కేబినెట్లో దత్తాత్రేయ, అశోక గజపతి: వెంకయ్యకు రైల్వే!
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు బండారు దత్తాత్రేయకు నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దత్తాత్రేయకు ఆదివారం పార్టీ అధిష్టానం నుండి ఫోన్ వచ్చింది. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి అందుబాటులో ఉండాలని వారు దత్తాత్రేయకు సూచించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)ల నుండి బిజెపి తరఫున ముగ్గురు ఎంపీలు గెలుపొందారు. తెలంగాణలో సికింద్రాబాద్ నుండి బండారు దత్తాత్రేయ, సీమాంధ్రలో నర్సాపురం నుండి గోకరాజు రంగరాజు, విశాఖ నుండి కంభంపాటి హరిబాబులు గెలుపొందారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో.. తెలంగాణ నుండి ఒకరిని కేబినెట్లోకి తీసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

అందులో భాగంగా బండారు దత్తాత్రేయకు అవకాశం ఉందంటున్నారు. రేపు (సోమవారం) మోడీతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందులో దత్తాత్రేయ ఉండే అవకాశముంది. గతంలో ఆయన మంత్రిగా పని చేసిన అనుభవముంది. ఇక సీమాంధ్ర విషయానికి వస్తే టిడిపి నుండి ప్రస్తుతానికి ఒకరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ అవకాశం అశోక గజపతి రాజుకు దక్కనుంది. సుజనా చౌదరి కూడా రేసులో ఉన్నప్పటికీ సీనియర్ అయిన అశోకకు ఛాన్స్ దక్కింది.
బండారు దత్తాత్రేయ ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు హైదరాబాదు నుండి ఢిల్లీకి బయలుదేరనున్నారు. మరోవైపు తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి మధ్యాహ్నం ఢిల్లీ బయల్దేరారు. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడానికి ఆయన హస్తిన వెళ్లారు.
టిడిపికి ఒక్కటే: హరిబాబు
కేంద్రమంత్రివర్గంలో టిడిపికి ఒకటే మంత్రి పదవి ఇవ్వనున్నట్లు బిజెపి సీమాంధ్ర అధ్యక్షులు, విశాఖ ఎంపీ హరిబాబు చెప్పారు. భాగస్వామ్య పార్టీలకు ఒక్కో మంత్రి పదవి మాత్రమే ఇవ్వాలని మోడీ నిర్ణయించినట్లు తెలిపారు. సీమాంధ్ర బిజెపిలో వెంకయ్య నాయుడుకు అవకాశం దక్కొచ్చు. వెంకయ్యకు రైల్వే శాఖ అప్పగించవచ్చునని రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. విజయమ్మ పైన గెలుపొందిన హరిబాబు పేరును కూడా పరిశీలించే అవకాశముంది.
జయ, కేరళ సిఎం డుమ్మా
మరోవైపు మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ హాజరు అయ్యే అవకాశాలు లేవు. కాగా, కేబినెట్ మంత్రుల పేర్లను మోడీ సోమవారం ఉదయం రాష్ట్రపతికి పంపించనున్నారు.












Click it and Unblock the Notifications