పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిన బీజేపీ ఫైర్ బ్రాండ్ సీఎం
Himanta Biswa Sarma: ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్‌కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి.
ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలను విధించింది. ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను మూసివేయడమే కాకుండా దేశంలో నివస్తోన్న పాకిస్తానీయులనూ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది.

ఈ పరిణామాలు కాస్తా భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. యుద్ధ వాతావరణానికి దారి తీసింది. రెండు దేశాలు కూడా యుద్ధ సన్నాహాలు మొదలు పెట్టాయి కూడా. భారత్, పాకిస్తాన్ రెండూ తమ నౌకాదళ విన్యాసాలను నిర్వహించాయి. అరేబియా సముద్రంపై మిస్సైల్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశాయి. యుద్ధ వాహక నౌకల సామర్థ్యాన్నీ పరీక్షించుకున్నాయి.
ఈ పరిస్థితుల మధ్య అస్సాం ముఖ్యమంత్రి, ఫైర్ బ్రాండ్ హిమంత బిశ్వ శర్మ తన అధికారిక ఎక్స్ అకౌంట్ హ్యాండిల్‌లో ఆసక్తికర ట్వీట్ పోస్ట్ చేశారు. బలూచిస్తాన్ గురించి వివరించారు. బలూచ్ ఆవిర్భావం, స్వాతంత్ర్యోద్యమాన్ని ప్రస్తావించారు. దాని పుట్టుపూర్వోత్తరాలను ఇందులో పొందుపరిచారు.
1947- 1948లో చోటు చేసుకున్న అల్లకల్లోల పరిస్థితుల నుండి బలూచిస్తాన్ స్వాతంత్ర్యోద్యమం ఉద్భవించిందని హిమంత బిశ్వ శర్మ గుర్తు చేశారు. బ్రిటిష్ వలస పాలన ముగిసిన తర్వాత తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి కలాట్ డైనాస్టీ ప్రయత్నించిందని పేర్కొన్నారు.
స్వయంప్రతిపత్తి కోసం ప్రారంభంలో చర్చలు సాగినప్పటికీ- 1948లో పాకిస్తాన్ ఈ రీజియన్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకుందని హిమంత వివరించారు. ఇది- బలూచ్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహవేశాలకు నాంది పలికిందని, పాకిస్తాన్ పట్ల తీవ్ర వ్యతిరేకత భావాన్ని వారిలో నాటిందని చెప్పారు.
దశాబ్దాల కాలంగా రాజకీయ హక్కులను హరించడం, ఆర్థిక- సాంస్కృతికంగా ఈ ప్రాంతం అణచివేతకు గురైందని హిమంత అన్నారు. పాకిస్తాన్ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలు అక్కడ తిరుగుబాట్లకు ఆజ్యం పోశాయని చెప్పారు.

ప్రత్యేకించి- 1958, 1962, 1973, 2000 సంవత్సరం ప్రారంభంలో బలూచిస్తాన్ సహజ వనరులు సమృద్ధిగా ఉన్న ఓ ప్రావిన్స్‌గా కొనసాగినప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం చాలాకాలంగా అభివృద్ధి దూరం అయ్యారని, వ్యవస్థీకృత దోపిడీకి గురయ్యారని హిమంత చెప్పారు. 2006లో బలూచ్ గిరిజన నాయకుడు నవాబ్ అక్బర్ బుగ్టి హత్య ఒక బాధాకరమైన అధ్యాయమని ఆయన వ్యాఖ్యానించారు.
అక్బర్ బుగ్టి ఉదంతం మరోసారి బలూచిస్తాన్‌లో తిరుగుబాటును రగిలించిందని, స్వయం నిర్ణయాధికారం, న్యాయం కోసం డిమాండ్లను లేవనెత్తేలా చేసిందని హిమంత చెప్పారు. బలూచిస్తాన్ ఉద్యమం.. స్థానిక ప్రజల గౌరవం, హక్కులు, స్వపరిపాలన, తమ ప్రాంతంపై తమ హక్కులు ఉండాలనే బలమైన ఆకాంక్షకు చిహ్నంగా నిలుస్తుందని, స్వేచ్ఛ కోసం అవిచ్ఛిన్న స్ఫూర్తితో పోరాడుతున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications