ఎపి, తమిళనాడు మధ్య ఎన్‌కౌంటర్ చిచ్చు: ఎపి బస్సులు ధ్వంసం
చెన్నై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమైన నేపథ్యంలో తమిళనాడు భగ్గుమంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. శేషాచలం ఎన్‌కౌంటర్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదంగా మారింది. తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు ఎపి ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగాయి.
తమిళనాడు రాజధాని చెన్నైలో గల ఆంధ్రా క్లబ్ ఎదుట తమిళనాడు కాంగ్రెసు, ఇతర పక్షాల నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చెన్నై బస్టాండు వద్ద ఆందోళనకారులు నిరసకు దిగారు. తమిళనాడు నుంచి వచ్చే ఎపి బస్సులను నిలిపేశారు. ఆంధ్రకు చెందిన ఐదు బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు.
పొట్టకూటికోసం కూలీ పని చేసుకునే వారిని కాల్చివేస్తారా? అంటూ చెన్నెలో నిరసనలు మిన్నంటాయి. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని తమిళర్ కచ్చి అనే సంస్థ హెచ్చరించింది. చెన్నైలోని ఆంధ్రా ఆస్తులు, బ్యాంకులు, వ్యాపార సంస్థలు హోటళ్లపై దాడి చేస్తామని ప్రకటించింది. దీంతో చెన్నై పోలీసులు అప్రమత్తయ్యారు. ఆంధ్రా సంస్థలు, ఆస్తుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా, ఎర్రచందనం స్మగ్లర్లు లొంగిపోకుండా టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై దాడికి ప్రయత్నించినందునే కాల్పులు జరిగాయని ఏపీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టాస్క్‌ఫోర్ప్ సిబ్బంది కనిపించగానే స్మగ్లర్లు పెద్ద ఎత్తున వచ్చి పోలీసులపై రాళ్లు విసిరారని, ఈ ఘటనలో కొంత మంది పోలీసులు గాయపడ్డారని ఆయన అన్నారు.
అయినా పోలీసులు సయంమనం పాటించి లొంగిపోవాల్సిందిగా స్మగ్లర్లను విజ్ఞప్తి చేసినా వారు వెనక్కి తగ్గలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని హోంమంత్రి తెలిపారు. చెన్నై కోయంబేడు వద్ద 9 బస్సులపై ఆందోళకారులు దాడి చేసి, వాటిని ధ్వంసం చేశారు. నెల్లూరు నుంచి చెన్నైకి బస్సులను నిలిపేశారు. ఎపి బస్సులపై పెట్రోల్ బాంబులు విసిరారు. అదృష్టవశాత్తు అవి పేలలేదు. ఎపి, తమిళనాడు సరిహద్దులో మరో బస్సును ధ్వంసం చేశారు.
కాల్పులు జరపడంతో చాలా మంది స్మగ్లర్‌లు పారిపోయారని ఆయన చెప్పారు. ఈతగుంటలో 9 మంది, చీకటి తీగలకోనలో 11 మంది స్మగ్లర్లు హతమయ్యారని మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications