వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్: కమ్ముకున్న క్యుములోనింబస్ మేఘాలు, భారీ వర్షాలతో పిడుగులు పడే ప్రమాదం: ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పిడుగులు

క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వారం రోజులపాటు ఆంధ్రప్రదేశ్ అంతటా. వర్షాలు పడతాయని, మే నెలాఖరు వరకు పిడుగులు పడవచ్చని అధికారులు హెచ్చరించినట్లు సాక్షి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

వచ్చే వారం రోజులు రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే పదిరోజులుగా పిడుగుల ప్రభావం చాలాచోట్ల కనిపిస్తోంది.

అది ఇంకా పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మీదుగా మహారాష్ట్ర వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది.

దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడ్డాయి. నిట్టనిలువుగా ఉండే ఈ మేఘాల వల్ల పిడుగులు పడుతున్నాయి.

ప్రధానంగా విశాఖ మన్యం, నల్లమల అటవీ ప్రాంతాలు, ఈ సమీప గ్రామాల్లో పిడుగులు ఎక్కువగా పడుతున్నట్లు గుర్తించారు.

అక్కడి భౌగోళిక పరిస్థితుల వల్ల క్యుములోనింబస్‌ మేఘాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో శ్రీకాకుళం, విశాఖ, ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పిడుగులు ఎక్కువగా పడుతున్నాయి.

పిడుగుల ప్రభావం 90 శాతం రైతులు, కూలీలు, పశువుల కాపరులపై ఉంటోంది. పొలాలు, ఆరుబయట పచ్చిక బయళ్లలో ఉండే వీళ్లు ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కిందకు వెళుతున్నారు.

అలా వెళ్లినప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల చెట్లపై పిడుగులు పడి వాటి కింద ఉన్న వారు మృత్యువాతపడుతున్నారు.

మూడురోజుల కిందట శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు చనిపోయిన ముగ్గురు వ్యక్తులు చెట్లకింద ఉన్నవారేనని గుర్తించారు.

పిడుగు ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే చెట్ల కిందకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరిస్తోంది. ఉన్నచోటే కింద కూర్చుని చెవులు మూసుకోవాలని సూచిస్తోంది.

లేకపోతే దగ్గర్లో ఉన్న భవనాలు, రేకుల షెడ్లు వంటి వాటిల్లోకి వెళితే పిడుగుల ప్రభావం ఉండదని చెబుతోందని సాక్షి వివరించింది.

శాంపిల్ పరీక్షలు

కరోనా మూడో దశను.. ముందే గుర్తించొచ్చు: ఐఐసీటీ

కరోనా మూడో దశను ముందే గుర్తించవచ్చని హైదరాబాద్‌లోని ఐఐసీటీ శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించంది.

కొవిడ్‌ సెకండ్ వేవ్ కోరలు చాస్తోంది. కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.

రెండో దశను ముందే కచ్చితంగా అంచనా వేయగలిగి ఉంటే మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉండేదనే భావన వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది.

రెండో దశే మాత్రమే కాదు.. విదేశాల్లో ఎదురైన అనుభవాలతో మన దేశంలోనూ మూడో దశ రావొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

మూడో దశ ముప్పును ముందే గుర్తించే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు అంటున్నారు.

కరోనా సోకిన వారి నాసికా ద్రవాలు, నోటి మార్గాల ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్‌ బహిర్గతవుతుందని.. మురుగునీటి విశ్లేషణ ద్వారా నెల రోజుల్లో వ్యాప్తిని గుర్తించడానికి అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.

మురుగు నీటిలో సాంక్రమిత వ్యాధులపై పరిశోధన చేస్తున్నట్లయితే.. రోజులో ఎన్ని నమూనాలు సేకరించాలి? ఎన్ని రోజులు సేకరించాలి? గంటలో ఎన్నిసార్లు తీసుకోవాలి? అనేది కీలకం.

ఐఐసీటీ శాస్త్రవేత్తలు గత డిసెంబరులో హైదరాబాద్‌లోని తార్నాక, హెచ్‌ఎంటీనగర్‌, లాలాగూడ, నాచారం ప్రాంతాల్లో అధ్యయనం చేశారు.

మురుగునీటి విశ్లేషణతో కొవిడ్‌తో పాటు ఇతర వ్యాధుల వ్యాప్తిని ముందే గుర్తించి తగు చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

యాంటిబయాటిక్స్‌ ఎక్కువగా ఏ ప్రాంతంలో వాడుతున్నారు? వేటిని వాడుతున్నారు? డ్రగ్‌ రెసిస్టెన్స్‌ యాంటిబయాటిక్స్‌ ఏవి? వంటివి మురుగునీటి నమూనాలను పరీక్షించడం ద్వారా గుర్తించవచ్చని ఐఐసీటీ ప్రధాన శాస్త్రవేత్త వెంకట్‌ మోహన్‌ 'ఈనాడు'కు తెలిపారు.

