వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్: పంచాయతీ నిధులను దారి మళ్లించారా, సర్పంచుల ఆందోళన ఎందుకు, ప్రభుత్వ వాదన ఏంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నిరసన వ్యక్తం చేస్తున్న సర్పంచులు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ సర్పంచులు ఆందోళనకు దిగుతున్నారు. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. అసలే నిధులు లేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్న తరుణంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఏపీ ప్రభుత్వం విద్యుత్ బకాయిలకు జమ వేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలున్నాయని ప్రతిపక్షం విమర్శిస్తోంది. గత ప్రభుత్వ హయం నుంచి పేరుకుపోయిన పంచాయతీల విద్యుత్ బకాయిలకు వడ్డీల భారం తప్పించేందుకే ఈ ప్రయత్నమని ప్రభుత్వం అంటోంది.

ఆర్థిక కష్టాల్లో పంచాయతీలు

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కుమారపురం ఓ మైనర్ పంచాయతీ. సుమారు 3వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో ఓటర్ల సంఖ్య 2వేల వరకు ఉంటుంది. ఏటా పంచాయతీకి ఆదాయం రూ.9 లక్షల దాకా వస్తుంది.

కొత్త పాలకవర్గం ఎన్నికైన తర్వాత గ్రామంలో డ్రెయిన్ల నిర్మాణం కోసం రూ. 8లక్షలు ఖర్చు చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయని వారు ఆశగా ఉన్నారు. కానీ, అవి రాగానే రాష్ట్ర ప్రభుత్వం రూ. 11 లక్షలను విద్యుత్ బకాయిలుగా జమ చేసుకుంది. 15వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో కూడా తమకు అవకాశం ఇవ్వలేదని సర్పంచ్ ఎన్. రామారావు తెలిపారు.

''14వ ఆర్థిక సంఘం నిధులు రాగానే పాత బకాయిలకు జమ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ నిధులు వచ్చాయి. కానీ మాకు తీసుకునే అవకాశం ఇవ్వడం లేదు. పనులు చేసిన వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. ఇన్నాళ్లు నిధులు రాలేదని బాధపడ్డాం. వచ్చిన నిధులను పాత బకాయిలని తీసేసుకుంటే 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ఎదురుచూశాం. ఇప్పుడు అవి వచ్చినా మాకు అవకాశం ఇవ్వలేదు’’ అని రామారావు బీబీసీకి వివరించారు.

ఇది ఈ ఒక్క పంచాయతీ సమస్య మాత్రమే కాదు. రాష్ట్రంలో 13,369 గ్రామ పంచాయతీలుండగా అందులో మేజర్ పంచాయతీల కన్నా మైనర్ పంచాయతీలే ఎక్కువ. దాదాపుగా అన్ని మైనర్ పంచాయతీల్లో ఇలాంటి సమస్యలున్నాయి. నిధుల లేమితో సతమతమవుతున్నాయి.

ఇటీవల జనరల్ ఫండ్స్‌తో పాటుగా 14,15వ ఆర్థిక సంఘం నిధులు కూడా తమకు చేరడం లేదని ఆయా పంచాయతీ పాలక వర్గాలు వాపోతున్నాయి.

పంచాయతీలకు నిధులు ఎలా వస్తాయి?

పంచాయతీలకు సొంత నిధులు చాలా స్వల్పంగా ఉంటాయి. గ్రామంలో వసూలు చేసే ఆస్తిపన్ను, కుళాయిపన్ను, షాపుల అద్దె రూపంలో వచ్చే ఆదాయంతో పాటుగా చెరువులు, ఇతర ఆదాయ వనరుల నుంచి లభించే మొత్తం స్వల్పంగానే ఉంటుంది. సగటున 70 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల మీదే పంచాయతీల పాలన సాగుతుంది.

కొన్ని మేజర్ పంచాయతీలు మినహా మైనర్ పంచాయతీలయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల మీదనే ఆధారపడతాయి. అందులో తలసరి గ్రాంటు, వృత్తిపన్ను, సీనరేజి నిధులు, గ్రామంలో జరిగే ఆస్తుల క్రయ విక్రయాలపై రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా లభించే ఆదాయంలో వాటా వంటివి పంచాయతీలకు దక్కుతాయి.

ప్రస్తుతం తలసరి ఏడాదికి రూ.4 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు గ్రాంటుగా ఇస్తోంది. అంటే 3వేల జనాభా ఉన్న గ్రామానికి ఏడాదికి దాదాపు రూ. 12వేలు గ్రాంటు వస్తుంది.

ఇక సీనరేజి సహా వివిధ వాటాల బదలాయింపులో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉండడం చాలా కాలంగా వస్తోంది. దాంతో పంచాయతీలు ఉపాధి హామీ నిధులతో సిమెంట్ రోడ్లు వేయించుకోవడం, నీరు-మట్టి వంటి పథకాల్లో భాగంగా చెరువులు తవ్వించడం వంటి పనులకే పరిమితమయ్యాయి. సొంత నిధులు సరిపోకపోవడంతో ఆర్థిక సంఘాల పేరుతో వచ్చే నిధుల కోసం ఎదురుచూస్తూ ఉంటాయి.

పంచాయతీ నిధుల్లో పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రెయిన్ల నిర్వహణకు 40 శాతం వరకూ ఖర్చవుతాయి. సిబ్బంది వేతనాలకు మరో 30 శాతం ఖర్చయిపోతాయి. వీధి దీపాలు, తాగునీటి అవసరాలకు 30 శాతం వరకూ వెచ్చించాల్సి ఉంటుంది. దాంతో అభివృద్ధి పనులకు ఆస్కారం కలగడం లేదన్నది పంచాయతీ పాలకవర్గాల అభిప్రాయం.

నిధులు లేకుండా పాలన ఎలా అంటూ రాజీనామాలు

పంచాయతీలకు రెండు విడతలుగా వచ్చిన నిధులను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విద్యుత్ బకాయిల కింద జమ చేసింది. నిబంధనల ప్రకారం ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల ఖాతాలకు మళ్లించి, అక్కడి నుంచి విద్యుత్ సంస్థలకు జమ చేసింది. దాంతో అనేక చోట్ల పంచాయతీ అకౌంట్లు ఖాళీ అయిపోయాయి.

గ్రామపంచాయతీ నిధుల్ని విద్యుత్ బకాయిలకు జమ వేసుకున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి శాసనమండలిలోనే స్పష్టం చేశారు.

దాంతో ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు చోట్ల సర్పంచులు ఆందోళనకు పూనుకున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప లోని ఖాజీపేట మండలంలో పలువురు సర్పంచులు తాము రాజీనామా చేస్తున్నట్టు తొలుత ప్రకటించి, ఆ తర్వాత వెనక్కి తగ్గారు.

రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ సర్పంచుల సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పంచాయతీల నుంచి విద్యుత్ శాఖకు మళ్లించిన నిధులను తిరిగి తమకే ఇవ్వాలని సర్పంచులు డిమాండ్ చేశారు.

అసలే నిధుల కొరత, వచ్చినవి బకాయిలకు జమ వేస్తే ఇంకెలా?

''పంచాయతీల పరిస్థితి అసలే అంతంతమాత్రంగా ఉంది. కోవిడ్ పేరుతో ఎంపీల్యాడ్స్ ఆగిపోయాయి. ఏపీలో ఎమ్మెల్యేలకు కూడా నిధులు రావడం లేదు. దాంతో పంచాయతీల్లో అభివృద్ధి పనులకు కేటాయింపులు కనిపించడం లేదు. పంచాయతీల నిధులు రెగ్యులర్ మెయింటెన్స్ కే సరిపోతున్నాయి. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశలో నిధుల కేటాయింపు ఉండాలి. కానీ దానికి భిన్నంగా కేటాయించే నిధులను పక్కదారి పట్టిస్తే స్థానిక సంస్థలు ఏం కావాలి?’’ అని సర్పంచుల సమాఖ్య నాయకుడిగా పని చేసిన పలివెల వీరబాబు ప్రశ్నించారు.

ఏపీ ప్రభుత్వం పంచాయతీల నిధులను విద్యుత్ బకాయిల కింద జమ చేసుకుంటున్న తీరు సరికాదని, దాని వల్ల స్థానిక పరిపాలన కుంటుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

'రాజ్యాంగ విరుద్ధమైన చర్య’

ఇప్పటికే అప్పులమయంగా రాష్ట్రాన్ని మార్చేసిన ప్రభుత్వం, ఇప్పుడు నిధుల మళ్లింపు మీద కన్నేసిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు.

''పంచాయ‌తీల నుంచి రెండున్న‌రేళ్ల పాల‌న‌లో రూ.1309 కోట్ల‌కు పైగా నిధులు మ‌ళ్లించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయాయి. స‌ర్పంచ్‌, వార్డుస‌భ్యుల‌కు తెలియ‌కుండా, పంచాయ‌తీ బోర్డు తీర్మానంలేకుండా...పంచాయ‌తీ ఖాతాల నుంచి నిధులు మళ్లించడం స్థానిక‌సంస్థ‌ల ప్ర‌తినిధుల‌ని ప్ర‌భుత్వం మోసం చేయ‌డం కింద‌కే వ‌స్తుంది’’ అని లోకేశ్ విమర్శించారు.

'మైనర్ పంచాయతీలకు ఉచిత విద్యుత్ కొనసాగించాలి’

నిధులు లేని కారణంగా పంచాయతీల్లో సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోతున్నారని ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వైబీ రాజేంద్ర ప్రసాద్ అంటున్నారు.

