బంక్ కొట్టి సినిమాకెళ్తే.. పోలీసులు పట్టుకున్నారు
తిరువనంతపురం: పలువురు కళాశాలల విద్యార్థులు తరగతులు ఎగ్గొట్టి సినిమాకు వెళ్లి పోలీసులకు చిక్కిన సంఘటన కేరళలో రాష్ట్రంలో చోటుచేసుంది. కళాశాలల విద్యార్థులు ఇటీవల విడుదలైన 'ప్రేమమ్' అనే చిత్రాన్ని వీక్షించేందుకు తరగతులు ఎగ్గొట్టి మరీ సినిమా హాలుకు వెళ్లారు. అయితే వారి ఆశలపై పోలీసులు నీళ్లు చల్లారు.
విద్యార్థులను అదుపులోకి తీసుకొని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దాదాపు 60 మంది కళాశాలల విద్యార్థులను సినిమా థియేటర్ వద్ద పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
'ప్రేమమ్' సినిమా వీక్షించేందుకు విద్యార్థులు తరగతులు ఎగ్గొట్టి వెళుతున్నారని స్థానిక కళాశాలల యాజమాన్యాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

యాజమాన్యాల వద్ద నుంచి విద్యార్థుల ఇంటి చిరునామాలను తీసుకొని వారి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు తెలిపారు. కాగా, నివీన్ పాలీ, అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘ప్రేమమ్' చిత్రానికి హిట్ టాక్ రావడంతో విద్యార్థులందరూ ఇలా కళాశాలలకు బంక్ కొట్టి సినిమా థియేటర్లకు పరుగెడుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, విద్యార్థుల స్వేచ్ఛను హరించాలన్నది తమ ఉద్దేశం కాదని, చెడుదారులు పట్టకుండా ఉండేందుకే విద్యార్థులను కట్టడి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ‘ఆపరేషన్ గురుకులం' పేరుతో నిరుడి నుంచి పోలీసులు.. నేరాల బాట పడుతున్న విద్యార్థులను సరైన మార్గంలో పెడుతున్నారు.












Click it and Unblock the Notifications