మురుగు నీటితోపాటూ చెరువుల్లోనూ కరోనా ఆనవాళ్లపై పరిశోధనలు చేస్తున్నామని చెప్పారు.

నిజాంపేటతో పాటు మరో మూడు చెరువుల్లో నమూనాలను సేకరించి విశ్లేషించగా.. మురుగునీరు చేరుతున్న చెరువుల్లో వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయని, మురుగునీరు చేరని చెరువులో కన్పించలేదని ఆయన వివరించారని ఈనాడు రాసింది.

సీటీ స్కాన్‌కు రూ.3 వేలు కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు-ఏపీ

ఏపీ ప్రభుత్వం వైద్య పరీక్షల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రభ దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.

కోవిడ్ చికిత్సలో ప్రధానంగా మారిన సిటీ స్కాన్‌కు సంబంధించి రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులు, ల్యాబ్‌లకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక నుంచి రాష్ట్రంలోని ఆసుపత్రులు, ల్యాబ్‌లలో సిటీ స్కాన్ ధరను రూ.3 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని పత్రిక చెప్పింది.

ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

సిటీ స్కాన్, పాజిటివ్ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కోవిడ్ 19 డ్యాష్ బోర్డులో పాజిటివ్ రోగుల వివరాలని నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ రోగుల చికిత్సను కూడా వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చింది.

ఇప్పటివరకూ 1.01 లక్షల మంది కోవిడ్ రోగులకు ప్రభుత్వం ఉచితంగా వైద్యసేవల్ని అందించింది. దీనికోసం ఏకంగా రూ.309.61 కోట్లు ఖర్చు చేసింది.

గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు ప్రభుత్వం ఉచిత చికిత్స ప్రారంభించింది.

ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో సిటీ స్కాన్ పరీక్షల పేరిట వివిధ ఆసుపత్రులు, ల్యాబ్‌లలో పెద్ద ఎత్తున వసూలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ ధరలపై నియంత్రణ విధించిందని ఆంధ్రప్రభ వివరించింది.

ఆక్సీ మీటర్

తెలంగాణలో ఇంటి దగ్గర ఆక్సిజన్‌ చెక్‌

రాష్ట్రంలో హోం ఐసొలేషన్లో ఉన్న కరోనా రోగులకు రోజూ రెండు సార్లు ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని నమస్తే తెలంగాణ దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినవారిలో ఎక్కువమంది హోం ఐసొలేషన్‌లో ఉంటూ.. చికిత్సపై అవగాహన లేకపోవడంతో శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

అలాంటివారు చివరి నిమిషంలో దవాఖానకు వస్తున్నారని.. దీనిని నివారించేందుకు హోం ఐసొలేషన్‌లో ఉన్న ప్రతిఒక్కరికీ ఆశా వర్కర్లు రోజుకు రెండుసార్లు ఆక్సిజన్‌ లెవల్స్‌, జ్వర పరీక్షలు చేయాలని సూచించారు.

హోం ఐసొలేషన్‌ అవకాశం లేనివారి కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐసొలేషన్‌ సెంటర్లు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. జిల్లాల వైద్యాధికారులు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆదివారం మంత్రి ఈటల టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

కరోనా సెకండ్‌ వేవ్‌లో ఒక్కరికి వస్తే వారి కుటుంబసభ్యులందరికీ వ్యాప్తి చెందుతున్నదని తెలిపారు. ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రభుత్వ ఐసొలేషన్‌ కేంద్రాలు ఏర్పాటుచేశామని చెప్పారు.

లక్షణాలు ఉన్నవారు ఏ ప్రాంతం నుంచి వచ్చినా పరీక్షలు చేయాలని సూచించారు.

ప్రైవేటులో పరీక్షలు చేయించుకొని పాజిటివ్‌ వచ్చిన వారందరి వివరాలను సైతం వైద్యారోగ్యశాఖకు తెలియజేయాలని.. వారందరికీ హోం ఐసొలేషన్‌ కిట్స్‌ అందజేయాలని ఆదేశించారు.

టెలిమెడిసిన్‌ ద్వారా అనుమానాలు నివృత్తి చేయాలని, ఐఎంఏ వారు సైతం ఇందుకోసం ముందుకొచ్చారని తెలిపారని నమస్తే తెలంగాణ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

English summary
Andhra Pradesh: Cumulonimbus clouds and thundershowers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X