలేకపోతున్నారు. మైదాన ప్రాంతం పాఠశాలకి వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు దారికూడా లేని అడవిని దాటుకుని రావాలి. అక్కడ ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. అది అనకాపల్లి జిల్లాలోని జి.మాడుగుల మండలం జెడ్. జోగుంపేట గ్రామ పరిధిలోకి వస్తుంది.

గిరిజన సంఘాలు నేరేడుబంద గ్రామానికి రోడ్డు, బడి కావాలని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. అయితే గ్రామానికి బడి, దారి ఏర్పాటు చేయలేదు కానీ, కొందరు ఉపాధ్యాయులను అక్కడికి పంపించి, చదువు ప్రాధాన్యం, అమ్మఒడి పథకం గురించి వారికి వివరించారు.

తమ పిల్లలు చదువుకోవడంతో పాటు అమ్మఒడి పథకం ద్వారా కొంత ఆర్థిక ఆసరా వస్తుందని పిల్లలను పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు.

రోడ్డు మార్గం లేకపోవడం, అంతా అడవే కావడంతో గుర్రాలపై పిల్లలను బడికి పంపుతున్నారు. రోడ్డు మార్గం లేని తూర్పు కనుమల్లోని కొన్ని గ్రామాల్లో గిరిజనులు, ఆదివాసీలు రాకపోకలు సాగించేందుకు గుర్రాలను వాడుతుంటారు.

గుర్రాలపై చిన్నారులు

'ఏడు గుర్రాలు.. 9 మంది విద్యార్థులు’

గ్రామంలో 1 నుంచి 5 తరగతి వరకు చదివే వయసున్న బాలబాలికలు 20 మంది ఉన్నారు. వీరిలో 9 మంది జెడ్. జోగుంపేట పాఠశాలలో ఈ ఏడాది ప్రవేశాలు పొందారు.

వీరంతా తమ వయసు తగ్గ తరగతిలో కాకుండా తక్కువ స్థాయి తరగతుల్లోనే ప్రవేశాలు పొందారు. ఎందుకంటే 3, 4 తరగతి చదివే వయసున్న పిల్లలు కూడా అ, ఆలు చెప్పలేకపోతున్నారు.

ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు పాఠశాలకు రోడ్డు మార్గం లేకపోయినా తమ పిల్లలను గుర్రాలపై రోజు బడికి పంపుతున్నారు. ఈ పిల్లలను గుర్రాలపై ఎక్కించుకుని పిల్లల తల్లిదండ్రులు లేదా గ్రామంలోని యువకులు రోజూ తీసుకుని వెళ్లి, మళ్లీ గ్రామానికి తీసుకొస్తారు.

“రోజూ మా పనులు మానుకుని పిల్లలను గుర్రాలపై బడికి తీసుకుని వెళ్లి, తీసుకువస్తున్నాం. దీని వల్ల మా వ్యవసాయ పనులు పోతున్నాయి. మరోవైపు చదువుకుంటే పిల్లల జీవితం బాగుంటునే ఆలోచన, పైగా అమ్మఒడి డబ్బులు వస్తే దానిని పిల్లల భవిష్యత్తుకు ఉపయోగించవచ్చు. అందుకే కష్టమైనా పిల్లలను గుర్రాలపై బడికి పంపుతున్నాం. కానీ మా గ్రామంలోనే ఒక బడి నిర్మిస్తే బాగుంటుంది. లేదా ఒక టీచరునైనా గ్రామానికి పంపినా చాలు. బడి కోసం మేం పెంకుల షెడ్ కూడా నిర్మించాం” అని నేరేడు బంద గ్రామానికి చెందిన పొట్టిదొర బీబీసీతో చెప్పారు.

