దేశ ప్రజలకు ప్రధాని మోదీ వాయిస్ మెసేజ్
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఇంకో 11 రోజులే మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈ నెల 15వ తేదీ నుంచే పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్.. ఆహ్వానపత్రికలను అందించింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలెబ్రిటీలకు ఆహ్వానం అందింది. అయోధ్యలో ప్రతి ఇంటికీ రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను పంపించింది.

గడువు సమీపించిన నేపథ్యంలో- ప్రధాని మోదీ తెర మీదికి వచ్చారు. ఓ వాయిస్ మెసేజ్‌ను విడుదల చేశారు. జనవరి 22వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రామ భజనలు జరగాలని పిలుపునిచ్చారు. అన్ని ఇళ్లల్లో దీపాలను వెలిగించి, అయోధ్యా రాముడిని పూజించాలని కోరారు.
దేశం నలుమూలలా రాములవారి నామం మారు మోగిపోవాలని అన్నారు. రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠోత్సవం కోసం తాను ఉత్కంఠతగా ఎదురు చూస్తోన్నానని, తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అనుభూతిని చవి చూడలేదని మోదీ చెప్పారు. శ్రీరాముడి ఆదేశాల మేరకే దేశ ప్రజల ప్రతినిధిగా తాను రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనబోతోన్నానని వ్యాఖ్యానించారు.

దీన్ని తన గురుతర బాధ్యతగా భావిస్తోన్నానని, ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ మహత్కార్యం విజయవంతం అయ్యేలా దేశ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు మోదీ. 140 కోట్ల మంది దేశ ప్రజల ఆకాంక్షలతో తాను ఈ కార్యక్రమంలో పాల్గొంటానని అన్నారు. 500 సంవత్సరాలుగా దేశ ప్రజలు కోరుకుంటోన్న ఏకైక కోరికను నెరవేర్చుతున్నానని చెప్పారు.
11 రోజుల ప్రాణ ప్రతిష్ఠోత్సవాలను మహారాష్ట్ర నాసిక్‌లోని పంచవటీ నుంచి ప్రారంభించదలచుకున్నానని వివరించారు. శ్రీరాములు సుదీర్ఘకాలం పాటు పంచవటీలో నివసించారని, అలాంటి పవిత్ర పుణ్యస్థలాన్ని దర్శించడంతో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications