అయోధ్య మసీదు నిర్మాణానికి లైన్ క్లియర్-ఎట్టకేలకు అనుమతి- రంజాన్ తర్వాత పనులు ..!
అయోధ్యలో మసీదు నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మూడేళ్ల తర్వాత అయోధ్య డెవలప్ మెంట్ బోర్డు నిర్మాణానికి అనుమతి మంజూరు చేసింది.
ఉత్తర్ ప్రదేశ్ లో 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన స్ధల యాజమాన్య హక్కులపై మూడేళ్ల క్రితం సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. దీంతో అయోధ్య-బాబ్రీ మసీదు వివాదానికి తెరపడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాబ్రీ మసీదు కూల్చిన స్ధలంలో రామాలయం నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు ఇచ్చిన యూపీ ప్రభుత్వం.. మసీదు నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదు. దీనిపై విమర్శలు రావడంతో తాజాగా అయోధ్య అభివృద్ధి అథారిటీ అనుమతులు మంజూరు చేసింది.
బాబ్రీ మసీదు కూల్చివేత నేపథ్యంలో అయోధ్యలోనే ముస్లింలు కోరుకున్న చోట ఐదెకరాల స్ధలం కేటాయించి మసీదు నిర్మాణానికి సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే మూడేళ్లు దాటినా అనుమతులు ఇవ్వకుండా యూపీ సర్కార్ కాలయాపన చేసింది.మరోవైపు అయోధ్యలో రామాలయం నిర్మాణానికి వెంటనే అనుమతులు ఇవ్వడంతో భారీగా విరాళాలు కూడా సేకరించి దాదాపుగా ఆలయాన్ని పూర్తి చేశారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ ఆలయం ప్రారంభించి ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ వ్యూహాలు సిద్దం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ తాజాగా సమావేశమై మసీదు నిర్మాణానికి అనుమతిచ్చింది.

దీంతో పవిత్ర రంజాన్ మాసం తర్వాత బాబ్రీ మసీదుకు బదులుగా భారీ మసీదు నిర్మాణం ప్రారంభించేందుకు సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు సిద్ధమవుతోంది. అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ తాజా బోర్డు సమావేశంలో కాంప్లెక్స్ లేఅవుట్‌కు క్లియరెన్స్ ఇవ్వడంతో అయోధ్యలోని ధన్నీపూర్ గ్రామంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మసీదు కాంప్లెక్స్ నిర్మాణం ఊపందుకుంది.
అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్, ఏడీఏ చైర్మన్ నితీష్ కుమార్ దీనిపై స్పందిస్తూ.. అయోధ్య మసీదు కమ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌కు పెండింగ్‌లో ఉన్న అన్ని క్లియరెన్స్‌లు ఇటీవలి బోర్డు సమావేశంలో క్లియర్ చేశామన్నారు. మసీదుకు మంజూరైన లేఅవుట్ కొన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత మరో రెండు రోజుల్లో సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకి అప్పగిస్తామన్నారు.












Click it and Unblock the Notifications