వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాగేశ్వర్ ధామ్: మనసులో మాటను ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నిజంగా కనిపెడతారా, ఈ మతలబు ఏమిటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ధీరేంద్ర కృష్ణ శాస్త్రి

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లాలో చారిత్రక ఖజురాహో దేవాలయాలను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యటకులు వస్తుంటారు. ప్రాచీన కళలు, సంప్రదాయాలకు ఇక్కడి దేవాలయాలు, శిల్పాలు అద్దంపడతాయి.

దిల్లీ నుంచి ఖజురాహో వెళ్లే రైలు మధ్యలో ఛతర్‌పుర్‌కు సమీపంలో ఆగుతుంది. ఇక్కడ స్టేషన్ లేదు. కానీ, కొందరు చైన్‌లాగి రైలును ఆపుతుంటారు. ముఖ్యంగా మంగళవారం, శనివారం ఎక్కువగా ఇలా రైలును ఆపుతుంటారు.

ఇక్కడ చాలా మంది దిగుతారు. ఇక్కడి నుంచి బస్సులు, ఆటోలు, రిక్షాలు ఎక్కి బాగేశ్వర్ బాబా ధామ్‌కు వెళ్తారు. అక్కడే 26 ఏళ్ల ''బాబా’’ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దర్శనమిస్తారు.

ఆయనపై మళ్లీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మూఢ నమ్మకాలను వ్యాపింప చేస్తున్నారని ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి.

ధీరేంద్ర శాస్త్రి వార్తల్లో నిలవడం ఇదేమీ తొలిసారి కాదు. సనాతన ధర్మంపై చర్చలు పెట్టడం, అద్భుతాల గురించి చెప్పడం, కేంద్ర మంత్రులకు ఆశీర్వాదాలు ఇవ్వడం, వింతగా ప్రవర్తించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇలా ఆయన వ్యక్తిత్వంలో మనకు చాలా కోణాలు కనిపిస్తుంటాయి.

ఆయన వివాదాల విషయంలో వెంటాడుతున్న కొన్ని ప్రశ్నలకు నేడు సమాధానాలు చూద్దాం.

ధీరేంద్ర కృష్ణ శాస్త్రి

పేదరికం..

ఖజురాహో దేవాలయానికి 35 కి.మీ. దూరంలో ''గఢా’’ పేరుతో ఒక గ్రామం ఉంటుంది. 1996లో ఇక్కడే రామ్‌కృపాల్, సరోజ్‌ దంపతులకు 1996లో ఆయన జన్మించారు.

రోజూ స్కూలుకు బదులుగా దగ్గర్లోని దేవాలయానికి ఆయన వెళ్లేవారని స్థానికులు చెబుతుంటారు. చిన్నప్పటి నుంచే ఆయన ధోతీ-కుర్తా వేసుకోవడం మొదలుపెట్టారు.

చాలా పేద కుటుంబంలో ధీరేంద్ర జన్మించారని, ఒక్కోసారి వీరి కుటుంబ సభ్యులు కడుపు నింపుకునేందుకు భిక్షాటన చేసేవారని స్థానికులు చెబుతున్నారు.

ధీరేంద్ర శాస్త్రి వెబ్‌సైట్ ప్రకారం, ''ధీరేంద్ర శాస్త్రి బాల్యం పేదరికంలో గడిచింది. గుడిలో ఇచ్చే దక్షిణతోనే ఈ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు కడుపు నింపుకునేవారు’’అని పేర్కొంది.

ధీరేంద్ర తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందరికంటే ఆయనే పెద్దవాడు. ఆయన చెల్లి పేరు రీతా గార్గ్. తమ్ముడి పేరు శాలిగ్రామ్ గార్గ్‌. చెల్లికి పెళ్లి అయ్యింది. తమ్ముడు ఆశ్రమం బాధ్యతలు చూసుకుంటున్నాడు.

''ధీరేంద్ర పౌరోహిత్యం చేసేవారు. కొన్నిసార్లు క్రికెట్ ఆడటానికి కూడా వచ్చేవారు. ఎనిమిదో తరగతి వరకు ఆయన ఇక్కడే చదువుకున్నారు’’అని గఢాలో కొంతమంది యువత చెప్పారు.

ధీరేంద్ర కృష్ణ శాస్త్రి

ధీరేంద్ర తాతయ్య సైతు లాల్ గార్గ్ కూడా పౌరోహిత్యం చేసేవారు. తండ్రి నుంచే ఈ వృత్తిని చిన్నతనంలోనే ధీరేంద్ర నేర్చుకున్నారు.

''ఒకసారి మా తాతయ్య కలలోకి వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లాలని సూచించేవారు. అసలు నాకు అప్పట్లో అజ్ఞాతం అంటే ఏమిటో తెలిసేది కాదు. ఆ తర్వాత పాండవులు వనవాసం పేరుతో అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుసుకున్నాను. మేం అలా అజ్ఞాతంలోకి వెళ్లి వచ్చిన తర్వాత దర్బారు ఏర్పాటుచేయడం మొదలుపెట్టాం. వీటికి ప్రజలు వచ్చేవారు’’అని ఒక వీడియోలో ధీరేంద్ర చెప్పారు.

ధీరేంద్రతో కలిసి చదువుకున్న ఓ విద్యార్థి బీబీసీతో మాట్లాడారు. ''ధీరేంద్ర మాకంటే కాస్త చిన్నవాడు. అసలు అతడు పదో తరగతి పాసయ్యాడో లేదో తెలియదు. మొదట్లో అతడు ఇక్కడే తిరిగేవాడు. చదువులో అంత పెద్ద ప్రతిభేమీ చూపించేవాడు కాదు. పెద్దయ్యాక వ్యాపారం చేసుకుంటానని అతడు చెప్పేవాడు. కానీ, మధ్యలో ఒక సంవత్సరంపాటు అతడు ఎవరికీ కనిపించలేదు. తిరిగి వచ్చిన తర్వాత అతడు పూర్తిగా మారిపోయాడు. అతడి దగ్గరకు ఎమ్మెల్యేలు, ధనవంతులు రావడం మొదలుపెట్టారు. మొదట్లో కాంగ్రెస్ నాయకులు వచ్చేవారు. ఆ తర్వాత బీజేపీ నాయకులు కూడా రావడం మొదలుపెట్టారు. ఐదేళ్లకు ముందు అతడు సైకిల్‌పై వీధుల్లో తిరిగేవాడు’’అని అని చెప్పారు.

''చదువును ధీరేంద్ర మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కుటుంబాన్ని చూసుకునేందుకు ఆయన ఎక్కువ సమయం కేటాయించేవారు. అయితే ఒకరోజు 'దాదా గురు’ ఆశీష్షులతో ఆయన బాలాజీ మహారాజ్ సేవలోకి వచ్చారు’’అని ధీరేంద్ర వెబ్‌సైట్‌లో రాసుకొచ్చారు.

ప్రస్తుతం ధీరేంద్ర పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఆయన విమానంలో విదేశాలకు వెళ్తుంటారు. కొన్నిసార్లు ప్రైవేట్ జెట్‌లలో వెళ్లి వస్తుంటారు. భారత్ నుంచి బ్రిటన్ వరకు ఆయనకు అనుచరులు ఉన్నారు. ఆయన ఎక్కడకు వెళ్లినా, వెనుక వాహన శ్రేణి వస్తుంటుంది. అసలు ఇది ఎలా సాధ్యం?

ధీరేంద్ర కృష్ణ శాస్త్రి

ప్రాచీన శివాలయం...

ధీరేంద్ర శాస్త్రి ఇంటికి సమీపంలో ఒక ప్రాచీన శివాలయం ఉంది. ఇక్కడే ఒక ''సన్యాసి బాబా’’ జీవించేవారు. ఆయన ఆలోచనలనే తాను ముందుకు తీసుకెళ్తున్నట్లు ధీరేంద్ర చెబుతుంటారు.

ఇదే ఆలయం ఆవరణలో బాలాజీ దేవాలయం కూడా ఉంది. దీన్ని చూస్తుంటే కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంతానికి కొద్ది దూరంలోనే ధీరేంద్ర ఆశ్రమం కనిపిస్తుంది.

చందలా బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్ ప్రజాపతి తండ్రి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌డీ ప్రజాపతి.. ఈ దేవాలయం గురించి బీబీసీతో మాట్లాడారు.

''మొదట్లో అక్కడ శంకర్‌జీ దేవాలయం ఉండేది. ఆ పక్కనే హనుమాన్ విగ్రహం ఉండేది. ఇక్కడే ధీరేంద్రకు మార్గనిర్దేశం చేసిన బాబా పూజలు చేసేవారు. ఇక్కడకు ప్రజలు పెద్దయెత్తున వచ్చేవారు. ఆయన తర్వాత ధీరేంద్ర కూడా పూజలు చేయడం మొదలుపెట్టారు’’అని ఆయన ఆర్‌డీ ప్రజాపతి వివరించారు.

''ధీరేంద్రకు బాబా ఆశీస్సులు ఉండేవి. ఆ తర్వాత ఆయన జీవితంలో చాలా మార్పులు వచ్చాయి’’అని గఢాలో జీవించే ఉమాశంకర్ పటేల్ చెప్పారు.

మరోవైపు రామభద్రాచార్య జీ మహారాజ్‌ను తన గురువుగా ధీరేంద్ర చాలా సార్లు చెప్పారు. రామభద్రాచార్య పుట్టుకతోనే అంధులు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు చాలా మంది ఆయన్ను గురువుగా భావిస్తుంటారు.

ధీరేంద్ర కృష్ణ శాస్త్రి

ఇంటర్నెట్‌తో ప్రజల్లోకి...

భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో లబ్ధి పొందినవారిలో బాబా ధీరేంద్ర కూడా ఒకరు.

యూట్యూబ్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా వేదికలతో సంస్కార్ చానెల్ ద్వారా వీడియోలతో ఆయన చాలా మందికి చేరువయ్యారు. ఆయన ప్రస్థానంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పుకోవాలి.

నేడు ధీరేంద్ర వీడియోలకు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్‌లో ఆయనకు 37 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

మరోవైపు ఫేస్‌బుక్‌లో బాగేశ్వర్ ధామ్ పేజీకి 30 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్విటర్లో 60 వేల మంది, ఇన్‌స్టాలో 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

అసలు ఇంటర్నెట్‌ను ధీరేంద్ర శాస్త్రి, బాగేశ్వర్ ధామ్ ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు ముందుగా మనం గమనించాలి.

బాగేశ్వర్ ధామ్ వెబ్‌సైట్‌ను గూగుల్ సెర్చ్‌ను దృష్టిలో ఉంచుకొని సిద్ధంచేశారు. గూగుల్‌లో ప్రజలు ఏం సెర్చ్ చేస్తారు? ఎక్కువగా దేని గురించి తెలుసుకోవాలని భావిస్తారు? వారు ఉపయోగించే కీవర్డ్స్ ఏమిటి? లాంటి అంశాలకు వీరు ప్రాధాన్యం ఇస్తారు.

మనం గూగుల్‌లో ధీరేంద్ర అని సెర్చ్ చేస్తే, నేరుగా ఆయన వెబ్‌సైట్‌లోకి వెళ్తాం. జనవరి 23న తమ వెబ్‌సైట్ 'బాగేశ్వర్ ధామ్ శ్రీ యంత్రం’’ను విక్రయానికి పెట్టారు. కేవలం భారత్‌లో 500 మంది అదృష్టవంతులకు మాత్రమే ఇది లభిస్తుందని, దీన్ని ఇంటిలో పెట్టుకుంటే పేదరికం పోతుందని రాసుకొచ్చారు. మరోవైపు సంస్కార్ టీవీ వెబ్‌సైట్‌లోనూ ధీరేంద్ర ప్రొడక్ట్స్‌ను విక్రయానికి పెడుతుంటారు. ఆ సంస్కార్ టీవీని యోగాగురు రామ్‌దేవ్ బాబా మొదలుపెట్టారు.

ధీరేంద్ర వివాదాల్లో చిక్కుకున్నప్పుడు రామ్‌దేవ్ కూడా ఆయనకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తుంటారు.

ధీరేంద్ర కృష్ణ శాస్త్రి

ధీరేంద్ర దర్బారుకు వెళ్లడం ఎలా?

సోషల్ మీడియాలో ధీరేంద్ర అభిమానులుగా చాలా మంది మనకు కనిపిస్తుంటారు. దీనిపై ధీరేంద్ర కుటుంబ సభ్యుల్లో ఒకరైన లోకేశ్ గార్గ్ బీబీసీ హిందీతో మాట్లాడారు.

''రోజూ దాదాపు 10-15 వేల మంది బాగేశ్వర్ ధామ్‌కు వస్తారు. మంగళవారం, శనివారం అయితే, ఈ భక్తుల సంఖ్య దాదాపు 50,000 నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది’’అని చెప్పారు.

