చంద్రబాబు చొరవతో గుంటూరుకు గుడ్‌న్యూస్ చెప్పిన నరేంద్రమోడీ
దేశమంతా ప్రస్తుతం ఎలక్ట్రిక్ మయం అవుతోంది. ఏ వస్తువు తీసుకున్నా, ఏది పట్టుకున్నా, ఒకవేళ ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా.. అంతా ఎలక్ట్రిక్ మయం అయిపోయింది. కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు రవాణా వ్యయాన్ని కూడా తగ్గిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. దేశమంతటా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 'పీఎం ఈ-బస్ సేవ' పథకాన్ని ప్రారంభించింది. దీనికింద ఆయా రాష్ట్రాలకు విద్యుత్తు బస్సులను అందజేస్తారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తొలివిడతగా రాష్ట్రానికి 100 బస్సులను తెప్పిస్తున్నారు.
రాజధాని అమరావతికి సమీపంలో గుంటూరు, విజయవాడ నగరాలున్నాయి. ప్రస్తుతం గుంటూరు నగరానికి విద్యుత్తు బస్సుల అవసరాన్ని గుర్తించిన చంద్రబాబు వచ్చే 100 బస్సులను గుంటూరు ఆర్టీసీకి కేటాయించనున్నారు. ఇందులో 20 బస్సులు అల్ట్రా డీలక్స్ సర్వీసులుగా నడుస్తాయి. మిగతా బస్సులన్ని పల్లెవెలుగు బస్సులకింద తిప్పుతారు. గుంటూరు నుంచి విజయవాడకు 20, గుంటూరు నుంచి పొన్నూరుకు 15, గుంటూరు నుంచి తెనాలికి 30, గుంటూరు నుంచి హైకోర్టుకు 5, గుంటూరు నుంచి సచివాలయానికి 5, గుంటూరు నుంచి చిలకలూరిపేటకు 10, గుంటూరు నుంచి సత్తెనపల్లికి 15 బస్సులు నడుపుతారు.

ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు
వీటిని ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు నడుస్తాయి. ప్రస్తుతానికి 100 కిలోమీటర్ల లోపు దూరం ఉన్న ప్రాంతాలకే వీటిని ఉపయోగిస్తారు. వీటికి ఛార్జింగ్ స్టేషన్ ను పెదకాకాని బస్టాండ్ వెనక ఆర్టీసీకి ఉన్న 3.5 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి వస్తే పల్నాడు బస్టాండ్ లో కూడా ఏర్పాటు చేస్తారు. గుంటూరులో ప్రధానంగా కాలుష్యం ఎక్కువవుతుండటంతో దీన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించిన ఎక్స్ ప్రెస్ బస్సులను పల్లెవెలుగు బస్సుల్లా మార్చి తిప్పుతున్నారు. అయితే వీటి నిర్వహణ వ్యయం బాగా పెరుగుతుండటంతో విద్యుత్తు బస్సులవైపు ప్రభుత్వం మొగ్గుచూపింది. త్వరలోనే ఈ బస్సులు రాష్ట్రానికి రానున్నాయి.












Click it and Unblock the Notifications