వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంగన్‌వాడీలు-ఆశావర్కర్లు: డ్యూటీ చేయాలంటే మాస్కులు కూడా ఇవ్వడం లేదు...చనిపోతే పైసా ఇచ్చే దిక్కు లేదు..మేం బతకాలా వద్దా ?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గ్రామీణ ఆరోగ్య పరిరక్షణలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.

ప్రభుత్వం తమ పట్ల చిన్న చూపు చూస్తోందని ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు ఆరోపిస్తున్నారు. ఆర్ధికంగా ఎలాంటి భరోసా లేదని, కోవిడ్ వేళ ఆరోగ్య పరంగా కూడా రక్షణ లేకుండా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నామని వారు వాపోతున్నారు.

ప్రభుత్వ తీరుకు నిరసనగా మే 24న ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఆశా వర్కర్లు ఆందోళనలు చేపట్టారు. అయితే, వారి ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని సంబంధిత శాఖ మంత్రి , అధికారులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్షమంది అంగన్ వాడీ సిబ్బంది పని చేస్తున్నారు. కోవిడ్ సమయంలో ఇంటింటికి వెళ్లి ఫీడ్ అందించడం వారి బాధ్యత. అయితే, వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో తమకు కనీస భద్రతా ఏర్పాట్లు లేవని వారు అంటున్నారు.

''ఒక్క గ్లౌజ్ ఇవ్వరు. శానిటైజర్ కూడా అందించరు. కనీసం మాస్క్ పంపిణీ లేదు. ఇప్పటికే కోవిడ్ బారిన పడి రాష్ట్ర వ్యాప్తంగా 35 మంది వరకూ అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు.'' అని ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీరాణి అన్నారు.

''బతికి ఉంటే రక్షణ లేదు.. చనిపోతే ఇన్సూరెన్స్ కూడా లేదు. ఎలా డ్యూటీ చేయాలి'' అని ప్రశ్నించారామె.

ఇటు ఆశా వర్కర్ల కరోనా విధులు కూడా కత్తి మీద సాములా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు ఇప్పటికే వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ విధుల్లో వారికి అరకొరగా రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి.

ఆశా వర్కర్లు ఇంటింటికీ తిరిగి అన్ని రకాల సర్వేలు చేయాలి. కోవిడ్ బాధితులను గుర్తించి పీహెచ్‌సీలకు పంపాలి. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి మందులు అందించి, జాగ్రత్తలు పాటించేలా చూడాలి. ఇలా అనేక విధులు నిర్వహిస్తున్నా, వారికి ప్రాణాల రక్షణకు గ్యారంటీ లేదు.

కోవిడ్ కారణంగా మరణించినా, వ్యాక్సిన్ వికటించి మరణించినా ఆశా వర్కర్లకు ఫ్రంట్‌లైన్ వారియర్ ఇన్సూరెన్స్ అందడం లేదని, అనేక సమస్యలతో ఆశా వర్కర్లు విధులు నిర్వహిస్తుంటే ప్రభుత్వాలు చులకనగా చూస్తున్నాయని ఆశా వర్కర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె. ధనలక్ష్మి అభిప్రాయపడ్డారు.

తమ డిమాండ్‌లు నెరవేర్చాలంటూ ఆంధ్రప్రదేశ్ ఆశా కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు.

క్షేత్రస్థాయిలో వారే కీలకం..

వైద్య, ఆరోగ్య రంగంలో ఆశాలు అత్యంత కీలకం. పట్టణాలు, గ్రామాల్లో నిర్ధిష్ట జనాభా పరిధిలో వారు సేవలు అందిస్తున్నారు. కోవిడ్‌కి ముందు గర్భిణీలు, ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలపై పని చేసేవారు. పల్స్ పోలియో చుక్కలు వేయడం వంటి విధులు నిర్వహించేవారు.

ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఏడాది కాలంగా వారు అవిశ్రాంతంగా పని చేయాల్సి వస్తోంది. అన్ని రకాల సేవలు ఆశాల ద్వారానే సాగుతున్నాయి. ఒక్క ఆంధ్ర ప్రదేశ్‌లోనే సుమారు 40వేల మంది ఆశా వర్కర్లు సేవలందిస్తున్నారు.

అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు కూడా క్షేత్రస్థాయిలో పని చేస్తుంటారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందించడం, పిల్లల్లో మానసిక ఉల్లాసం కల్పించేలా తరగతులు నిర్వహించడం వారి విధి.

ఇవి కాక గ్రామీణ స్థాయిలో వివిధ కార్యక్రమాలలో వారికి విధులు తప్పవు. ఇటీవల కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా అంగన్ వాడీలకు డ్యూటీలు వేస్తున్నారు. కొందరికి నైట్ డ్యూటీలు కూడా వేశారు.

ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య నియమాలను వివరించి మందులను అందిస్తుంటారు.

కనీస రక్షణ సదుపాయాలు లేవు

అంగన్‌వాడీలు, ఆశాలు ఎటువంటి రక్షణ ఏర్పాట్లు లేకుండానే పని చేస్తున్న దృశ్యాలు బీబీసీ పరిశీలనలో అనేకచోట్ల కనిపించాయి. వారికి పీపీఈ కిట్లు కాకపోయినా కనీసం గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్ లాంటి కనీస రక్షణ సదుపాయాలు కూడా లేవు.

''మా ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్లున్నారు. మా ప్రాంతంలో కోవిడ్ బాధితుల పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేయాలి. సీరియస్‌గా ఉన్న వారిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అంబులెన్స్‌ సిబ్బందికి పీపీఈ కిట్ ఉంటుంది గానీ మాకు ఉండదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కరోనా సోకే ప్రమాదం ఉంది. మా ఇళ్లలో వాళ్లకు అంటుకుంటే పరిస్థితి ఏంటి.'' అని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలానికి చెందిన ఆశా వర్కర్ కె.దీప బీబీసీతో అన్నారు.

తోటి ఆశా వర్కర్లు చాలామంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని, ఆరోగ్యం బాగా లేకపోయినా డ్యూటీలు చేయాల్సి వస్తోందని దీప అన్నారు.

'పని చేసినా బిల్లులు లేవు'

అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రతీ ఏటా మే నెలలో చెరో 15 రోజులు సెలవులు ఇచ్చేవారు. కానీ, కోవిడ్ కారణంగా ఈసారి అది అమలు కాలేదు.'' ప్రాథమిక పాఠశాలలు సహా అందరికీ సెలవులు ప్రకటించి, 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలతో నడిచే అంగన్ వాడీ సెంటర్లు కొనసాగించాలని ఆదేశించడం వెనుక కారణాలు అర్థం కావడం లేదు'' అని అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సుబ్బరావమ్మ బీబీసీతో అన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఈ సమస్య పరిష్కరించడం లేదని ఆమె తెలిపారు.

అంగన్ వాడీ వర్కర్లు ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నప్పటికీ బిల్లుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ఉందని అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన కార్యకర్త కె.రజిత బీబీసీకి తెలిపారు.

ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేస్తున్నామని, గతంలో మాకు సూపర్‌ వైజర్ పోస్టు కేటాయిస్తామని మండలం అంతా పని చేయించారని, ఆ తర్వాత హఠాత్తుగా నిలిపి వేశారని రజిత అన్నారు.

''అంగన్‌ వాడీ వర్కర్లుగా సెంటర్లలో అన్ని విధులు నిర్వహిస్తున్నా 2017 ఫిబ్రవరి నుంచి మాకు టీఏ బిల్లులు రావడం లేదు. ప్రాజెక్ట్, సెక్టార్ మీటింగులకు వెళ్లే సమయంలో కరోనా సమయంలో చాలా భయంగా వెళ్లాల్సి వస్తోంది. దారి ఖర్చులు రెట్టింపు అయ్యాయి. నాలుగేళ్లుగా బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారు'' అని రజిత అన్నారు.

పని చేసే సమయంలో ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

'ప్రాణాలు పోతున్నా ఖాతరు చేయరా..’

కోవిడ్‌ కాలంలో అంగన్‌వాడీ సెంటర్లు నడపడంతో కరోనా సోకి తూర్పు గోదావరి జిల్లాలోనే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని బేబీరాణి బీబీసీకి తెలిపారు. ఇంత జరుగుతున్నా సెంటర్లు మూసివేసే విషయంలో అధికారులు పట్టుదలకు పోతుండడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ సెంటర్లలో డ్యూటీ వేసి రక్షణ లేకుండా చేస్తే ఎలా అని ఆమె ప్రశ్నించారు.

గర్భవతులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులున్న ఆశా, అంగన్ వాడీ వర్కర్లకు కోవిడ్ డ్యూటీలు మినహాయింపు ఇవ్వాలని వారు కోరుతున్నారు. రిస్క్ అలవెన్సులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి

రాష్ట్రంలో అంగన్‌ వాడీ కార్యకర్తల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత బీబీసీతో అన్నారు.

''గత లాక్‌డౌన్ సందర్భంగా అంగన్‌ వాడీ కేంద్రాలు ఎక్కువ కాలం మూత వేయాల్సి వచ్చింది. పని దినాల సంఖ్య తగ్గకుండా చూడడం కోసమే ప్రస్తుతం లాక్‌డౌన్ సమయానికి లోబడి సెంటర్లు నడుపుతున్నాం. అంగన్‌ వాడీలకు రక్షణ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. పెండింగ్ బిల్లుల విషయం పరిశీలన చేసి అందరికీ చెల్లిస్తాం'' అని అన్నారామె.

విధానం ప్రకారమే నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల విషయంలో విధానం మేరకు తాము నిర్ణయాలు అమలు చేస్తున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కృతిక శుక్లా అన్నారు.

''అందరికీ రక్షణ కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెలవుల విషయంలో శాఖ పరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరణించిన వారికి బెనిఫిట్స్ విషయంలో కూడా ప్రభుత్వ పరిధిలోని అంశం'' అని ఆమె బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Anganwadis-Asha workers: Even masks are not given to do duty
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X