అసలు ఈ దర్బారుకు వెళ్లడం ఎలా? దీని కోసం ప్రత్యేక టోకెన్లు ఇస్తారు. దీనికిగాను పేరు, తండ్రి పేరు, చిరునామా, ఫోన్ నంబరు లాంటి వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఆ టోకెన్ ఇచ్చిన రోజు మాత్రమే మనం అక్కడకు వెళ్లాల్సి ఉంటుంది.

బాగేశ్వర్ ధామ్‌కు వచ్చే నిధులతో ఏం చేస్తారో తమ వెబ్‌సైట్‌లో రాసుకొచ్చారు. అవి ఏమిటంటే గోరక్షణ, పేద బాలికలకు వివాహం, పేదలకు భోజనం పెట్టడం, పర్యావరణ పరిరక్షణ, వైదిక గురుకులాల కోసం.. లాంటివి వీటిలో ఉన్నాయి.

పర్యావరణ పరిరక్షణ కోసం తాము కృషి చేస్తామని ధీరేంద్ర వెబ్‌సైట్ చెబుతోంది. అయితే, గఢాలోనే పర్యావరణానికి హాని చేస్తున్నట్లు వీరిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను కోరాం. అయితే, వార్త రాసే సమయానికి మాకు ఎలాంటి స్పందనా రాలేదు.

ధీరేంద్ర కృష్ణ శాస్త్రి

భక్తులు ఎవరు?

సాధారణ ప్రజలతోపాటు కొందరు ప్రముఖులు కూడా ధీరేంద్ర దగ్గరకు వస్తున్నారు. ధీరేంద్ర ఎదుగుదలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అలోక్ చతుర్వేదికి ప్రధాన పాత్ర పోషించినట్లు స్థానికులు చెబుతుంటారు.

కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, గిరిరాజ్ సింగ్‌లతోపాటు బీజేపీ నాయకుడు కైలాస్ విజయవర్గీయ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్ర తదితరులు కూడా ధీరేంద్రను కలవడానికి వచ్చారు.

ప్రధాన నాయకులు ధీరేంద్ర దర్బాకు వెళ్లినప్పుడు కేవలం ఫోటోలు మాత్రమే బయటకు వస్తాయి. అయితే, సాధారణ ప్రజలు ఆయన్ను కలవడానికి వెళ్లి వచ్చిన తర్వాత వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు.

అయితే, ఇటీవల కాలంలో ఆయన కొన్ని మూఢనమ్మకాలను కూడా ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. మీడియాకు కూడా ఆయన తరచూ ఇంటర్వ్యూలు ఇస్తుంటారు.

జనవరి 20న ఛత్తీస్‌గఢ్‌లో ధీరేంద్ర ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. అక్కడకు వచ్చిన భక్తుల్లో ఒకరిని మీరే ఎంపిక చేయండని సూచించారు. ఒకరిని ఎంపిక చేసిన తర్వాత ఆమె మాట్లాడకముందే, తాళపత్రంపై ఆమె సమస్య రాస్తానని వీరేంద్ర చెప్పారు. అలానే ఏదోరాసిన పత్రాలను అక్కడి విలేకరులకు ఆయన చూపించారు.

దీనిపై అక్కడకు వెళ్లిన విలేకరులతో బీబీసీ మాట్లాడింది. ''నేను అలాంటివేమీ నమ్మను. అక్కడకు నన్ను మా మీడియా సంస్థ పంపించింది. కానీ, నన్ను ఒక మహిళను ఎంపిక చేయమన్నారు. ఎవరిని ఎంపిక చేయాలో నాకు ఏమీ చెప్పలేదు. నేను ఒకరిని ఎంపిక చేసిన తర్వాత, ధీరేంద్ర రాసిన తాళపత్రాలను చూపించి మీ మనసులో ఇదే సమస్య ఉందా? అని అడిగాను. ఆమె అవునని అంది. ఇది అద్భుతమో లేదా ఇంకేదైనానో నాకు తెలియదు. ప్రజలు ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి’’అని ఆ రిపోర్టర్ చెప్పారు.

ధీరేంద్ర కృష్ణ శాస్త్రి

వివాదాస్పదంగా...

ధీరేంద్ర వేదికలపై కాస్త భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. ఒక్కసారిగా ఏదో చెబుతుంటారు. ఆ తర్వాత చప్పట్లు కొడుతుంటారు. మధ్యమధ్యలో జైశ్రీమ్ నినాదాలు చేస్తుంటారు.

భూత-ప్రేతాలను కూడా వదిలిస్తానని ఆయన చెబుతుంటారు. అవి తనకు వంగి నమస్కరించి వెళ్లిపోతాయని అంటారు. ఆయన సభ మధ్యలో భక్తులు ఒక్కసారిగా లేచి అరుస్తుంటారు.

''ఇది కేవలం బాలాజీ మహిమ. ఆయన మాటలే మా నోటి నుంచి వస్తున్నాయి’’అని ధీరేంద్ర చెబుతుంటారు.

కశ్మీర్ ఫైల్స్, పఠాన్ లాంటి సినిమాల నుంచి హిందూ దేశం, సనాతన ధర్మం, ఘర్ వావసీ ఇలా చాలా అంశాలపై ఆయన మాట్లాడుతుంటారు.

మే 2022లో ధీరేంద్ర శాస్త్రి కనిపిస్తున్న ఒక వీడియో వైరల్ అయ్యింది. దీనిలో ఒక వ్యక్తి ఆయన కాళ్లు తాకుతూ కనిపించారు. అయితే, ''నన్ను ముట్టుకోవద్దు. నువ్వు అంటరానివాడివి’’అని ధీరేంద్ర చెబుతున్నట్లు దానిలో కనిపిస్తోంది.

ధీరేంద్ర చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు

  • మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారు. చంద్రుడిని పూజించాల్సిన అవసరం ఏముంది?
  • పిరికిపందలైన హిందువులారా మేల్కోండి. ఆయుధాలు పట్టుకోండి.. మనమంతా ఒకటే.
  • హిందువులంతా ఏకమై రాళ్వు రువ్వే వారి ఇంటిపైకి బుల్డోజర్లతో వెళ్లాలి.

అసలేం జరుగుతోంది?

భక్తుల మనసులో మాటను ధీరేంద్ర ఎలా చెబుతున్నారు? దీనికి చాలా సమాధానాలు ఉన్నాయి.

ఇదే ప్రశ్నను మనం ధీరేంద్రను అడిగితే – మేం ఏమీ చేయడం లేదు. ''అంతా బాలాజీనే చేస్తున్నారు’’అని అంటారు.

భక్తులను అడిగితే- ఇది అద్భుతం అని చెబుతారు.

అదే సైకాలజిస్టులు, మెజీషియన్లను అడిగితే, మీకు పూర్తి భిన్నమైన సమాధానం వస్తుంది. ఇక్కడ ''మెంటలిజం’’అనే విద్య గురించి ప్రస్తావన వస్తుంది. దీన్నే మైండ్ రీడింగ్ అని కూడా అంటారు.

మనుషులు ఇచ్చే సంకేతాలు, వారు ఉపయోగించే పదాలు, భాష ద్వారా వారి మనసులో ఏముందో చెప్పే విద్య ఇది. దీనిపై సుహాని షా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తుంటారు. ఆమె టీవీ చర్చల్లో కూడా పాల్గొంటారు.

''మ్యాజిక్‌లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో మెంటలిజం కూడా ఒకటి. నా వయసు 32. నేను ఏడేళ్ల నుంచి మ్యాజిక్ చేస్తున్నాను. మెంటలిజంలోనూ నాకు పదేళ్ల అనుభవముంది. దీనిలో కొన్ని టెక్నిక్‌లను ఉపయోగిస్తుంటారు. కళ్ల కదలికలు, శరీర నుంచి వచ్చే సంకేతాలు, మాట్లాడే విధానం ఇలా చాలా అంశాల నుంచి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు’’అని ఆమె అన్నారు. ధీరేంద్ర చెబుతున్న మాటలతో సుహానీ విభేదించారు.

''సనాతన ధర్మం నిజం చెప్పమని సూచిస్తోంది. ఎవరైనా అబద్ధాలు అసలు చెప్పకూడదు. ఒకవేళ నిజంగా ఇతరుల మైండ్‌ను ధీరేంద్ర చదవగలిగితే, దీన్ని ట్రిక్‌గా చూడాలి. అంతేకాదు అద్భుతంగా చెప్పకూడదు’’అని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Bageshwar Dham: Did Dhirendra Krishna Shastri really find the word in the mind, what is this?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X