గాలి జనార్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్: అనర్హుడు
Gali Janardhan Reddy: కర్ణాటకకు చెందిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష శాసన సభ్యుడు, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. ఓబుళాపురం మైనింగ్ అక్రమ తవ్వకాల వ్యవహారంలో ఏడు సంవత్సరాల కారాగార శిక్ష పడిన ఆయనపై కర్ణాటక అసెంబ్లీ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అనర్హత వేటు వేసింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఓబుళాపురం గనుల్లో అక్రమ తవ్వకాల వ్యవహారంలో హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గాలి జనార్ధన్ రెడ్డికి ఏడు సంవత్సరాల కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇదే కేసును ఎదుర్కొన్న తెలంగాణకు చెందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీకి చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మీని నిర్దోషులుగా తేల్చింది. వారిపై సీబీఐ నమోదు చేసిన కేసులను కోర్టు కొట్టివేసింది.

ఇదే కేసులో గాలి జనార్ధన్ రెడ్డి దోషిగా తేలారు. ఆయనకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది సీబీఐ స్పెషల్ కోర్టు. అదే ఇప్పుడు ఆయనకు రాజకీయంగా కూడా చిక్కులను తెచ్చిపెట్టింది. క్రియాశీలక రాజకీయాలకు శాశ్వతంగా దూరం అయ్యేలా చేసినట్టయింది. కర్ణాటక అసెంబ్లీ ఆయనపై అనర్హత వేటు వేసింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఎంకే విశాలాక్షి నోటిఫికేషన్ జారీ చేశారు.
ప్రస్తుతం గాలి జనార్ధన్ రెడ్డి.. కొప్పళ జిల్లాలోని గంగావతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష తరఫున పోటీ చేశారు. దాదాపు 8,000 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన ఇక్బాల్ అన్సారీని ఓడించారు.
2022లో కేఆర్పీపీ పార్టీని స్థాపించారు గాలి. ఆ తరువాత దీన్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. మైనింగ్ కుంభకోణంలో జైలు శిక్ష అనుభవించడానికి ముందు ఆయన యడియూరప్ప ప్రభుత్వంలో కర్ణాటక పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. 2015 నుండి బెయిల్‌పై ఉన్న ఆయన బీజేపీకి దూరంగా ఉంటూ వచ్చారు. సొంత పార్టీని నెలకొల్పారు.
గంగావతి నియోజకవర్గ ఎమ్మెల్యే జి. జనార్ధన రెడ్డిని దోషిగా నిర్ధారించిన తర్వాత ఆయన రాష్ట్ర శాసనసభ నుండి అనర్హుడిగా ప్రకటించారు. అనర్హత ఈ నెల 6వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది.
అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డిని సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో- రాజ్యాంగంలోని ఆర్టికల్ 191 (1) (ఈ), 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ఆధారంగా ఆయనపై ఆరు సంవత్సరాల పాటు అనర్హత వేటు వేసినట్లు నోటిఫికేషన్ పేర్కొంది. ఫలితంగా- గంగావతి అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది.












Click it and Unblock the Notifications