అసమ్మతి: ఉత్తరాఖండ్ కాంగ్రెస్‌లో మంటలు
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశించి భంగపడిన ఆశావాహుల అసంతృప్తి, వారి మద్దతుదారుల ఆవేశంతో పార్టీ కార్యాలయం ధ్వంసమైంది.
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశించి భంగపడిన ఆశావాహుల అసంతృప్తి, వారి మద్దతుదారుల ఆవేశంతో పార్టీ కార్యాలయం ధ్వంసమైంది. రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లోని పార్టీ ప్రదాన కార్యాలయంలో ఆదివారం చోటు చేసుకున్నది. చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ సిఎం హరీశ్ రావత్ ఆదివారం 63 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో నవీన్ బిక్ష్, ఆర్యేంద్ర శర్మ పేర్లు లేవు.
దీంతో ఆగ్రహించిన వీరి మద్దతుదారులు వందల మంది టికెట్ల కేటాయింపులో తమ పట్ల వివక్ష చూపించారని ఆరోపిస్తూ డెహాడ్రూన్ లోని పార్టీ కార్యాలయం 'రాజీవ్ భవన్'పై దాడి చేశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన సీఎం హరీశ్ రావత్, పార్టీ నేత కిశోర్ ఉపాధ్యాయ ఫొటోలతో ముద్రించిన పోస్టర్లు, హోర్డింగ్‌లను చించి పారేశారు. హరీశ్ రావత్, కిశోర్ ఉపాధ్యాయ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీకి అంకితమైన వారిని నిర్లక్ష్యంచేస్తున్నారని ఆరోపించారు. చివరి క్షణాల్లో పార్టీలో చేరిన వారిని అందలం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. కార్యాలయంలో లోపలకు వెళ్లి ఫర్నీఛర్ చిందర వందరచేశారు. కుర్చీలు బయటకు విసిరేశారు.
పార్టీ కార్యకర్తల దాడి, ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందన్న భయంతో పలువురు నేతలు రాజీవ్ భవన్‌కు రాకుండా మొహం చాటేశారు. డెహడ్రూన్ కంటోన్మెంట్ నుంచి టిక్కెట్ ఆశించిన నవీన్ బిక్ష్‌కు బదులు సూర్యకాంత్ ధస్మానాకు టిక్కెట్ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయకు సహస్ పూర్‌లో అవకాశం లభించింది. దీనిపై కిశోర్ ఉపాధ్యాయ స్పందిస్తూ ప్రతి ఒక్కరికి టిక్కెట్లు ఇవ్వడం కష్ట సాద్యమన్నారు. ఒక అసెంబ్లీ స్థానం నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం చిక్కుతుందన్నారు. తనకు పార్టీ నాయకత్వం కేటాయించిన సీటు వదులుకునేందుకు సిద్ధమన్నారు. కానీ ఇటువంటి వైఖరిని సహించబోమని పార్టీ శ్రేణులను హెచ్చరించారు. పార్టీ కార్యాలయంపై దాడి ఘటనకు కారకులపై కమిటీవేసి విచారిస్తామన్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని ఉత్తరాఖండ్ సిఎం పార్టీ కార్యకర్తలకు వాయిస్ మెసేజ్ పంపారు. పార్టీ టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న నేతలు, వారి మద్దతుదారులకు హరీశ్ రావత్ క్షమాపణ చెప్పారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ టిక్కెట్ల కేటాయింపులో ఎవరి మనస్సులనైనా గాయ పరిస్తే మన్నించాలని అభ్యర్థించారు. ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ స్థానాలు 70. మొత్తం ఓటర్లు 75,99, 688 మంది. ఈ నెల 20వ తేదీన నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 15న పోలింగ్ నిర్వహిస్తారు. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి ఆధిక్యం రాకున్నా పీడీఎఫ్ పొత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
గోవాలో సీనియర్ల ఆశలకు గండి
పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలు టిక్కెట్ల కేటాయింపుల్లో సీనియర్ నేతల ఆశలు అడియాసలయ్యాయి. దీంతో వారంతా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచేందుకు సిద్ధం అవుతున్నారు. బీజేపీ నాయకత్వం ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ అనంత్‌సేథ్, కేంద్రమంత్రి శ్రీపాద నాయక్ తనయుడు సిద్ధేశ్ నాయక్‌లతోపాటు 21 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించింది. వారి స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన వారికి అవకాశం కల్పించింది. ఆరోగ్య కారణాల రీత్యా సెయింట్ ఆండ్రే ఎమ్మెల్యే విష్ణు వాఘ్‌కు టిక్కెట్ నిరాకరించింది. అయితే మాజీ మంత్రి, కనాకోనా ఎమ్మెల్యే రమేశ్ తవాద్కర్ మాత్రం తనకు టిక్కెట్ కేటాయించనందుకు ఎస్టీల నుంచి బీజేపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని బెదిరింపులకు దిగారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా పలువురు సీనియర్ నాయకులకు మొండిచేయి చూపింది. సంగీతా పరబ్, జితేంద్ర దేశ్‌ప్రభు, ప్రతాప్ గవాస్, జోవాఖిమ్ అలేమావోస్‌తోపాటు యంగ్‌టర్క్‌లు సునీల్ కవ్తాంకర్, ఉర్ఫాన్ ముల్లా తదితరులకు కాంగ్రెస్ పార్టీ జాబితాలో చోటు దక్కలేదు.












Click it and Unblock the Notifications