బెంగాల్, తమిళనాడులో నేడే పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి..
మరికొద్ది గంటల్లో తమిళనాడులో ఎన్నికల సమరం ప్రారంభం కానుంది. ఈ మేరకు సర్వం సిద్ధం అయింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఓటింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం 6 లోపు క్యూలైన్ లో నిలబడిన వారికి ఓటు వేయడానికి అనుమతి ఉంటుంది. ఈసారి భారీ ఓటింగ్ శాతం నమోదు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. తమిళనాడులో మొత్తం 5.73 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2.93 కోట్లు ఉన్నారు. మొత్తం 33, 133 ప్రాంతాల్లో 75,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇక తమిళనాడులో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. అధికార డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. తమిళనాడులో ఎన్నికలు ఈ సారి టీవీకే అధ్యక్షుడు విజయ్ చుట్టూనే తిరుగుతున్నాయి. మరి తొలిసారి బరిలోకి దిగుతున్న విజయ్ కు ఎన్నికల్లో ప్రజలు ఏమాత్రం మద్దతు ఇస్తారనేది వేచి చూడాలి.
పశ్చిమ్ బెంగాల్ లో మొదటి దశ పోలింగ్ ఈరోజు జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. తొలి దశలో భాగంగా 16 జిల్లాల్లోని 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ కు రంగం సిద్ధమైంది. ఈ సారి బెంగాల్ లో అత్యధిక శాతం ఓటింగ్ నమోదవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో క్యూలో ఇబ్బంది పడకుండా ఓటర్లు ముందుగానే పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

ఇక బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఈసారి ఎలాగైనా బెంగాల్ లో అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. అయితే మరోసారి కూడా బెంగాల్ పీఠాన్ని దక్కించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. మరి ఈ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. ఈ ఎన్నికల ఫలితాలు మే 4 న వెల్లడి కానున్నాయి.












Click it and Unblock the Notifications