ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కారు బాంబు కేసులో ట్విస్ట్.. బుకీ అరెస్ట్: ముంబై ఇండియన్స్ బ్యాగ్
ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ బంగళా.. అంటాలియా వద్ద పేలుడు వస్తువులను నింపిన కారును పార్క్ చేసి ఉంచిన ఘటనలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు సాగుతున్న కొద్దీ షాకింగ్ ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే అరెస్టు తరువాత వరుస వికెట్లు పడుతున్నాయి. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఓ కానిస్టేబుల్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే సస్పెండ్ చేసింది.
తాజాగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఓ బుకీ కూడా అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. పెద్ద ఎత్తున జిలెటిన్ స్టిక్స్‌ను నింపి, అంటాలియా వద్ద పార్క్ చేసి ఉంచిన స్కార్పియో యజమాని మన్‌సుఖ్ హిరేన్ డెత్ కేసు విచారణలో భాగంగా వారిద్దరూ అరెస్ట్ అయ్యారు. ఈ డెత్ కేసు విచారణనను ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు శనివారమే జాతీయ దర్యాప్తు సంస్థకు బదలయించారు.

కేసు దర్యాప్తును మొదలు పెట్టిన ఎన్ఐఏ అధికారులు మరుసటి రోజే సస్పెండైన కానిస్టేబుల్ వినాయక్ షిండేతో పాటు బుకీ నరేష్ ధరేను అరెస్ట్ చేశారు. ఇదివరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న స్కార్పియోలో ముంబై ఇండియన్స్ లోగోను ముద్రించిన బ్యాగ్ లభించిన విషయం తెలిసిందే. తాజాగా- బుకీ అరెస్ట్ కావడానికి.. ఈ బ్యాగ్ లభించడానికి ఏదైనా సంబంధం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. స్కార్పియో యజమాని, ఆటోమొబైల్ విడి భాగాల డీలర్ మన్‌సుఖ్ డెత్ కేసు దర్యాప్తు వ్యవహారంలో ఈ లింక్ ప్రధాన పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.
మన్‌సుఖ్ శరీరంలపై ఎలాంటి గాయాలు లేవనే విషయం అటాప్సీలో తేలింది. చోరీకి గురైన తన కారును జిలెటిన్ స్టిక్స్ నింపడానికి వినియోగించారని, దాన్ని అడ్డుగా పెట్టుకుని మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ మన్‌సుఖ్ రాసినట్టుగా అనుమానిస్తోన్న లేఖ ఈ దర్యాప్తులో కీలకంగా మారింది. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ బదిలీ అయ్యారు.












Click it and Unblock the Notifications