గుర్రాలపై చిన్నారులు

'బడికి పంపుతున్నాం కానీ...భయంగానే ఉంది’

“ఐదు కిలోమీటర్ల దూరం పిల్లలు కొండ దిగి, ఎక్కలేరు. అందుకే మేం మా పిల్లలని గుర్రాలపై పంపుతున్నాం. దారి మధ్యలో గుర్రాలు పిల్లలను పడేస్తాయోమో తెలియదు. చదువుకోడానికి పిల్లలు వెళ్తున్నారు. చదువు కుంటే బాగుంటుంది. కానీ పిల్లలు గుర్రాలపై వెళ్లి వస్తుంటే భయం భయంగా ఉంటుంది” అని నేరేడుబందకు చెందిన మణి అనే ఆదివాసీ మహిళ బీబీసీతో చెప్పారు.

అమ్మఒడి పథకం రాదనే పిల్లలను బడికి పంపుతున్నామని, ఎందుకంటే హాజరు లేకపోతే డబ్బులు ఇవ్వరట అని మణి వివరించారు.

“అమ్మఒడి పథకం డబ్బులు వస్తే మా పిల్లలతో పాటు మాకు ఉపయోగకరంగా ఉంటుంది. పైగా ఎలాగోలా పిల్లలు చదువుకుంటే మంచిదే కదా. అందుకే కొండ కింద బడికి పంపుతున్నాం. అసలు గత ఏడాది వరకు మా పిల్లలకు బడి ఎలాగుంటుందో తెలియదు. ఏ అధికారి, రాజకీయ నాయకులు కూడా మాకు ఏ విధమైనా సహాయం చేయలేదు. ఇప్పుడు పిల్లలకు కష్టమవుతుందని గుర్రాలపై వెళ్లేందుకు గ్రామస్థులమంతా కలిపి మార్గం ఏర్పాట్లు చేసుకున్నాం” అని గ్రామానికి చెందిన డిప్పల అప్పారావు బీబీసీతో చెప్పారు.

గుర్రాలపై చిన్నారులు

'కొత్త వాళ్లని చూస్తే గ్రామస్థుల్లో భయం’

గుర్రాలపై తమ పిల్లలను బడికి పంపుతున్న గ్రామస్థుల్లో భయం కనిపిస్తోంది. పైగా వాళ్లు వెళ్తున్న మార్గం మధ్యలో ఏదైనా ప్రమాదం జరుగుతుందా అనే ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది.

గ్రామానికి తెలియని ముఖాలు ఎవరైనా వెళ్తే తమ పిల్లలకు ఏదైనా జరిగిందేమో, ఆ కబురు తెచ్చారేమోననే భయం నేరేడుబంద గ్రామస్థుల్లో కనిపిస్తుంటుంది. బీబీసీ వెళ్లినప్పుడు కూడా అదే పరిస్థితి.

పిల్లలను బడికి తీసుకునే వెళ్లే పనిని గ్రామంలోని కొందరు యువకులు రోజువారీ పనిగా నిర్ణయించుకుని చేస్తున్నారు.

ఉదయాన్నే బడికి బయలుదేరిన పిల్లల్ని గ్రామం నుంచి గుర్రాలపై ఎక్కించుకుని జి.మాడుగుల మండలంలోని జెడ్. జోగుంపేట పాఠశాలకు తీసుకుని రావడం, మళ్లీ సాయంత్రం వరకు అక్కడే ఉండి, తిరిగి పిల్లలను గ్రామాలకు తీసుకుని వెళ్లడం వీరి పని.

“మా నేరేడుబంద గ్రామం రెండు మండలాల మధ్యలో ఉంది. దాంతో మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మైదాన ప్రాంతమైన రావికమతం మండలం, అటవీ ప్రాంతమైన జి. మాడుగుల మండలం మధ్యలో మా గ్రామం ఉంది. అమ్మఒడి పథకం పొందాలంటే హాజరు 75 శాతం తప్పనిసరిగా ఉండాలని గుర్రాలపై కష్టమైనా పిల్లలను బడికి తీసుకుని వస్తున్నాం. మా ఊర్లోనే పాఠశాల కడితే మాకు చాలా బాగుంటుంది”అని పిల్లలను గుర్రాలపై బడికి తీసుకుని వచ్చే యువకుడు చరణ్ బీబీసీతో చెప్పారు.

