హాఫ్ హాలిడే ప్రకటించిన రాష్ట్రం
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఇంకో మూడు రోజులు మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆరంభమౌతుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మించిన స్థలంలో అద్వితీయ ఆలయం అందుబాటులో రానుంది.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వేలాదిమంది ప్రముఖులు హాజరు కానున్నారు. వివిధ దేశాల నుంచి వందమంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలెబ్రిటీలకు ఆహ్వానం అందింది.

Recommended Video

ఈ నెల 15వ తేదీ నాడే ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ఆచారాల మొదలయ్యాయి. ఆగమోక్తంగా పూజాదికాలను నిర్వహిస్తోన్నారు అర్చకులు. వేదమంత్రోచ్ఛారణలతో అయోధ్యా నగరం మారుమోగిపోతోంది. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఇప్పటికే రాములోరు.. ఆలయ ప్రవేశం చేశారు. గర్భగుడిలో లక్ష్మణ సమేత శ్రీసీతారామాంజనేయుల వారు ఆసీనులయ్యారు.
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఇప్పటికే పోస్టల్ స్టాంపులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన దేశవ్యాప్తంగా ప్రఖ్యాత ఆలయాలను సందర్శిస్తోన్నారు. ఏపీలోని శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో గల లేపాక్షి ఆలయంతో ఈ పర్యటన మొదలైంది.

కాగా- ఆలయ ప్రారంభోత్సవం రోజైన జనవరి 22వ తేదీన కేంద్ర ప్రభుత్వం హాఫ్ డే సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాలు కూడా సగం రోజు సెలవును ప్రకటిస్తూ వస్తోన్నాయి. ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నాడు పూర్తి సెలవును ప్రకటించాలనే డిమాండ్ ఏపీలోనూ లేవనెత్తింది బీజేపీ.
తాజాగా- త్రిపుర.. ఈ జాబితాలో చేరింది. జనవరి 22వ తేదీన హాఫ్ డే సెలవును ప్రకటించింది. ఈ మేరకు జీవోను జారీ చేసింది. త్రిపురలోని అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పాఠశాలలు, కళాశాలలకు మధ్యాహ్నం 2:30 గంటల వరకు సెలవు లభించింది.












Click it and Unblock the Notifications