• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్: ఈ గ్రామంలో మగవాళ్లే ఎక్కువగా చనిపోతున్నారు. ఎందుకు? ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
భరోతు లక్ష్మి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతానికి సమీపంలో ఉండే మాన్ సింగ్ తండాది ఒక విషాద గాథ.

ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలో ఉండే మాన్ సింగ్ తండాలో సుమారు 90 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ఒక్క ఊరిలోనే 24 మంది వితంతువులు ఉన్నారు. దాదాపుగా అందరి భర్తలూ కిడ్నీ సమస్యలతోనే మరణించినట్టు మృతుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఇలా భర్తను పోగొట్టుకున్న వారిలో భరోతు లక్ష్మి ఒకరు. ఆమె భర్త మరణించి పది రోజులవుతోంది. గడిచిన రెండేళ్లలో లక్ష్మి బంధువుల్లో ఆరుగురు చనిపోయారు. కుటుంబాలకు ఆధారంగా నిలిచే మగవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. దాంతో మహిళలలే ఒంటరిగా కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తోంది. లక్ష్మి బావమరదుల కుటుంబాల్లో తొమ్మిది మంది వితంతువులున్నారంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.

ఆగస్టు నెలలో 15 మంది

అధికారిక లెక్కల ప్రకారమే ఒక్క ఆగస్టు నెలలోనే 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అందరూ డయాలసిస్ వరకూ వచ్చిన కిడ్నీ సమస్య పీడితులే. ఈ ఏడాది ఆగస్టు వరకు చూస్తే దాదాపు 40 మంది వరకు మరణించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్దానం ప్రాంతంలో తీవ్రంగా ఉన్న కిడ్నీ వ్యాధి సమస్యకు కారణాలు పూర్తిగా కనుక్కోలేక పోయినట్టుగానే ఇక్కడ కూడా కారణాలు ఇంకా తెలియలేదు. ఉద్దానంలో మంచినీటి సదుపాయం కల్పించే ప్రయత్నం కొంత జరుగుతోంది కానీ ఎ.కొండూరులో అలాంటి ప్రయత్నాలు కూడా కనిపించడం లేదన్నది బాధితుల ఆవేదనగా బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్‌లో వినిపించింది.

చిన్న చిన్న నొప్పులతో మొదలు...

ఎ.కొండూరు మండలంలో నివసించే గిరిజనులు ఎక్కువగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. లంబాడీ తెగకు చెందిన వారు ఎక్కువగా వ్యవసాయం చేస్తుంటారు. అంతో ఇంతో పొలం కలిగి ఉండి, ఇతరుల పొలాల్లో పని చేసుకుంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కానీ కిడ్నీ సమస్యలతో వారంతా తీవ్రమైన ఇక్కట్లలోకి జారుకుంటున్నారు.

మూడేళ్ల క్రితం నిర్వహించిన సర్వేలో దాదాపు 1,500 మంది కిడ్నీ బాధితులు ఉన్నట్టు లెక్కలేశారు. ప్రస్తుతం వారి సంఖ్య మరింత పెరిగి ఉంటుందని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.

'అందరికీ ఒకేలాంటి సమస్య. మొదట చిన్న చిన్న నొప్పులు వస్తాయి. పొలం నుంచి వచ్చిన తర్వాత కదలలేని పరిస్థితి వస్తుంది. నొప్పి తగ్గడానికి ఏదో మందు తాగడం లేదా అందుబాటులో ఉండే మందు బిళ్లలు మింగడం చేస్తుంటారు. సమస్య పెరిగిన తర్వాత ఆస్పత్రికి వెళితే అప్పుడు కిడ్నీ పాడయిందని చెబుతుంటారు. ఏం చేయాలో తెలీదు. మాలాంటి వాళ్లం ఎకరమో, అరకొరమో పొలం తనఖా పెట్టి, లేదా అమ్మేసి వైద్యం చేయిస్తాం. అయినా కూడా ఉన్న భూమి పోయే, నా భర్త పోయే అన్నట్టుగా అవుతోంది. కొందరికి ఎలాంటి ఆధారం లేక అలా పడి ఉండడమే' అంటూ భరోతు లక్ష్మి బీబీసీతో తన బాధను చెప్పుకున్నారు.

భర్త చనిపోయి పక్షం రోజులు కూడా గడవని ఆమె నిత్యం కన్నీరుమున్నీరవుతున్నారు. ఇద్దరు ఆడపిల్లలతో ఎలా నెట్టుకురావాలా అని ఆందోళన చెందుతున్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎ.కొండూరు

మగాళ్లే ఎక్కువ

కిడ్నీల వ్యాధితో ఎక్కువ మంది మగవాళ్లే మరణిస్తున్నారు. అందువల్ల ఒంటరి మహిళల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఆధారం కోల్పోయి జీవనం భారంగా మారిన కుటుంబాలు ఈ ప్రాంతంలో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ప్రతి కుటుంబంలోనూ కిడ్నీ సమస్యతో ఎవరో ఒకరు చనిపోయారంటే పరిస్థితి తీవ్రత తెలుస్తోంది.

మగాళ్లను కోల్పోయిన కుటుంబాలే ఎక్కువగా ఉండడానికి కారణాల్లో మద్యం కూడా ఒకటని స్థానికులు చెబుతున్నారు. చనిపోతున్న వారు 30, 40 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు.

'పొలం పనులు చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కువ మందికి మందు తాగడం అలవాటు. అందులోనూ ప్రభుత్వ మద్యం ఖరీదు పెంచిన తర్వాత అత్యధికులు నాటుసారా బారిన పడ్డారు. అసలే అంతంతమాత్రపు ఆరోగ్యాలు వాటితో పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఏం చేసినా వాళ్ల ప్రాణాలు కాపాడుకోలేకపోతున్నాం. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు చనిపోవడంతో మేం 9 మంది ఒంటరి మహిళలుగా మిగిలాం. భర్తలు కోల్పోయిన కుటుంబాల్లో పిల్లల బాధ్యతను మేమే మోస్తున్నాం' అంటూ భరోతు లక్ష్మి అమ్మ తెలిపారు.

ఎవరి కష్టం వారిదే అన్నట్టుగా పరిస్థితి ఉందంటూ ఆమె బీబీసీ వద్ద వాపోయారు. కూలీ నాలీ చేసుకుని పిల్లల్ని పోషించుకుంటున్నానని, తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

డాక్టర్ గిరిజ

'సమస్యను గుర్తించాం.. మెడికల్ క్యాంపులు పెట్టాం'

తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండే ఎ.కొండూరు మండలం భద్రాచలం మీదుగా ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లే హైవేని ఆనుకుని ఉంటుంది. మండల కేంద్ర గ్రామంతో పాటుగా సమీపంలోని దాదాపుగా అన్ని ఊళ్లలోనూ కిడ్నీ సమస్య పీడితులు ఎక్కువగా ఉన్నారు. చీమలపాడు, దీపా నగర్, చైతన్య నగర్, రేపూడి తండా, కంభం పాడు, లక్ష్మీపురం, పెద్ద తండా ఇలా చాలా గ్రామాల్లో అత్యధికంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) కేసులు నమోదవుతున్నాయి.

ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రస్తుతం 21 మంది డయాలిసిస్ చేయించుకుంటున్నారని వైద్యాధికారి డాక్టర్ గిరిజ బీబీసీకి తెలిపారు.

'ప్రభుత్వం సమస్యను గుర్తించింది. నిపుణుల కమిటీ కూడా పరిశీలించింది. ప్రస్తుతం నెలనెలా మెడికల్ క్యాంపులు మొదలెట్టాం. మూడు నెలలుగా 15 తండాల్లో జరుగుతున్నాయి. సమస్యలున్న వారందరినీ పరీక్షిస్తున్నాం. నెఫ్రాలజిస్ట్ సమక్షంలో సీరం క్రియాటిన్ లెవెల్స్ చెక్ చేస్తాం. అక్కడే వారి స్థాయిని బట్టి మందులు వాడాలా, లేక డయాలసిస్ చేయాలా అనేది నిర్దారిస్తాం. డయాలసిస్ చేయాల్సి వస్తే ఆరోగ్యశ్రీ కింద రిఫర్ చేస్తాం. వారికి రూ.10వేల చొప్పున పెన్షన్ కూడా అందిస్తున్నాం' అని డాక్టర్ గిరిజ వివరించారు.

సీకేడీ సమస్యతో బాధపడుతున్న వారందరినీ గుర్తించి తగిన వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆమె తెలిపారు.

భనోతు చంద్రు

'బతికి ఉన్నానంటే ఉన్నాను'

'నా వయసు 55 ఏళ్లు ఉంటుంది. మా అన్నదమ్ములు చాలామంది పోయారు. మా అందరిదీ ఒకటే సమస్య. డబ్బులు ఉన్నోళ్లు వైద్యం చేయించుకుంటారు. లేదంటే అంతే సంగతి. పెన్షన్లు ఇస్తారని చూస్తున్నాం. నెలనెలా హాస్పిటల్‌కు వెళ్లాలంటే బస్సు ఎక్కలేను. కారు పెట్టుకుని వెళ్లాలి. దానికే రూ.3వేలు అవుతుంది. డాక్టర్ ఫీజు అన్నీ కలుపుకుంటే నెలకు రూ.5-6 వేలకు పైనే అవుతుంది. డయాలిసిస్ స్టేజ్ వస్తే పెన్షన్ అంటున్నారు. మాకు టెస్టులు చేసి అలాంటి స్థితి లేదని చెబుతున్నారు. ఈలోగా వైద్యం అందాలంటే మాకు కష్టమే' అని భరోతు చంద్రు అన్నారు.

'ఎందుకు బతుకుతున్నానో నాకే తెలియడం లేదు. నా కుటుంబానికి కూడా భారంగా మారిపోతున్నాన్నా' అంటూ కిడ్నీ సమస్యతో మంచాన పడి ఉన్న చంద్రూ బీబీసీ ముందు కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే మా కుటుంబాలకు కష్టమే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

'ప్రతిపాదనలు అటకెక్కించారు'

ఎ.కొండూరులో కిడ్నీ సమస్యతో మరణాలు నమోదు కావడం, గత 10ఏళ్లలో క్రమంగా పెరుగుతోంది. ఇటీవల సమస్య తీవ్రమవుతోంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం గతంలోనే కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

ఎ.కొండూరు ప్రాంతంలోని నీటిలో ఫ్లోరైడ్, సిలికాన్ వంటి లోహాలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించిన యంత్రాంగం ఆరేళ్ల క్రితమే కృష్ణా జలాలను పైప్ లైన్ ద్వారా తరలించాలని ప్రతిపాదించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇబ్రహీంపట్నం వద్ద పంప్ హౌస్ నిర్మించి, తాగునీటిని అందించాలనే ఆలోచనలు కూడా అటకెక్కాయి.

'సామాన్యులు, అత్యధికంగా గిరిజనుల ప్రాణాలు పోతున్నా చలనం లేదు. తగిన వైద్యం అందడం లేదు. కొండూరూలోనే డయాలిసిస్ సెంటర్ పెట్టాలి. మెడికల్ క్యాంపులు నెలకొకసారి కాకుండా ప్రత్యేకంగా నెఫ్రాలజిస్ట్‌ను అందుబాటులో ఉంచాలి. బాధితులందరికీ పెన్షన్లు ఇవ్వాలి. సురక్షిత తాగునీటి పథకం ఆచరణలోకి తీసుకురావాలి. లేదంటే నిత్యం ఆ గ్రామాల్లో చావు కేకలు వినాల్సిందే. గడిచిన రెండేళ్లలో కిడ్నీ వ్యాధి పీడితులు, మృతుల సంఖ్య అమాంతంగా పెరగడానికి కారణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. లేదంటే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది' అంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు అన్నారు.

ఇటీవల సీపీఎం కార్యకర్తలు కిడ్నీ సమస్యతో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలంటూ ఆందోళనలు నిర్వహించారని, అయినా ప్రభుత్వం సక్రమంగా స్పందించడం లేదని బాబూరావు ఆరోపించారు.

'సమగ్ర చర్యలు అవసరం'

కిడ్నీ సమస్యతో సతమతమవుతున్న వారిని ఆదుకునేందుకు అనేక చర్యలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. తాత్కాలిక చర్యలతో సమస్య పరిష్కారం కాదన్నది వారి అభిప్రాయం.

'ఎ.కొండూరు మండలంలోనే కాకుండా తెలంగాణాలోని వీఎం బంజర వంటి ప్రాంతాల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంది. తాగునీటి సమస్య తీర్చినా పంటల కోసం, వంట కోసం వినియోగించే నీటి ద్వారా ఫ్లోరైడ్ వారిని బలహీనపరుస్తోంది. ఎముకలు బలహీనపడి నొప్పులు వస్తున్నాయి. వాటిని తగ్గించడం కోసమంటూ స్థానిక మెడికల్ ప్రాక్టీషనర్స్ ఇచ్చే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. దాని ప్రభావం కిడ్నీపై పడుతుంది. కిడ్నీ దెబ్బతిన్న తర్వాత సకాలంలో గుర్తించకపోతే ప్రాణాపాయం ఉంటుంది. ఎక్కువ కేసుల్లో తగిన వైద్యం అందకపోవడం కూడా కారణమే' అని విజయవాడకు చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బోడేపూడి చౌదరి తెలిపారు.

మద్యం ఎక్కువగా సేవించడం, ఆహారపు అలవాట్లు వంటివి కూడా సమస్య కారణమవుతున్నందున వారిలో ఆరోగ్య అవగాహన పెంచేందుకు దీర్ఘకాలిక ప్రాణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.

'తగిన చర్యలు తీసుకుంటున్నాం'

ఎ.కొండూరులో కిడ్నీ సమస్యతో మరణిస్తున్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ బీబీసీతో అన్నారు. బాధితులను ఆదుకునే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Andhra Pradesh: Most of the men die in this village. why What measures is the government taking?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X