రామమందిరం ప్రారంభోత్సవం వేళ.. మోదీకి లేఖ రాసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Ayodhya Ram Mandir: ఇంకొన్ని గంటలు. 500 సంవత్సరాల నాటి భారతీయుల కల సాకారం కాబోతోంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో.. సరయూ నదీ తీరం ఒడ్డున నిర్మితమైన రామమందిరం ప్రారంభం కాబోతోంది. రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదలుకానుంది.
ఈ కార్యక్రమం కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి ఆలయాలు, ప్రధాన మార్గాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో ఈ నగరం మారుమోగిపోతోంది. సరయూ నది తీరం మొత్తం రామభక్తులతో నిండిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోందక్కడ.

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి 4,000 మందికి పైగా ప్రముఖులు హాజరు కానున్నారు. వారంతా ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సామాజికం, సినిమా, క్రీడారంగానికి చెందిన సెలెబ్రిటీలు అయోధ్యకు చేరుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశ ప్రజల తరఫున ఆయనకు శుభాకాంక్షలను తెలియజేశారు. 11 రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షను చేపట్టిన మోదీని అభినందించారు. ఇదొక పవిత్రమైన ఆచారం మాత్రమే కాదని, గొప్ప ఆధ్యాత్మిక చర్యగా అభివర్ణించారు.

సమన్యాయం, యావత్ దేశ ప్రజల సంక్షేమంపై శ్రీరాముడి ఆశీర్వాదం ఉంటుందని కొనియాడారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ప్రేమగా, సగౌరవంగా చూడాలనే శ్రీరాముడి సందేశాన్ని ఆచరిస్తారని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ చివరి వరకూ సామాజిక న్యాయమే లక్ష్యంగా జీవించారని, రామనామ జపంతో గడిపారని రాష్ట్రపతి గుర్తు చేశారు.
శ్రీరాముడి జీవితం అత్యంత ఆదర్శనీయమైనదని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఆలయ ప్రారంభోత్సవం నాడు పండగ వాతావరణం నెలకొనడం, ప్రతి ఒక్కరూ రామనామ జపంతో తరించడం.. ఈ దేశ గొప్పదనాన్ని చాటుతోందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications