నా వల్లే బీజేపీకి 104 సీట్లు- ఢిల్లీ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు-అరవింద్ కేజ్రివాల్ వెల్లడి..
ఢిల్లీలో కేజ్రివాల్ సర్కార్ కూ లెఫ్టినెంట్ గవర్నర్ కూ మధ్య సాగుతున్న నిరంతర పోరు ఇవాళ పతాకస్ధాయికి చేరుకుంది. ఆప్ సర్కార్ తీసుకునే ప్రతీ నిర్ణయానికీ అడ్డుపడటమే లక్ష్యంగా లెఫ్టినెంట్ గవర్నర్ సాగిస్తున్న పోరుతో కేజ్రివాల్ కూడా అంతే దీటుగా బదులిస్తున్నారు. ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి మరీ గవర్నర్ తీరుపై కేజ్రివాల్ నిప్పులు చెరిగారు. టీచర్లను శిక్షణ కోసం ఫిన్లాండ్ పర్యటన వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా గవర్నర్ అడ్డుపడటాన్ని కేజ్రివాల్ తీవ్రంగా తప్పుబట్టారు.
ఫిన్లాండ్ లో ఢిల్లీ ఉపాధ్యాయుల శిక్షణా పర్యటనను అడ్డుకున్నందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై ఇవాళ సీఎం కేజ్రివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రజలు ఎన్నుకున్న తాము తీసుకుంటున్న నిర్ణయాల్ని అడ్డుకోవడానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరని కేజ్రివాల్ ప్రశ్నించారు. ఎవరీ లెఫ్టినెంట్ గవర్నర్ ? మన తలపై కూర్చున్నారు.. మన పిల్లలను ఎలా చదివించాలో నిర్ణయించడానికి ఈయన ఎవరు? ఈ వ్యక్తులు మన పిల్లలను చదువుకోకుండా చేశారు. మమ్మల్ని ఆపడానికి ఎల్‌జీకి అధికారం లేదు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. .రేపు మనం కేంద్రంలో అధికారంలో ఉండవచ్చు, మా ఎల్జీతో కలిసి ఉండవచ్చు. మా ప్రభుత్వం ప్రజలను వేధించదు" అని కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు.

ఈ లెఫ్టినెంట్ గవర్నర్ (సక్సేనా) తరహాలో నా టీచర్లు కూడా హోం వర్క్ చెక్ చేయలేదంటూ కేజ్రివాల్ విమర్శించారు. తన చేతిరాత, స్పెల్పింగ్స్ ను కూడా తప్పుబడుతున్నారంటూ కేజ్రివాల్ ఆరోపించారు. అదే సమయంలో డిసెంబర్ లో జరిగిన ఢిల్లీ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ తన వల్లే 104 సీట్లు గెలుచుకుందని లెఫ్టినెంట్ గవర్నర్ గొప్పలు చెప్పుకున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.తన వల్లే ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలుచుకుందని, తాను లేకుంటే బీజేపీ 20 సీట్లు కూడా గెల్చుకునేదికాదని సక్సేనా చెప్పుకున్నట్లు కేజ్రివాల్ తెలిపారు.












Click it and Unblock the Notifications