ఆతిషి అవుట్: కేజ్రీవాల్.. వాట్ నెక్స్ట్: ఒక్క దెబ్బకు అంతా తలకిందులు!
Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నది ఆమ్ ఆద్మీ పార్టీ. భారతీయ జనతా పార్టీ చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది. 10 సంవత్సరాల పాలనకు చెక్ పెట్టింది కమలం. భారీ మెజారిటీతో కమ్ బ్యాక్ ఇచ్చింది. 27 సంవత్సరాల పాటు కొరుకుడు పడని ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంది.
మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కింది 22 స్థానాలే. బురారీ, కిరారీ, సుల్తాన్‌పూర్ మజ్రా, సదర్ బజార్, చాందినీ చౌక్, మటియా మహల్, బల్లిమరన్, కరోల్ బాగ్, పటేల్ నగర్, తిలక్ నగర్, ఢిల్లీ కంటోన్మెంట్, దేవ్లీ, అంబేద్కర్ నగర్, కల్కాజీ, తుగ్లకాబాద్, బదార్‌పూర్, ఓఖ్లా, కొండ్లీ, సీమాపురి, శీలంపూర్, బాబర్‌పూర్, గోపాల్‌పూర్ స్థానాలు ఆప్ ఖాతాలో పడ్డాయి.

బీజేపీ 48 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగరవేసింది. నరేల, తిమర్‌పూర్, ఆదర్శ్ నగర్, బద్లీ, రిథల, బవాన, ముండ్కా, నంగ్లోయ్ జాట్, మంగోల్ పురి, రోహిణి, షాలిమార్ బాగ్, షకూర్ బస్తీ, త్రినగర్, వజీర్‌పూర్, మోడల్ టౌన్, మోతీ నగర్, మదిపూర్, రాజౌరి గార్డెన్, హరినగర్, జనక్‌పురి, వికాస్‌పురి, ఉత్తమ్‌నగర్, ద్వారకా, బిజ్వాసన్, పాలం, రాజిందర్‌నగర్ నియోజకవర్గాల్లో కాషాయ జెండా ఎగిరింది.
న్యూఢిల్లీ, జంగ్‌పురా, కస్తూర్బా నగర్, మాలవీయ నగర్, ఆర్‌కె పురం, మెహ్రౌలీ, ఛతార్‌పూర్, సంగం విహార్, గ్రేటర్ కైలాష్, త్రిలోక్‌పురి, పట్పర్‌గంజ్, లక్ష్మీ నగర్, విశ్వాస్ నగర్, కృష్ణానగర్, గాంధీ నగర్, షాహదారా, రోహతాస్ నగర్, ఘోండా, కరావల్ నగర్‌లల్లోనూ బీజేపీ పాగా వేసింది.
మొత్తంగా బీజేపీకి పోల్ అయిన ఓట్ల శాతం 45.56. రెండు శాతం ఓట్లతో వెనుకంజ వేసింది ఆప్. 43.57 శాతానికి సరిపెట్టుకోవాల్సొచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జీరో అయింది. 6.34 శాతం ఓట్లకే పరిమితం అయింది. జనతాదళ్ (యునైటెడ్) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
ఈ ఘోర ఓటమి అనంతరం ముఖ్యమంత్రి ఆతిషి తన పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి కిందటే రాజ్ నివాస్‌లో లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిశారు. తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. దీన్ని వెంటనే ఆమోదించారు ఎల్జీ. 20 నిమిషాల్లోనే రాజీనామా ప్రక్రియ పూర్తయింది. రాజ్ నివాస్ వద్ద విలేకరులతో ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పటికీ నిరాకరించారు. ఆసక్తి చూపలేదు.
ఈ ఎన్నికల్లో చవి చూసిన ఓటమి.. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తలకిందులు చేసినట్టయింది. ఈ విడత కూడా గెలిచివుంటే గోవా వంటి చిన్న రాష్ట్రాల్లో పార్టీని విస్తరింపజేసుకోవడం, ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియాలో డ్రైవింగ్ ఫోర్స్‌గా మారాలనుకున్న కేజ్రీవాల్ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.












Click it and Unblock the Notifications