పెంకు పాఠశాల

ఆదివాసీలే 'పెంకుల పాఠశాల’ నిర్మించుకున్నారు

గ్రామంలోనే పాఠశాల నిర్మించాలన్న తమ అభ్యర్థనపై అధికారులు స్పందించకపోవడంతో, గ్రామస్థులు పెంకులతో ఒక షెడ్‌ను నిర్మించారు. ఇక్కడకు ఉపాధ్యాయుడిని లేదా ఉపాధ్యాయురాలిని పంపిస్తే పిల్లకు రోజూ గుర్రపు ప్రయాణాల బాధ తప్పుతుందని నేరేడుబంద ఆదివాసీలు చెప్తున్నారు.

“చదువు ప్రాధాన్యం వివరించడంతో నేరేడుబంద ఆదివాసీలు తమ పిల్లలను బడికి పంపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం అందుకోవాలంటే విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు ఉండాలి. అందుకోసమే పిల్లలను వారు కష్టమైనా గుర్రాలు ఎక్కించి, కొందరు యువకులను తోడు ఇచ్చి పంపుతున్నారు. నేరేడుబందలో పాఠశాల కడితే పైనున్న బొందులపలుకు వంటి ఆదివాసీ గ్రామాల వారికి ఉపయోగకరంగా ఉంటుంది” అని జెడ్. జోగుంపేట పాఠశాల ఉపాధ్యాయుడు నాయుడు బీబీసీతో చెప్పారు.

“ఏ చిన్న వర్షం వచ్చినా, గట్టిగా ఎండ కాసినా ఆ పిల్లలు కొండపై నుంచి బడికి రాలేరు. పైగా రానున్నది ఎండాకాలం. ఒంటిపూట బళ్లుంటాయి. మధ్యాహ్నం స్కూల్ విడిచిపెట్టేస్తారు. ఆ సమయంలో మళ్లీ గుర్రాలెక్కి కొండపైకి వెళ్లడం పిల్లలకు కష్టంగానే ఉంటుంది” అని ఆయన వివరించారు.

చిన్నారులు

'నేరేడుబందలో చాలా సమస్యలున్నాయి’

నేరేడుబంద గ్రామంలో బడి, రోడ్డు మాత్రమే కాదు విద్యుత్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇలా చాలా సమస్యలే ఉన్నాయి. వీటన్నింటిని అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకోలేదంటున్నారు గిరిజన సంఘాల ప్రతినిధులు.

“మిగతా సమస్యలను పక్కన పెట్టినా వెంటనే గ్రామంలో ప్రాథమిక పాఠశాల, రోడ్డు మార్గం నిర్మించాలి. చదువు కోసం ప్రమాదకర ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉండకూడదు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా గుర్రాల మీద స్కూలుకు చేరుకొనే పరిస్థితి ఉందంటే ప్రభుత్వాలు ఏ విధంగా పని చేస్తున్నాయో, ముఖ్యంగా ఆదివాసీల కోసం ఎలాంటి శ్రద్ధ చూపుతున్నాయో అర్థం అవుతోంది” అని ఏపీ గిరిజన సంఘం నాయకుడు గోవిందరావు బీబీసీతో అన్నారు.

పరిష్కారానికి ప్రయత్నిస్తా: రోణంకి గోపాలకృష్ణ

నేరేడుబంద గ్రామంలో గుర్రాలపై పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థుల కష్టంపై పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ దృష్టికి బీబీసీ తీసుకుని వచ్చింది.

“నేరేడుబంద గ్రామంలో పరిస్థితిని చూసి, దానిని బట్టి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను. నా పరిధిలో ఉన్న నిధులతో వారు కోరుతున్న రోడ్డు, స్కూల్ నిర్మాణం అవుతుందా, లేదంటే నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపలా అనేది గ్రామానికి వెళ్లి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. ఏదేమైనా రహదారి, పాఠశాల ఏర్పాటుకు చర్యలు చేపడతాను” అని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Andhra Pradesh: Children going to school on horses
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X