రామ్ లల్లా గర్భగుడిలో ఈ 5 మందికి మాత్రమే అనుమతి: కాటుక పూసేది ఆయనే
Ayodhya Ram Mandir: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవ ముహూర్తం సమీపించింది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో.. సరయూ నదీ తీరం ఒడ్డున నిర్మితమైన రామమందిరం ప్రారంభం కాబోతోంది. రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదలుకానుంది.
ఈ కార్యక్రమం కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి ఆలయాలు, ప్రధాన మార్గాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో ఈ నగరం మారుమోగిపోతోంది. సరయూ నది తీరం మొత్తం రామభక్తులతో నిండిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోందక్కడ.

ఇంకాస్సేపట్లో ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ఆరంభం కానుంది. సరిగ్గా మధ్యాహ్నం 12:29 నిమిషాలకు ఆరంభమౌతుంది. 12:31 నిమిషాలకు ముగుస్తుంది. మొత్తం 89 సెకెండ్ల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని ముగించాల్సి ఉంటుంది అర్చకులకు. వారణాశి కాశీ విశ్వనాథ ఆలయం ప్రధాన అర్చకుడు లక్ష్మీకాంత్ దీక్షిత్.. సారథ్యంలో 121 మంది అర్చకులు ప్రాణ ప్రతిష్ట చేస్తారు.
రామమందిరం గర్భాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి అర్చకులు కాకుండా మరో అయిదుమందికి మాత్రమే అనుమతి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అయోధ్య ఆలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్రనాథ్ మాత్రమే గర్భగుడిలో ఉంటారు.

మూలవిరాట్ కళ్లకు కట్టిన వస్త్రాన్ని మోదీ తొలగిస్తారు. అనంతరం చిన్న బంగారు కర్రతో కాటుకను పూస్తారు. అద్దాన్ని సమర్పిస్తారు. అనంతరం 108 దీపాలను వెలిగిస్తారు. మహా హారతిలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం మోదీ.. ఆహ్వానితులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.












Click it and Unblock the Notifications