అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనుపమ-అజిత్: ఆంధ్రప్రదేశ్‌కు దత్తతగా వచ్చిన చిన్నారిని తిరిగి కేరళ ఎందుకు తీసుకెళ్లారు? అసలేంటీ వివాదం?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అనుపమ ఎస్.చంద్రన్

కన్నబిడ్డ కోసం ఏడాది కాలంగా ఓ జంట పడిన వేదనకు బుధవారం నాడు కోర్టు తీర్పుతో ముగింపు దొరికింది. డీఎన్‌ఏ టెస్టు అనంతరం చిన్నారిని కోర్టు తల్లిదండ్రులకు అప్పగించింది.

కేరళలో రాజకీయంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంపై బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్, అష్రఫ్ పదన్నతో కలిసి పూర్తి వివరాలు సేకరించారు.

కనిపించకుండా పోయిన తమ బిడ్డను అప్పగించాలని డిమాండ్ చేస్తూ కేరళకు చెందిన ఓ జంట, ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని ఒక దత్తత సంస్థ ముందు రెండు వారాలుగా నిరసన ప్రదర్శన నిర్వహించింది.

వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా వారు ఆ సంస్థ ముందు టెంట్ వేసుకుని దీక్షను కొనసాగించారు. రాత్రిపూట వారిద్దరూ అక్కడే ఉన్న ఒక మినీ వ్యాన్‌లో నిద్రించే వారు.

''నా బిడ్డను నాకివ్వండి'' అన్న ప్లకార్డుతో నిరసనకు దిగిన ఆ యువతి, తన అనుమతి లేకుండా తన తల్లిదండ్రులు బిడ్డను దత్తతకు ఇచ్చారని ఆరోపించారు. అయితే, దీనిని యువతి తండ్రి ఖండించారు.

అనుపమా ఎస్.చంద్రన్ గత ఏడాది అక్టోబర్ 19న మగబిడ్డకు జన్మనిచ్చారు. 22 ఏళ్ల ఈ వామపక్ష పార్టీ కార్యకర్త ఓ ఆసుపత్రిలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న 34 ఏళ్ల అజిత్ కుమార్ అనే వ్యక్తితో సహజీవనం ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు.

అయితే, అజిత్ కుమార్‌కు అప్పటికే ఒకసారి పెళ్లయింది. కానీ, అనుపమ అజిత్‌తో వివాహేతర సంబంధం ద్వారా బిడ్డను కనడాన్ని కుటుంబంతో పాటు చాలామంది వ్యతిరేకించారు.

వివాహేతర సంబంధం ద్వారా పిల్లలను కనడం గౌరవప్రదం కాదనే ఆలోచనతో ఈ వ్యవహారం ఆమె కుటుంబంలో చిచ్చు రాజేసింది.

అజిత్ దళిత కులానికి చెందినవారు కాగా, అనుపమ అగ్రకులానికి చెందిన యువతి కావడంతో . వివాదం పెరిగిపోయింది.

కుటుంబాల నేపథ్యం

అనుపమ, అజిత్ ఇద్దరూ సాధారణ మధ్యతరగతి, ప్రగతిశీల భావాలున్న కుటుంబాల నుంచి వచ్చారు. ఈ రెండు కుటుంబాలు రాష్ట్రంలో అధికార పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)కి గట్టి మద్దతుదారులు.

అనుపమ తండ్రి బ్యాంక్ మేనేజర్. ఆయన కమ్యూనిస్టు పార్టీ నేత కూడా. ఆమె కుటుంబ సభ్యులు చాలా ఏళ్లుగా ట్రేడ్ యూనియన్ల తోపాటు మున్సిపల్ కౌన్సిలర్లుగా బాధ్యతలు నిర్వహించారు.

ఫిజిక్స్ గ్రాడ్యుయేట్ అయిన అనుపమ, తన కాలేజీలో కమ్యూనిస్ట్ పార్టీ విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ. అజిత్ సీపీఎం యువజన విభాగానికి నాయకుడు.

అనుపమ, అజిత్‌లిద్దరూ ఒకే ప్రాంతంలో నివసించారు. లెఫ్ట్‌ పార్టీ కార్యక్రమాలలో కలుసుకున్నారు. మూడేళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారు. అప్పటికే తాను భార్య నుంచి విడిపోయానని, పిల్లలు లేరని అజిత్ వెల్లడించారు.

"ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనడండి, మరేదైనా అనుకోండి. స్నేహంతో మొదలై కలిసి జీవించాలనే దాకా వచ్చాం" అన్నారు అనుపమ.

గతేడాది అనుపమ గర్భవతి అయ్యారు. "బిడ్డను కనాలని మేం కోరుకున్నాం" అన్నారు అనుపమ.

నాటకీయ పరిణామాలు

డెలివరీకి నెలన్నర ముందు మాత్రమే తాను తల్లికాబోతున్న విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు షాక్‌కు గురయ్యారు.

గర్భవతి కాబట్టి, అందుకు అవసరమైన సౌకర్యాల కోసం ఆమెను ఇంటికి వచ్చేలా తల్లిదండ్రులు ఒప్పించారు. అయితే తర్వాత అజిత్‌ను కలవకుండా నిషేధం విధించారు.

అదే సమయంలో అనుపమ సోదరికి పెళ్లి కుదిరింది. మరో మూడు నెలల్లో వివాహం ఉంది. డెలివరీ తర్వాత అనుపమ డిశ్చార్జి అయ్యారు. ఆమెను తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చారు.

నీ చెల్లి పెళ్లయ్యే వరకు స్నేహితుల ఇంట్లో ఉండాలని, పెళ్లికి వచ్చినవారు ఈ బిడ్డ ఎవరని అడిగితే సమాధానం చెప్పుకోలేమని అనుపమతో అన్నారు తల్లిదండ్రులు.

తన తండ్రి బిడ్డను తీసుకుని కారులో వెళ్లిపోయారని అనుపమ చెప్పారు.

"పిల్లవాడిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్తున్నానని చెప్పారు, అక్కడ నువ్వు తర్వాత వాడిని కలుసుకోవచ్చు" అని తండ్రి చెప్పినట్లు అనుపమ వెల్లడించారు.

''ఈ మాటలతో తల్లినయ్యానన్న నా ఆనందం మాయమైంది" అన్నారామె.

తర్వాత కొన్ని నెలలపాటు ఆమెను బిడ్డ దగ్గరకు, ఇంటికీ తిప్పారు. ఆ తర్వాత బిడ్డను నగరానికి 200 కి.మీ. ల దూరంలో ఉన్న అనుపమ అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లారు.

అనుపమ తండ్రి జయచంద్రన్ కమ్యూనిస్టు పార్టీ నేత

బిడ్డ అదృశ్యం

ఈ ఏడాది ఫిబ్రవరిలో సోదరి వివాహానికి హాజరై ఇంటికి తిరిగి వచ్చిన అనుపమ, అజిత్‌కు ఫోన్ చేసి మన పిల్లాడు కనిపించడం లేదని చెప్పారు. బిడ్డను తన తల్లిదండ్రులు ఎవరికో దత్తత ఇచ్చారని ఆమె అజిత్‌కు చెప్పారు.

మార్చిలో అనుపమ తల్లిదండ్రుల ఇంటి నుంచి అజిత్ దగ్గరకు వచ్చారు. తమ బిడ్డ కోసం వెతకడం ప్రారంభించారు.

ఆసుపత్రి వారి రికార్డుల్లో తండ్రి పేరు అజిత్ అని కాక, వేరొకరి పేరు ఉంది.

తమ బిడ్డ కనిపించడం లేదన్న అనుపమ, అజిత్‌ల ఫిర్యాదును తీసుకునేందుకు పోలీసులు మొదట నిరాకరించారు. దానికి బదులుగా, తమ కూతురు కనిపించడం లేదంటూ అనుపమ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.

దత్తత కోసం అనుపమే స్వచ్ఛందంగా బిడ్డను ఇచ్చారని ఆమె తండ్రి చెప్పినట్లు పోలీసులు చెప్పారు. దీంతో వారిద్దరూ అధికార పార్టీకి, ముఖ్యమంత్రికి, దత్తత సంస్థకు, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు.

''అందరు తల్లిదండ్రులు చేసే పనినే, ఆమె తల్లిదండ్రులు కూడా చేశారు'' అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సాజీ చెరియన్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.

దీంతో తనను అవమానించారంటూ అనుపమ మంత్రి చెరియన్ పైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనుపమ, అజిత్‌లు తమకు ఎదురైన అనుభవాలను మీడియా సంస్థలకు వివరించడంతో రాజకీయ నాయకులు, అధికారులు అలర్టయ్యారు.

ఇది పరువు నేరానికి ఉదాహరణ అని ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీలో ఆరోపణలు చేశాయి. "ఇది రాష్ట్ర యంత్రాంగం సమిష్టిగా చేసిన నేరం" అని ప్రతిపక్షానికి చెందిన శాసన సభ్యురాలు కె.కె. రెమా ఆరోపించారు.

అయితే, అనుపమ తండ్రి జయచంద్రన్ తన చర్యలను సమర్థించుకున్నారు. " మన ఇంట్లో ఇలాంటివి జరిగినప్పుడు ఎలా వ్యవహరిస్తాం? అనుపమ కోరుకున్న చోటే పాపను వదిలేశా. బిడ్డను సంరక్షించే శక్తి ఆమెకు లేదు. మాకు కూడా లేదు" అని జయచంద్రన్ ఓ న్యూస్ ఛానల్‌తో అన్నారు.

"తన భర్తకు మరో భార్య ఉందని నా కూతురు చెప్పింది. అలాంటి వ్యక్తి వద్ద నా కూతుర్ని ఎలా వదిలేయగలను? డెలివరీ తర్వాత అనుపమకు ఆరోగ్యం బాగా లేదు. ఆమెను బిడ్డను సంరక్షించ లేదు. అందుకే దత్తత ఇచ్చే ఏజెన్సీకి అప్పగించాను" అని జయచంద్రన్ అన్నారు.

చట్ట విరుద్ధంగా పుట్టిన బిడ్డను తన ఇంట్లో ఎలా ఉంచుకోగలనని జయచంద్రన్ ప్రశ్నించారు. పార్టీతోపాటు, న్యాయవాది సలహా తీసుకున్న తర్వాతే శిశువును దత్తత ఏజెన్సీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు.

మీ కూతురికి మీరేమైనా చెప్పదలుచుకున్నారా అని యాంకర్ అడిగినప్పుడు, "నేను ఆమె నుండి ఏమీ వినాలనుకోవడం లేదు'' అన్నారు జయచంద్రన్

అనుపమ తల్లిదండ్రులు, సోదరి, మరిది సహా ఆరుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరు దురుద్దేశ పూర్వకంగా నిర్బంధం, కిడ్నాప్, ఫోర్జరీ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అయితే, వీరు ఈ ఆరోపణలను ఖండించారు.

ఏజెన్సీ ఈ చిన్నారిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ పిల్లలు లేని జంటకు ఆగస్టులో దత్తత ఇచ్చింది. కోర్టు జోక్యంతో దత్తత ఏజెన్సీ చిన్నారిని తిరిగి తిరువనంతపురం తీసుకువచ్చింది. శిశువుకు డీఎన్ఏ టెస్టు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.

తమ డీఎన్‌ఏ, పాప డీఎన్‌ఏతో సరిపోలిందని మంగళవారం నాడు అనుపమ, అజిత్‌లు వెల్లడించారు. చివరకు వారు తమ చిన్నారిని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించే హోమ్‌లో చూడగలిగారు.

బుధవారంనాడు డీఎన్‌ఏ ఆధారాలను పరిశీలించిన కోర్టు శిశువును తల్లిదండ్రులకు అప్పగించింది.

గత ఏడాది కాలంగా తాము ఎంతో మనోవ్యథను అనుభవించామని అనుపమ అన్నారు. "నేను ఎవరితో కలిసి జీవించాలో, బిడ్డను కనాలో నిర్ణయించుకునే హక్కు నాకు లేదా?" అని ఆమె ప్రశ్నించారు.

తమ బిడ్డ అక్రమ రవాణాకు పాల్పడిన వారిని శిక్షించే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని అనుపమ, అజిత్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Anupama-Ajith: Why was the adopted child taken back to Kerala from Andhra Pradesh?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X