ఫలితాలు: తెలంగాణపై లగడపాటి కోరిక తీరేనా?
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అత్యంత ఉత్సాహంగా కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎగ్జిట్ పోల్ సర్వేను వెల్లడించారు. నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెసు పరాజయం పాలవుతోందని ఆయన లెక్కలు కట్టి చెప్పారు. కాంగ్రెసువాదిగా తనకు అది బాధాకరమే అయినప్పటికీ సమైక్యవాదిగా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన దానివల్ల ఆగిపోవచ్చుననేది ఆయన అన్వయింపు.
ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు ఓటమి ఖాయమైంది. దీంతో లగడపాటి రాజగోపాల్ కోరిక నెరవేరుతుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ ఎన్నికల్లో ఓటమితో యుపిఎ ప్రభుత్వం తెలంగాణపై వెనక్కి తగ్గే అవకాశాలుంటాయని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగకపోవచ్చునని ఆయన అన్నారు.

అంతేకాకుండా, నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెసు పరాజయం పాలైతే భాగస్వామ్య పక్షాలు యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి కూడా వెనకాడవచ్చునని, దాంతో పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందడం కూడా కష్టమవుతుందని ఆయన అన్నారు. ఆయన అన్నట్లు యుపిఎ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గుతుందా అనే సంశయం పుడుతోంది.
అయితే, పరిస్థితులు లగడపాటి రాజగోపాల్ చెప్పినంత సులభంగా లేవని అంటున్నారు. శాసనసభ ఫలితాలపై ఇది వరకే కాంగ్రెసుకు అంచనా ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి కారణంగా తమ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందనే అంచనాకు వచ్చిన కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుందనేది రాజకీయ విశ్లేషకులు కాదు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా విమర్సిస్తున్నారు.
రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్రలో వైయస్ జగన్‌తో, తెలంగాణలో తెరాసతో జోడీ కట్టడం ద్వారా అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెసు తెలంగాణపై ఆలోచన చేసిందని అంటున్నారు. తెలంగాణలో తెరాసను విలీనం చేసుకోవడం లేదా ఎన్నికలకు ముందే పొత్తు కుదుర్చుకోవడం అనే వైఖరి ద్వారా, జగన్‌తో ఎన్నికల తర్వాత అవగాహనకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుందని అంటున్నారు. దీంతో తెలంగాణపై యుపిఎ ప్రభుత్వం ముందుకు సాగడానికే ఎక్కువ అవకాశాలున్నాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications