బీజేపీ తరపున ప్రచారం చేస్తా, కానీ..: అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. అయితే, అందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ఓ సవాల్ విసిరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశంలోని 22 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తే.. తాను బీజేపీ తరపున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు.
తమ డిమాండ్‌ను నెరవేర్చేందుకు బీజేపీ సిద్ధమేనా? అని ప్రధాని నరేంద్ర మోడీకి అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఢిల్లీలో 'జనతా కీ అదాలత్' పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అంతటా విఫలమయ్యాయని ఆరోపించారు. అంతేగాక, హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో బీజేపీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో బీజేపీ ప్రభుత్వాల పతనం ఖాయమన్నారు అరవింద్ కేజ్రీవాల్. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అంటే.. ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగేనంటూ ఆరోపించారు. బీజేపీ ప్రజావ్యతిరేకమని మండిపడ్డారు. బస్ మార్షల్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించడంతోపాటు ఢిల్లీలో హోంగార్డుల వేతనాలను నిలిపివేసిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దేశ రాజధానిలో ప్రజాస్వామ్యం లేదన్న కేజ్రీవాల్.. అక్కడ ఎల్జీ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు.
పదేళ్లలో బీజేపీ ఏమీ చేయలేదన్నారు అరవింద్ కేజ్రీవాల్. వచ్చే ఏడాదిలో ప్రధాని మోడీకి 75 ఏళ్లు నిండుతాయని.. ఇప్పటికైనా ప్రజలకు ఏమైనా చేయాలన్నారు ఢిల్లీ ఎన్నికలు రాబోతున్నాయని.. డిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు చేస్తామని బీజేపీ చెబుతోంది. హర్యానాలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏం చేసిందో చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఒరిగేదేమీ లేదన్నారు.












Click it and Unblock the Notifications