వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్ 16 వేల పట్టాలిస్తే, 16 ఇళ్లే పూర్తయ్యాయి, ఎందుకు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జగనన్న ఇళ్లు

ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ శాఖకు సంబంధించి వైఎస్సార్ గృహ నిర్మాణ పథకంలో భాగంగా పేదలందరికీ ఇంటి సదుపాయం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మూడేళ్ళుగా సాగుతున్న ఈ ప్రక్రియ ఆచరణలో ఆశించినంత వేగంగా కనిపించడం లేదు. చివరకు, స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పేదలకు పట్టాలు అందించిన కాలనీలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.

కాకినాడ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న జగనన్న హౌసింగ్ కాలనీలో పరిస్థితిని బీబీసీ పరిశీలించింది.

16 వేల పట్టాలిస్తే...16 ఇళ్లు పూర్తి

తమ ప్రభుత్వం కొత్తగా ఇళ్లు కాదు, ఊళ్లు నిర్మిస్తోందని సీఎం ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కొమరగిరి గ్రామం పరిధిలో ఒకే చోట 16 వేల మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నట్టు చెబుతూ లాంఛనంగా ప్రారంభించారు.

2020 డిసెంబర్ 25న సీఎం జగన్ చేతుల మీదుగా ప్రతిపాదిత కాలనీ నిర్మాణ ప్రాంతంలో పైలాన్ ఆవిష్కరించి సభ నిర్వహించారు.

కొందరు లబ్దిదారులకు పట్టాలు అందించి, త్వరలోనే అందరికీ సొంతింటి కల నెరవేరుతుందని హామీ ఇచ్చారు.

కాకినాడ నగరానికి చెందిన వివిధ డివిజన్లలో నివసించే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. నవరత్నాలలో పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు.

16,601 మంది లబ్దిదారులకు ఇక్కడ ఇళ్ల స్థలాలు అందించారు. మూడు ఆప్షన్లు ఇచ్చి లబ్దిదారులు కోరుకున్న రీతిలో మూడేళ్ల నాటికి నిర్మాణాలన్నీ పూర్తి చేస్తామని తెలిపారు.

తీరా ఇప్పుడు రెండేళ్లు గడిచిన తర్వాత అధికారిక లెక్కల ప్రకారం కేవలం 16 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.

మరో 24 ఇళ్లకు స్లాబులు పూర్తి చేశారు. స్లాబు ఎత్తు వరకు పూర్తయిన ఇళ్లు 29 ఉన్నాయి. మరో 487 పునాదులు మాత్రమే నిర్మించి వదిలేశారు.

మొత్తంగా దాదాపు 600 మంది ఇంటి నిర్మాణ ప్రయత్నాలు చేయగా, మిగిలిన 16 వేల మంది ముందుకు వచ్చిన దాఖలాలే కానరావడం లేదు.

జగన్నన్న ఇళ్లు

ఒక్కో చోట ఒక్కో రీతిలో..

ఈ పథకంలో పలు చోట్ల పేదలకు విలువైన స్థలాలు దక్కాయి. ముఖ్యంగా జాతీయ రహదారులను ఆనుకుని కాలనీల నిర్మాణం ప్రారంభమయ్యింది.

కానీ, కొన్ని ముంపు ప్రాంతాలలో, కనీస మౌలిక వసతులు కూడా లేని చోట్ల స్థలాలు కేటాయించారు. పైగా నివాస ప్రాంతాలకు సుదూరంగా స్థలాలు ఇవ్వడంతో లబ్దిదారులు ఆసక్తి చూపడం లేదని అధికారులు చెబుతున్నారు.

సీఎం ప్రారంభించిన చోట కూడా ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుండగా, సమీపంలోని కొన్ని కాలనీల్లో గృహ ప్రవేశాలు జరుగుతున్నట్టు బీబీసీ దృష్టికి వచ్చింది.

"అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్న చోట లబ్దిదారులు వేగంగా కదులుతున్నారు. నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇళ్లు పూర్తయిన చోట లబ్దిదారులు నివాసం కూడా ఉంటున్నారు. కానీ కొమరగిరి లే అవుట్ బీచ్ రోడ్‌లో ఉంది. తుపానులు, వరదల భయం కొందరిలో కనిపిస్తోంది. చాలామందిలో పలు అపోహలు కూడా ఉన్నాయి. అన్నింటికీ మించి అది నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. పేదలు అంత దూరం వెళ్లి నివాసం ఉండేందుకు మొగ్గుచూపడం లేదు. వారికి నచ్చజెప్పి నిర్మాణ పనులు ప్రారంభించాలని చెబుతున్నాం. కొందరు ముందుకొస్తున్నారు. త్వరలోనే కాలనీ ఓ రూపు దాలుస్తుందని ఆశిస్తున్నాం" అంటూ ఏపీ హౌసింగ్ కార్పోరేషన్‌లో డీఈ గా పనిచేస్తున్న అధికారి బీబీసీకి తెలిపారు.