''కేంద్ర ఇంధన శాఖ నుంచి రూ.3,300 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం ఇంత దుస్సాహాసానికి పాల్పడింది. సర్పంచులకు చెందాల్సిన నిధులను దారి మళ్లించింది. దీనిపై త్వరలోనే దిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం. దారి మళ్ళించిన నిధులను తిరిగి ఇచ్చివెయ్యాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని ఎంపీడీఓ ఆఫీసుల ముందు సర్పంచులు ధర్నాలు చెయ్యాలని నిర్ణయించాం’’ అని ఆయన తెలిపారు.

మైనర్ పంచాయతీలకు వీధి దీపాల కోసం ఉచిత విద్యుత్ కొనసాగించాలని రాజేంద్ర ప్రసాద్ కోరారు.

పాత బకాయిలే పేరుకుపోయాయి

14వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధుల నుండి మళ్లించిన రూ.344 కోట్లు, 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధుల నుండి మళ్లించిన రూ.965 కోట్లు త‌క్ష‌ణ‌మే పంచాయ‌తీల ఖాతాల్లో జ‌మ‌చేయాలని సర్పంచులు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ప్రభుత్వం మాత్రం పంచాయతీల పెండింగ్ విద్యుత్ బిల్లులు పేరుకుపోతుండడం వల్లనే ఈ సమస్య అని చెబుతోంది. చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదేళ్లలో ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించిన విషయాన్ని మరచిపోయి, ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్ జి.శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు.

''2014 నుంచి అయిదేళ్లలో కేంద్ర 14వ ఆర్థిక సంఘం రూ.6,667 కోట్లను ఏపీకి కేటాయించింది. కానీ 2019 మే నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల విద్యుత్‌ బిల్లుల బకాయిలు రూ.3,481 కోట్లుగా ఉన్నాయి. విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో పంపిణీ సంస్థలు వడ్డీలు వేస్తున్నాయి. ఇది భారంగా మారుతోంది. వాటిని నియంత్రించాలని నిర్ణయించాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్‌ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తోంది. గత సర్కారు పెట్టిన బకాయిల్లో ఇప్పటి వరకు రూ.518 కోట్లు జగన్ ప్రభుత్వం చెల్లించింది. అప్పటి బకాయిలకు వడ్డీలు కూడా కట్టాం. బకాయిలు రూ.2,963 కోట్లకు తగ్గాయి. బకాయిల వివరాలను విద్యుత్‌ సంస్థలు ప్రతి నెలా పంచాయతీలకు పంపుతూనే ఉంటాయి. కొన్ని చోట్ల వీటిని గ్రామ పంచాయతీల నిధుల నుంచి విద్యుత్‌ సంస్థలు జమ చేసుకుంటున్నాయి’’ అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

ప్రభుత్వం పంచాయతీల నిధులను మళ్లిస్తోందంటూ టీడీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవం అంటూ ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్

ఇక నుంచి నేరుగా నిధులు

''పంచాయతీల ఆర్థిక వ్యవహారాలను కూడా ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్‌తో జత చేశారు. దాని వల్ల ఇతర బకాయిలు ఎక్కువగా ఉన్న సమయంలో వాటిని సర్థుబాటు చేసే పరిస్థితి వస్తోంది. విద్యుత్ బకాయిలు మాత్రం పంచాయతీలే పంపిణీ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ సొంతంగా బ్యాంకు అకౌంట్ మూలంగా ఇకపై నేరుగా ఆర్థిక సంఘం నిధులు కూడా ఆయా అకౌంట్లకు చేరతాయి. అందుకు అనుగుణంగా పంచాయతీలకు ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్లు తెరవాలని ఆదేశించాము’’ అని ఏపీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు.

ఏపీలో పంచాయతీలకు నిధుల కొరత తీవ్రంగా ఉందన్నది వాస్తవం. నేరుగా నిధులు పంచాయతీలకు అందిస్తామని పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నా దాని వల్ల పూర్తి ఫలితాలు వస్తాయనే అభిప్రాయం పంచాయతీ పాలకవర్గాల్లో కనిపించడం లేదు.

ఏపీ ప్రభుత్వానికి కూడా ఆర్థిక సమస్యలు ఎక్కువగానే ఉన్నప్పటికీ పంచాయతీల పెండింగ్ విద్యుత్ బిల్లుల విషయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని విపక్షాలు కోరుతున్నాయి. మైనర్ పంచాయతీలకు ఉచిత విద్యుత్ కొనసాగించాలని అడుగుతున్నాయి. దానికి భిన్నంగా ప్రభుత్వం మాత్రం బకాయిలను పంచాయతీలే చెల్లించాలని చెబుతుండడంతో ఈ సమస్య మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తోంది.

ఫలితంగా స్థానిక సంస్థల నిర్వహణ మరింత భారంగా మారబోతోంది. పంచాయతీల్లో అభివృద్ధి పూర్తిగా పడకేసేలా కనిపిస్తోంది. చిన్న చిన్న పనులకి కూడా సర్పంచులు చేతులెత్తేసే స్థితి రానుంది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాల అభివృద్ధి మీద ప్రభావం పడొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
AP: Has the panchayat funds been diverted, why are the Sarpanches worried, what is the government's argument
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X