పెను విషాదం- శ్రీరామ కార్యార్థం
Acharya Satyendra Das: అయోధ్యలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అయోధ్య రామమందిరం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రనాథ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యురాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నారు.
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం 7 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆసుపత్రి డాక్టర్లు అధికారికంగా ధృవీకరించారు. గుండెపోటు వల్ల మరణించినట్లు తెలుస్తోంది. పంచాంగం ప్రకారం- అత్యంత పవిత్రమైన రోజుగా భావించే మాఘ పౌర్ణమి నాడు ఆచార్య సత్యేంద్రనాథ్ శివైక్యం అయ్యారు.

ఆయన మృతి పట్ల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంతాపాన్ని తెలియజేశారు. ఆయనను కారణజన్ముడిగా అభివర్ణించారు. శ్రీరామ కార్యార్థం ఈ భూమిపైకి వచ్చారని, రామమందిరం నిర్మాణం ఆయన చేతుల మీదుగా జరగడం పూర్వజన్మ సుకృతమని అన్నారు.
వృద్ధ్యాప్యం వల్ల సంభవించిన అనారోగ్య కారణాలతో ఈ నెల 3వ తేదీన ఆచార్య సత్యేంద్రనాథ్ లక్నో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. తొలి రెండు రోజుల పాటు ఆరోగ్యం విషమంగానే కనిపించింది. దీనితో న్యూరాలజీ విభాగానికి తరలించారు. అత్యాధునిక వైద్య చికిత్సను అందజేశారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందించారు.
దీనితో ఆయన ఆరోగ్యం కొంత నిలకడగా కనిపించింది గానీ- ఆ తరువాత మళ్లీ విషమించింది. దీనితో ఈ ఉదయం 7 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 1993 నుంచీ శ్రీరామ జన్మభూమితో మమేకం అయ్యారాయన. అప్పట్లో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చయంత్ రాయ్ సహా రామ మందిర ఉద్యమంతో ముడిపడి ఉన్న వాళ్లతో తన ప్రయాణాన్ని సాగించారు.












Click it and Unblock the Notifications