పై అధికారులు తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, కానీ లబ్దిదారులు ముందుకు రాకుండా తాము ఏమి చేయగలమని ఆయన వాపోయారు. తన పేరు ప్రస్తావించవద్దని కోరారు.

జగన్నన్న ఇళ్లు

మౌలిక వసతుల కొరత...

నగరంలో రోజువారీ పనులు చేసుకుని జీవనం సాగించే పేదలకు, దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించడం వల్ల రోజూ అక్కడి నుంచి నగరంలో పనులకు రావాలంటే భారమవుతుందని అత్యధికులు భావిస్తున్నారు.

కొందరు లబ్దిదారులు సొంత ఇల్లు కట్టుకుందామని ఆశించినాగానీ వారికి సదరు కాలనీలో మౌలిక సదుపాయాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది.

రెండేళ్ళ క్రితం సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేసి, మోడల్ ఇంటి నిర్మాణం జరిగినా, నేటికీ ఈ లే అవుట్‌లో రోడ్డు సదుపాయం లేదు.

ఇంటి నిర్మాణం పూర్తి చేసిన వారు నివాసం ఉండేందుకు విద్యుత్ సదుపాయం కూడా లేదు. మంచినీటి సమస్య ఉంది. ఇలాంటి అత్యవసరాలు కూడా అందుబాటులో లేకుండా ఇల్లు కట్టుకుని రావాలంటే ఎవరు ముందుకొస్తారని లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు.

తమకు ఇళ్ల పట్టా అందించిన ఏడాదిలోనే ఇళ్లు నిర్మించుకుని కాకినాడ ప్రతాప్ నగర్ నుంచి కొమరగిరి కాలనీలోకి మారిన ఓ కుటుంబాన్ని బీబీసీ కలిసింది.

"మేం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇక్కడికి వచ్చేశాం. ఇల్లు పూర్తి చేయడానికి మాకు రూ. 7 లక్షలయింది. చేతి నుంచి రూ. 5 లక్షలు ఖర్చు పెట్టాం. స్వయంగా ఎమ్మెల్యే వచ్చి మా ఇంటిని ప్రారంభించారు. వాతావరణమంతా బాగుంది. చాలామంది భయపెట్టారు. కానీ ఎవరు లేకపోయినా మేం ఉందామని వచ్చేశాం. అయితే మాకు రోడ్లు, కరెంటు లేకపోవడంతో దూరం నుంచి పది వేలు ఖర్చు చేసి మేమే లాక్కున్నాం. మంచినీళ్లు కూడా అప్పుడప్పుడూ ట్యాంకర్ వస్తోంది. కరెంటు అందుబాటులోకి తెచ్చి మంచినీటి కుళాయిలు వేస్తే చాలామంది వస్తారు. పిల్లల స్కూల్ గురించి కూడా కొందరు భయపడి రావడం లేదు. అలాంటివి వస్తే చాలామంది ఇళ్లు కట్టుకుంటారు" అని నాగరత్నం అనే మహిళ తెలిపారు.

కనీస సదుపాయాలు కల్పిస్తున్నామని చెబుతున్నారే గానీ చేయడం లేదు అందుకే చాలామందికి నమ్మకం కలగడం లేదని ఆమె అన్నారు.

జగన్నన్న ఇళ్లు

కాంట్రాక్టర్ కి అప్పగించిన ప్రభుత్వం..

రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం 15901 లేఅవుట్లలో కాలనీలు నిర్మించేందుకు పూనుకుంది. ఈ పథకం తొలి విడతలో 13.96 లక్షల ఇళ్లు మంజూరు చేసింది.

అందులో ఇప్పటి వరకూ కేవలం 1,42,552 ఇళ్లు మాత్రమే పూర్తయినట్టు అధికారికంగా చెబుతున్నారు.

ఈ పథకం కోసం 2022 నవంబర్ 27 నాటికి రూ. 5685 కోట్లు వెచ్చించగా, పూర్తయిన ఇళ్ల సంఖ్య చాలా స్వల్పంగా కనిపిస్తోంది. లబ్దిదారులకు తొలుత మూడు ఆప్షన్లు ఇచ్చినప్పటికీ అత్యధికులు, ప్రభుత్వమే ఇంటిని పూర్తి చేసి అందించాలని కోరుతున్నారు.

దాంతో కాలనీల నిర్మాణాన్ని అనేక చోట్ల కాంట్రాక్టర్లకు అప్పగించారు.

కొమరగిరి లే అవుట్‌లో సీఎం స్వయంగా ప్రారంభించిన చోట పరిస్థితి నిరాశాజనకంగా ఉండడంతో అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా ఒక్కో ఇంటిని రూ. 3 లక్షల వ్యయంతో నిర్మించేందుకు ఓ సంస్థకు పనులు అప్పగించారు.

ఏకకాలంలో 8,500 ఇళ్ల నిర్మాణానికి నెల్లూరుకి చెందిన జేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ పనులు ప్రారంభించింది.

"ప్రభుత్వం వల్లనే జాప్యం జరుగుతోంది. ప్రచారంలో ఉన్నంత వేగంగా నిధులు కేటాయించలేదు. దాంతో కాలనీల నిర్మాణం ఆలస్యమయ్యింది. ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మౌలికవసతులు కల్పించి ఉంటే చాలామంది ఇళ్లు కట్టుకునే వారు. కానీ ఇప్పుడు ఇంటిని కట్టుకోవడానికి మెటీరియల్ చేర్చాలన్నా వాహనం వెళ్లే పరిస్థితి లేదు. అందుకే పేదలు అద్దె ఇళ్లల్లోనే గడుపుతున్నారు తప్ప, పట్టాలు అందుకున్న ఫలితం దక్కలేదు. కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించిన ఇళ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి. సముద్రం ఒడ్డున నిర్మిస్తున్న కొమరగిరి కాలనీ నాసిరకంగా కడితే స్వల్పకాలంలోనే సముద్రపు గాలుల ప్రభావానికి దెబ్బతింటాయి. దానిని దృష్టిలో పెట్టుకోవాలి" అని కాకినాడ పట్టణ పేదల సమాఖ్య ప్రతినిధి మేడిశెట్టి వెంకట రమణ అభిప్రాయపడ్డారు.

ఎన్నికల ముంగిట హడావిడిగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇళ్ల నాణ్యతను విస్మరిస్తే ప్రభుత్వం ఇచ్చిన రూ. 1.80 లక్షలకు తోడుగా పేదలు ఖర్చు చేస్తున్న మొత్తానికి ప్రయోజనం లేకుండా పోతుందని ఆయన బీబీసీతో అన్నారు.

జగన్నన్న ఇళ్లు

'దృష్టి పెట్టాం.. లక్ష్యం నెరవేరుతుంది'

సకాలంలో పేదలందరి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. సీఎం ప్రారంభించిన కాలనీ నిర్మాణంలో జాప్యం జరుగుతోందని, అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ఆమె బీబీసీతో అన్నారు.

"కొమరగిరి కాలనీ విషయంలో పర్యవేక్షణ చేస్తున్నాం. స్వయంగా వెళ్లి పరిశీలించాం. అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా కాంట్రాక్టర్లకు అప్పగించాం. సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించాం. పనులు మొదలయ్యాయి కాబట్టి త్వరలోనే మంచి ఫలితాలను ఆశిస్తున్నాం. లక్ష్యానికి అనుగుణంగా వాటిని సిద్ధం చేయగలమని భావిస్తున్నాం. మూడు కాంట్రాక్ట్ సంస్థలకు ప్యాకేజీల ప్రకారం అప్పగించాం. తొలివిడతలో 13 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం" అంటూ ఆమె వివరించారు.

ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఇళ్ల నిర్మాణం పూర్తయితే లబ్దిదారుల్లో అత్యధికులు కాలనీలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.

కానీ రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో పూర్తి చేయాలనుకుంటున్న 13 లక్షల ఇళ్ల నిర్మాణమే నత్తనడకన సాగుతుండడంతో ఈ పథకంలో పట్టాలు పంపిణీ చేసిన మొత్తం 31 లక్షల మందికి సొంత ఇంటి కల నెరవేరేందుకు ఎంత సమయం పడుతుందోనన్న సందేహం వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Andhra Pradesh: When CM Jagan distributes 16 thousand of house pattas, only 16 houses have been completed, why?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X