రచ్చ రచ్చ: అరుణాచల్‌ప్రదేశ్ సిఎంపై అవిశ్వాసం
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. గురువారం ఓ హోటల్‌లో నిర్వహించిన ‘సభ'లో అరుణాచల్‌ప్రదేశ్ సిఎం నబమ్ టుకీపై అవిశ్వాసం పెట్టి, కొంత కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కలిసి కాంగ్రెస్ తిరుగుబాటు నేతను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అయితే గౌహతి హైకోర్టు జోక్యం చేసుకుని తిరుగుబాటు అభ్యర్థుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చింది.
బుధవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ నబమ్ రెబియాను తొలగించడం సహా అన్ని నిర్ణయాల్నీ నిలుపుదల చేసింది. అసెంబ్లీ సమావేశాల్ని ముందుకు జరుపుతూ గవర్నర్ జేపీ రాజ్‌ఖోవా నోటీసు జారీచేయడంపై న్యాయస్థానం విమర్శించింది. ప్రాథమిక పరిశీలన ప్రకారం ఈ ఉదంతంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 174, 175 ఉల్లంఘనకు గురైనట్లు తెలుస్తోందని జస్టిస్ హృషికేశ్‌రాయ్ పేర్కొన్నారు.
సస్పెండైన 14 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని పునరుద్ధరించడం, కొత్త ప్రదేశంలో శాసనసభను నిర్వహించడం, స్పీకర్‌ను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాలను జస్టిస్ హృషికేశ్‌రాయ్ నిలుపుదల చేశారు. 2016, జనవరి 24న జరగాల్సిన అసెంబ్లీ సమావేశాల్ని డిసెంబర్ 16కు మారుస్తూ గవర్నర్ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ స్పీకర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. తదుపరి విచారణ నిమిత్తం కేసును 2016, ఫిబ్రవరి 1కి వాయిదా వేశారు.

కలిఖో పుల్ ఎన్నిక
గురువారం ఒక కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన ‘తాత్కాలిక' అసెంబ్లీ సమావేశంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్ నబమ్ రెబియాను అభిశంసిస్తూ తీర్మానం చేశారు. కాగా, బుధవారంనుంచి అసెంబ్లీని సీల్ చేసిన దృష్ట్యా ఒక హోటల్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సమావేశమైన 20 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో 11 మంది బిజెపి ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యులు చేతులు కలిపారు.
బిజెపి ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు గురువారం ముఖ్యమంత్రిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని తిరుగుబాటు ఎమ్మెల్యే అయిన డిప్యూటీ స్పీకర్ టి నోర్బు తోంగ్‌డోక్ స్పీకర్ స్థానంలో ఉండగా ఆమోదించారు. 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో 20 మంది కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలతో కలుపుకొని మొత్తం 33 మంది సభ్యులు ఆ తర్వాత మరో అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యే కలిఖో పుల్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.
కాగా, ఈ సభా కార్యకలాపాలు చట్ట వ్యతిరేకమైనవి, రాజ్యాంగ విరుద్ధమైనవని పేర్కొంటూ ముఖ్యమంత్రి నబమ్ టుకి, ఆయనను సమర్థిస్తున్న 26 మంది ఎమ్మెల్యేలు వాటిని బహిష్కరించారు.
ఆ తర్వాత వారు రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాజ్‌ఖోవా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని అతిక్రమించి వ్యవహరించిన దృష్ట్యా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారు.
ఇది ఇలా ఉండగా, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ చర్యపై మండిపడిన కాంగ్రెస్ పార్టీ రెండు రోజులుగా రాజ్యసభ కార్యకలాపాలను స్తంభింపజేసింది. ఈ అంశంపై రాజ్యసభలో అంతరాయాలు, లోక్‌సభలో ఆందోళనలు సృష్టించడాన్ని సమర్థించుకుంది. కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. కేంద్రం గవర్నర్ ద్వారా సుస్థిర ప్రభుత్వాన్ని అస్థిర పరుస్తోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications