Asia Cup 2023: లంకతో ఫైనల్ కు అక్షర్ స్ధానంలో సుందర్ ? బంగ్లా చేతిలో ఓటమి దెబ్బతో..
ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన ఆసియాకప్ .. ఫైనల్ కు వచ్చేసరికి భారీ అంచనాలతో ఓ రేంజ్ కు చేరిపోయింది. భారత్-పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ లు చూడొచ్చని భావించిన అభిమానులకు, అంతకు మించిన రేంజ్ లో స్పిన్ పిచ్ లు ఉర్రూతలూగించాయి. ఏ మ్యాచ్ లో ఎలాంటి ఫలితం వస్తుందో అస్సలు ఊహించలేని పరిస్దితి. శ్రీలంక గెలుస్తుందని అనుకున్న సూపర్ 4 మ్యాచ్ ను భారత్ తన్నుకుపోయింది. నిన్న భారత్ గెలుస్తుందనుకుంటే బంగ్లా అడ్డుగా నిలిచింది.
ఆసియాకప్ సూపర్ 4లో అన్ని జట్లకు చుక్కలు చూపించిన స్పిన్ పిచ్ లు ఇప్పుడు వాటి ఆలోచనా ధోరణినీ మార్చేస్తున్నాయి.ముఖ్యంగా బంగ్లాదేశ్ చేతిలో నిన్న ఎదురైన ఓటమి తర్వాత భారత్ కూడా వ్యూహం మార్చుకుంటోంది. కొలంబోలో శ్రీలంకతో ఆదివారం జరిగే ఆసియా కప్ ఫైనల్‌కు భారత జట్టులో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ చేరబోతున్నాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్లో గాయాలతో ఇబ్బందులు పడిన స్పిన్నర్ అక్షర్ పటేల్ స్ధానంలో సుందర్ ను బెంగళూరు నుంచి పిలిపిస్తున్నారు.

సుందర్ ను శ్రీలంకతో ఫైనల్‌కు ఎంపిక చేస్తే కొలంబోలో ఇప్పటివరకు స్పిన్నర్లకు సహకరిస్తున్న పిచ్ మీద శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్ మెన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాషింగ్టన్ సుందర్ భారత ఆసియా క్రీడల జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న సుందర్.. . ఫైనల్ పూర్తయిన తర్వాత తిరిగి ఆసియా క్రీడల శిబిరంలో చేరబోతున్నాడు. చైనాలోని హాంగ్‌జౌలో ఆసియా క్రీడలు ప్రారంభమయ్యే ముందు సెప్టెంబర్ 23 వరకు జరిగే క్యాంప్ లో పాల్గొంటాడని తెలుస్తోంది.
ఆఫ్‌బ్రేక్‌లు బౌలింగ్ , ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన సుందర్.. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో చివరిసారిగా వన్డే ఆడాడు. అయితే తాత్కాలిక 15 మంది ప్రపంచ కప్ జట్టులో చోటు కోల్పోయాడు. కానీ ఇప్పుడు స్పిన్నర్లకు అనుకూలిస్తున్న కొలంబో పిచ్ పై అక్షర్ ఆడకపోతే మరో స్పిన్నర్ సుందర్ నే తీసుకోవాలని భారత్ నిర్ణయించడాన్ని చూస్తే బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితం టీమిండియాను ఎంత ప్రభావితం చేస్తోందో అర్దం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications