ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇక సుప్రీం జడ్జి- సీజేఐగా విశ్వనాథన్‌కు ఛాన్స్
న్యూఢిల్లీ: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.. కొద్దిసేపటి కిందటే దేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు సీనియర్ అడ్వొకేట్ కేవీ విశ్వనాథన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. వారితో ప్రమాణం చేయించారు.
సుప్రీంకోర్టులో పని చేయాల్సిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34. ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ ఎం ఆర్ షా.. ఇటీవలే పదవీ విరమణ చేశారు. దీనితో ఈ సంఖ్య 32కు పడిపోయింది. వారిద్దరి ఖాళీలను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, కేవీ విశ్వనాథన్‌తో భర్తీ చేసింది సుప్రీంకోర్టు.

జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బదిలీ చేస్తూ, సీనియర్ అడ్వొకేట్ కేవీ విశ్వనాథన్‌ను న్యాయమూర్తిగా ఎలివేట్ చేస్తూ ఇటీవలే సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 16వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులను పంపించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ సారథ్యంలో జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన కొలీజియం పంపించిన ఈ సిఫారసులను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ యధాతథంగా ఆమోదించింది.
దీనితో ఇవ్వాళ వారిద్దరూ న్యాయమూర్తులగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సొంత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్. 2021 అక్టోబర్ 13వ తేదీన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. కాగా- నేరుగా అడ్వొకేట్ స్థాయి నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కేవీ విశ్వనాథన్ పదో వ్యక్తి.

ఆయనకంటే ముందు జస్టిస్ ఎస్ ఎం సిక్రీ, జస్టిస్ ఎస్‌సీ రాయ్, జస్టిస్ కుల్‌దీప్ సింగ్, జస్టిస్ సంతోష్ హెగ్డే, జస్టిస్ రోహింటన్ నారిమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ ఇందు మల్హోత్ర, జస్టిస్ పీఎస్ నరసింహ.. ఉన్నారు. వారిలో ఎస్ఎం సిక్రీ, యూయూ లలిత్.. సీజేఐగా పని చేశారు. జస్టిస్ పీఎస్ నరసింహ కూడా సీజేఐ స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. ఇదే జాబితాలో కేవీ విశ్వనాథన్ చేరారు. సీనియారిటీ ప్రకారం.. విశ్వనాథన్ కూడా సీజేఐగా పదవీ విరమణ చేస్తారు.












Click it and Unblock the Notifications