మహిళకు దెయ్యం పట్టిందని ఐటీ సిటీలో దారుణం
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో షాకింగ్. మహిళకు దెయ్యం పట్టిందని అత్తింటి వారు ఆమెకు చిత్రహింసలు పెట్టిన సంఘటన వెలుగు చూసింది. బాధిత మహిళకు కొత్తగా పెళ్లైంది. ఆమెను అత్తింటి వారు నాలుగు రోజుల పాటు ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టారు. ఎలాగో ఆమె తప్పించుకుంది.
దెయ్యం పట్టడం, మంత్రగత్తె వంటి సంఘటనలు కుగ్రామాల్లో జరుగుతుంటాయి. వీటిని మనం తరుచూ వింటుంటాం. కానీ ఐటీ సిటీ అయిన బెంగళూరులో ఇలాంటి సంఘటన జరగడం గమనార్హం.
36 ఏళ్ల సతీశ్వరి 38 ఏళ్ల సౌందర రాజ్‌తో కొద్ది రోజుల క్రితం పెళ్లయింది. పెళ్లైన ఆరు నెలలకే అత్తింటి వారి వేధింపులు ఆమెకు ప్రారంభమయ్యాయి.

ఆమె అత్త, ఆడపడుచులు సహా అత్తింటి వారందరూ గత నాలుగు రోజులుగా వేధిస్తున్నారు. ఆమెకు దెయ్యం పట్టిందని ఆరోపిస్తూ నాలుగు రోజులుగా తీవ్ర వేధింపులకు గురి చేశారు. ఆమెను కడుగొండనహల్లిలోని తమ ఇంట్లోనే ఉంచారు.
తన తల్లి లేదా తల్లిగారి కుటుంబ సభ్యులతోను మాట్లాడనివ్వలేదు. నాలుగు రోజుల అనంతరం ఆమె ఎలాగోలా వారి నుండి తప్పించుకుంది. తన బంధువులను సంప్రదించింది. చివరకు కుటుంబ సభ్యులు ఆమెను కాపాడారు.
ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాలు అత్తింటి వారి పైన ఫిర్యాదు చేసింది. తనను గదిలో బంధించారని, అప్పటి నుండి తనకు వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె చెప్పారు.
తొలి మూడు రోజులు తనను బాగా కొట్టారని, ఆ తర్వాత సోమవారం ఉదయం నాలుగు గంటలకు తనను తన మంచం పైన నుండి లాక్కొచ్చారని, పూజా గదికి తీసుకు వెళ్లారని తెలిపింది. తన చేతులు, కాళ్లు గట్టిగా పట్టుకొని, తన పై నుండి నడిచారని తెలిపింది.
ఆ తర్వాత వారు ఓ పైబర్ పైప్ తీసుకొని తన ముఖం పైన చితకబాదారని చెప్పింది. తన గొంతులో చేతులు పెట్టి లోపలి నుండి దెయ్యం తీస్తున్నట్లు చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. వారు చేసిన దాంతో వాంతికి చేసుకున్నానని, ఏడ్చానని తెలిపింది.
నేను సతీశ్వరినని, దెయ్యాన్ని కాదని ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదన్నారు. వారు తన జుత్తు పట్టుకొని లాక్కోస్తున్నప్పుడు కాపాడాలని తన భర్తను కోరానని, అయితే వాళ్లు అతనిని రావొద్దని బెదిరించారని, ఇంట్లో నుండి వెళ్లిపోమని చెప్పారని తెలిపింది.












Click it and Unblock the Notifications