వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్: రోడ్లు అధ్వానం... ప్రయాణం భయానకం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఏపీలో రోడ్లు

ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో దారుణంగా ఉన్నాయి. రోడ్ల మీద ప్రయాణించాలంటే నరకయాతన తప్పడం లేదని అనేకమంది వాపోతున్నారు.

గతంలో మాదిరిగా మరమ్మత్తులు చేసేందుకు ఆర్ అండ్ బీ శాఖలో వర్క్ చార్జ్‌ సిబ్బంది లేకపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. దానికి మించి ప్రభుత్వం నిధులు వెచ్చించకపోవడం, కాంట్రాక్టర్ల పెండింగు బిల్లులు చెల్లించకపోవడం అసలు కారణమనే విమర్శలున్నాయి.

ప్రభుత్వం కూడా రోడ్లు బాగోలేదని అంగీకరిస్తూనే దానికి గత ప్రభుత్వం కారణమని నిందలు వేస్తోంది. వర్షాకాలం కావడంతోనే ఈ సమస్య ఉందని చెబుతోంది.

నల్లజర్ల సమీపంలోని రోడ్డు

రోడ్డు కన్నా గోతులే ఎక్కువ

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బీబీసీ బృందం ప్రత్యక్షంగా రోడ్లను పరిశీలించింది. ఆయా రోడ్లన్నీ గోతులతో నిండిపోయి ఉండడం విశేషం. తాడేపల్లిగూడెం నుంచి కొయ్యలగూడెం వరకూ ఉన్న రాష్ట్ర రహదారి మీద ప్రయాణించాలంటే పెద్ద సాహసంగానే మారింది.

భారీగా గోతులు పడి ఆటోలు, కార్లలో ప్రయాణించేవారికి నరకం కనిపిస్తోంది. రావులపాలెం- అమలాపురం రోడ్డు కూడా అదే పరిస్థితి. నిడదవోలు - పెరవలి రహదారి ఇక చెప్పనవసరం లేదు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మీద కూడా గోతులు పడి టూవీలర్లు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. చివరకు జొన్నాడ- రాజమహేంద్రవరం మధ్య జాతీయ రహదారి మీద రాకపోకలకు అత్యంత కష్టంగా మారింది.

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రంలోనే అనేక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇక రాష్ట్ర సరిహద్దులలో కూడా ఇలాంటి సమస్యలు తప్పడం లేదు. కర్ణాటక ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోనూ, శ్రీకాళహస్తి నుంచి చెన్నై వెళ్ళే రోడ్డులోనూ అదే దుస్థితి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో మూడోవంతు రోడ్లుపై ప్రయాణం దుర్భరంగా మారింది.

పశ్చిమ గోదావరి

ఆ వ్యవస్థను రద్దు చేసేశారు..

రాష్ట్ర ప్రభుత్వంలో ఒకప్పుడు వర్కు చార్జుడు ఉద్యోగులు ఉండేవారు. ఎన్ఎంఆర్, కాంట్రాక్ట్ పద్ధతిలో కూడా మరికొందరు సిబ్బందిని నియమించేవారు. ఇరిగేషన్, డ్రైనేజీ డిపార్ట్ మెంట్ సహా ఆర్ అండ్ బీ లో కూడా వారంతా చిన్న చిన్న మరమ్మత్తులు ఎప్పటికప్పుడు సరి చేసేవారు. తద్వారా రోడ్లు గోతులు పడితే తక్షణమే పూడ్చేయడం వల్ల అవి పెద్దగా మారకుండా అడ్డుకోలిగేవారు.

కానీ ప్రస్తుతం ఆ వ్యవస్థ పూర్తిగా పోయింది. కొత్తగా నియామకాలు లేకపోవడంతో దాదాపు అన్ని శాఖల్లోనూ వర్క్ ఛార్జుడు ఉద్యోగులు కనిపించడం లేదు.

ఒకసారి రోడ్డు వేసిన తర్వాత మళ్లీ ఆ రోడ్డు పునర్నిర్మాణం జరిగే వరకూ దాని బాగోగులు చూసే యంత్రాంగం లేకపోవడం పెద్ద లోటు.

భారీగా గోతులు పడి, ప్రయాణీకులు గగ్గోలుపెడితే అక్కడక్కడా వాటిని సరిచేసేందుకు కాంట్రాక్టులు ఇస్తున్నారు. వాటిలో కూడా పర్యవేక్షణ అంతంతమాత్రంగా మారింది. కాంట్రాక్టులు తోచినట్టు పనిచేస్తున్నారు.

నాణ్యతాలోపం రోడ్ల నిర్మాణంలో కనిపిస్తోంది. ఫలితంగా రోడ్డు ప్రయాణం బాగా కష్టంగా మారింది. ప్రస్తుతం వర్షాకాలం అంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ నిరుడు కూడా ఈ సీజన్ లో ఇదే సమస్య ఎదురయ్యింది.

అప్పుడు కూడా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడమే తప్ప పనిచేసింది లేదు అంటూ ఆర్ అండ్ బీ మాజీ ఇంజనీర్ కే ప్రభాకరవర్మ బీబీసీతో అన్నారు.

ఏపీలో రోడ్లు

బడ్జెట్ అంతంతమాత్రమే

రాష్ట్రం మొత్తం మీద స్టేట్ హైవేలుగా గుర్తించిన రోడ్లు 14,714 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. అందులో 99 రోడ్లు బాగా శిథిలమయినట్టు ఆర్ అండ్ బీ అధికారులు గుర్తించారు. వాటితో పాటుగా జిల్లాల్లో మేజర్ రోడ్లను కూడా ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు. కానీ ప్రస్తుతం ఏపీలో ఆర్ అండ్ బీ శాఖ రోడ్ల మీద చేస్తున్న వ్యయం జాతీయ సగటుతో పోలిస్తే తక్కువే ఉంటుంది.

2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో రోడ్లు, వంతెనల కోసం 1.7 శాతం మాత్రమే కేటాయించారు. ఇది వివిధ రాష్ట్రాల సగటు 4.3 శాతంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. మొత్తం రూ. 7,594 కోట్లను బడ్జెట్ లో ప్రతిపాదించగా వాస్తవంగా వెచ్చించే విషయంలో కోత తప్పదని గత కొన్నేళ్ల అనుభవం చెబుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితి

ముందుకు రాని కాంట్రాక్టర్లు

రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లు బాగు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దానికి అనుగుణంగా 8970 కిలోమీటర్ల మేర రోడ్ల పనులకు టెండర్లు పిలిచింది. దానికి గానూ రూ. 2వేల కోట్ల రుణం తీసుకుని రూ. 2205 కోట్లతో పనులకు ప్రయత్నించింది. 1140 పనులకు టెండర్లు పిలిస్తే అందులో ఇప్పటి వరకూ దాదాపు 400 పనులకు మాత్రమే కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. రాయలసీమలో మినహా మిగిలిన చోట టెండర్లు వేసేందుకు కూడా సుముఖత చూపడం లేదు. విజయనగరం జిల్లా వరకూ కొన్ని పనులకు టెండర్లు దాఖలయ్యాయి.

దానికి ప్రధాన కారణం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడమేనని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.

గత ఏడాదికి సంబంధించి రూ. 388 కోట్లు విడుదల చేశారు. రెండేళ్ళ నుంచి ఎదురుచూస్తుంటే వచ్చిన ఆ డబ్బులతో వడ్డీలు చెల్లించడానికే సరిపోయింది. ఇప్పుడు మళ్లీ టెండర్లు వేయాలంటే పాత అప్పులు తీర్చాలి.

ప్రభుత్వం మాత్రం బిల్లులు క్లియర్ చేయడం లేదు. వర్క్ చేసినా మళ్లీ ఎప్పటికి బిల్లు ఇస్తారో స్పష్టత లేదు. అందుకే ఎవరూ మందుకు రావడం లేదు. నిరుడు రాష్ట్రమంతా కలిపి రూ. 930 కోట్లు పనులు జరిగాయి. అందులో రూ. 600 కోట్లు పెండింగు పెట్టి ఆఖరికి రూ. 388 కోట్లు ఇస్తే మిగిలిన బిల్లులు ఏమి కావాలి.

అందుకే ఇప్పుడు ఏపీలో పనిచేయాలంటే కాంట్రాక్టర్లకు చాలా కష్టంగా మారింది అంటూ కాంట్రాక్టర్ మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి బీబీసీతో అన్నారు.

ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందన లేదు..

ఓవైపు రోడ్లు దారుణంగా ఉన్నాయి. బాగోగులు చూసే సిబ్బంది లేరు. సరిచేయాలంటే టెండర్లు వేయడానికి కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దాంతో ఏపీలో రోడ్లు ఎప్పటికి బాగు చేస్తారో తెలియక సామాన్యులు తీవ్రంగా సతమతం అవుతున్నారు.

"రాష్ట్రమంతా రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రయాణించాలంటే వెనకాముందూ చూసుకోవాల్సి వస్తోంది. గర్భిణీలు, నడుంనొప్పి ఉన్న వాళ్లయితే రోడ్డెక్కపోవడమే ఉత్తమం. గోతులు పడి ఏళ్లు గడుస్తున్నా ఉలుకూ పలుకూ లేదు. మేమే కొనిరోడ్లు కప్పెట్టాము. మళ్లీ వర్షాలకు మామూలే. రోడ్ల మీదే స్విమ్మింగ్ ఫూల్స్ కనిపిస్తున్నాయి. అధికారులకి, ప్రజా ప్రతినిధులకు చెప్పినా ఉలుకూ పలుకూ లేదు. ఇలా ఎన్నాళ్లన్నది అర్థం కావడం లేదని' నల్లజర్లకి చెందిన చెల్లు సత్యన్నారాయణ అనే ప్రయాణీకుడు బీబీసీతో అన్నారు.

"వాహనాలన్నీ పాడయిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే రోడ్ల మీదకు వస్తున్నాం. కానీ కారు టైర్లు నాశనమయిపోతున్నాయి. 50 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చాలు మరునాడు ఒళ్లునొప్పులతో బాధపడాల్సి వస్తోంది. రోడ్లు అభివృద్ధి ప్రభుత్వం పని కాదా.. లేక మరచిపోయారా?. ఏపీలో ప్రయాణం చేయాలంటే చాలామంది వెనకాడుతున్నారు. ఆ రోడ్డూ, ఈ రోడ్డూ అనే తేడా లేదు. దాదాపు అన్ని చోట్లా అంతే అన్నట్టుగా ఉంది.' అంటూ అమలాపురానికి చెందని ఏటుకూరి సుబ్బరాజు బీబీసీతో అన్నారు.

కొయ్యలగూడెంలో రోడ్డు వాన వస్తే బురద, లేదంటే దుమ్ము

సంక్షేమం పేరుతో రోడ్లు పట్టించకోరా?

"ప్రభుత్వం సంక్షేమానికి ఖర్చు చేస్తున్నట్టు చెప్పుకుంటోంది. కానీ రోడ్లు బాగు చేయాల్సిన బాధ్యత లేదా. మేము రోడ్ల మీద పడిన గోతుల్లో వరి నాట్లు వేసి, పడవలు కూడా వదిలి నిరసన తెలిపాము. అనేక మంది రాత్రి పూట ప్రయాణాల్లో గాయాల పాలవుతున్నారు. కొందరి ప్రాణాలు కూడా పోతున్నాయి. అయినా ప్రభుత్వానికి పట్టడం లేదు. ఏపీలో రోడ్లనూ ఎన్నడూ ఇంత దుస్థితిలో చూడలేదు. పెట్రో ఉత్పత్తులపై వసూలు చేస్తున్న సెస్, దొరికిన చోటల్లా చేస్తున్న అప్పులన్నీ ఏమవుతున్నాయి. రాష్ట్రమంతా జనం ఆందోళనలో ఉన్నా స్పందించకపోవడం చూస్తుంటే ప్రభుత్వం పూర్తిగా విఫలమయినట్టు చెప్పవచ్చు" అని టీడీఎల్పీ డిప్యూటీ లీడర్, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు అన్నారు. .

బ్యాంకు రుణాలతో బకాయిలు చెల్లిస్తాం

ఆర్ అండ్ బీ కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు తెలిపారు.

"ఏపీలో రోడ్డు పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అందుకే వారిలో విశ్వాసాన్ని పెంచేందుకు పాత బిల్లులన్నీ చెల్లించాలని సీఎం ఆదేశించారు. 5 ప్రధాన బ్యాంకులతో సంప్రదిస్తున్నాం. వాటిలో మూడు బ్యాంకులు రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అవి తీసుకుని కాంట్రాక్టర్లకు చెల్లిస్తాం. పెట్రోల్, డీజీల్ ద్వారా వచ్చే సెస్ ని ఏపీ రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కి అందిస్తున్నాం. ఇప్పటికే బడ్జెట్ అంచనాల మేరకు రూ. 410 కోట్లు కేటాయించాము. రూ. 160 కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రోడ్ల పరిస్థితిని మోనటరింగ్ చేసందుకు, ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టేందుకు ప్రతీ రెండు జిల్లాలకు ఓ చీఫ్ ఇంజనీర్ ని నోడల్ ఆఫీసర్ గా పెట్టాం. త్వరలోనే వర్షాలు తగ్గితే పనులు మొదలవుతాయి" అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Andhra Pradesh: Roads are bad,travel is scary
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X