తమిళనాడును వెంటాడుతున్న వానదేవుడు, మోదీ దగ్గరకు పరుగు తీసిన సీఎం !
తమిళనాడులోని దక్షిణ ప్రాంతంలో కనీవినీ ఎరుగనిరీతిలో వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి, తిరునల్వేలి, తేన్‌కాశి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తుపాను దెబ్బకు తమిళనాడులో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.
తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో ఇళ్లు, రోడ్లు, వరి పంటలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. తూత్తుకుడి, తిరునెల్వేలి, తేన్ కాశి, కన్యాకుమారి ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు పూర్తిగా జలమయమయ్యాయి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

వర్షాల కారణంగా విద్యుత్ స్థంభాలు, మొబైల్ టవర్లు కుప్పకూలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలియిపోయాయి. పలు ప్రాంతాల్లోని రోడ్లు జలమయమై ప్రజా రవాణా కూడా నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. వరుణుడి బీభత్సానికి నాలుగు జిల్లాల్లో పెద్ద ఎత్తున వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. భారీ వరద ధాటికి వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి.
భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు తమిళ మీడియా తెలిపింది. అయితే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత మందిచనిపోయారు అని అధికారికంగా ప్రకటించలేదు. ఇండియన్ ఆర్మీ, కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లను ఉపయోగించి ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ నుండి అదనపు సహాయాన్ని అభ్యర్థించింది.
గర్భిణులు, చిన్నారులు సహా వందలాది మందిని భారత సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. తమిళనాడులో వరదలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇప్పటికే ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీని, ఇతర శాఖల మంత్రులను కలవనున్నారు.

తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి మంగళవారం రాజ్‌భవన్‌లో రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వ అధికారుల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజలను రక్షించే చర్యల గురించి చర్చించారు. సోమవారం వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 1,039 మంది చిన్నారులు సహా 7,434 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పొట్లాలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.












Click it and Unblock the Notifications