ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది అంగన్‌వాడి కార్యకర్తల దుర్మరణం.. రక్తసిక్తం
భోపాల్: మధ్య ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో డ్రైవర్, 12 మంది అంగన్‌వాడి కార్యకర్తలు ఉన్నారు. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో 10 మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందారంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో ఈ తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. 18 మంది అంగన్‌వాడి కార్యకర్తలు రెండు ఆటోలను మాట్లాడుకుని గ్వాలియర్ నుంచి బయలుదేరారు. మార్గమధ్యలో ఒక ఆటో ఇంజిన్ లోపంతో నిలిచిపోయింది. వారంతా ఒకే ఆటోలో బయలుదేరారు. పురానీ ఛావ్‌నీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగా మాలన్‌పూర్ వద్ద ఆటో వెళ్తోండగా.. మురైనా నుంచి గ్వాలియర్ వైపునకు వస్తోన్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సహా అందులో ప్రయాణిస్తోన్న వారిలో 13 మంది మృతిచెందారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, పురానీ ఛావ్‌నీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. గాయపడ్డ వారిని గ్వాలియర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం తీసుకెళ్లారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు. అతని కోసం గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. మృతులందరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడం, వారంతా ఒకేచోట పని చేస్తోన్న అంగన్‌వాడి కార్యకర్తలు కావడం స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications